బెంగళూరు: గతేడాది సంచలనం రేపిన మహిళా వైద్యురాలు డాక్టర్ కృతికా రెడ్డి (28) హత్యకేసులో ఊహించని మలుపు తిరిగింది. ప్రియురాలి కోసం భార్య కృతికాను హత్య చేసిన మహేంద్రరెడ్డికి, అదే ప్రియురాలు పోలీసుల ముందు వ్యతిరేకంగా మాట్లాడింది. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
కృతికారెడ్డి గతేడాది ఏప్రిల్ నెల 23న అనుమానాస్పదంగా మరణించారు. విచారణ చేపట్టిన పోలీసులు 2,322 పేజీల ఛార్జ్ షీట్‌ను నమోదు చేసి కోర్టుకు అందించారు. మారతహళ్లి పోలీసులు తీగలాగితే డొంకంత కదిలింది అన్న చందంగా కృతికారెడ్డి మరణించక ముందు ఏం జరిగిందో చెప్పాలంటూ డాక్టర్ మహేందర్‌రెడ్డి నుంచి వాగ్మూలం తీసుకున్నారు.
ఆ వాంగ్మూలంలో ‘ఏప్రిల్ 23వ తేదీ రాత్రి నేను నా భార్యకు క్యాన్యులా (ఇంట్రావీనస్ పైపు) ద్వారా మందు ఇచ్చాను. మేము అర్ధరాత్రి నిద్రపోయాము. తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో నేను నిద్రలేచి క్యాన్యులాను తీసేశాను’అని డాక్టర్ మహేంద్ర రెడ్డి పేర్కొన్నారు. అంతే ఈ ఒక్క వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు విచారణ చేపట్టారు. దర్యాప్తులో భర్తే హంతకుడు అని నిర్ధారించేందుకు మొత్తం ఐదు రకాల ఆధారాలు, కారణాల్ని గుర్తించారు.
ఇందుకోసం 23 డాక్టర్లతో పాటు బాధితురాలి కుటుంబ సభ్యులు,స్నేహితులు,సాక్షులు ఇలా 77 మంది నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. వాటి ఆధారంగా 2,322 పేజీల ఛార్జ్ షీట్‌ను కోర్టుకు అందించారు. విచారణ చేపట్టిన కోర్టు ఛార్జ్ షీట్‌లో 77మంది స్టేట్మెంట్, సేకరించిన ఆధారాలు,కారణాలు ఆధారంగా భర్తే హంతకుడని న్యాయస్థానం తేల్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తరుఫు న్యాయవాది ప్రసన్న కుమార్ కోర్టులో తన వాదనల్ని వినిపించారు.
వైద్యురాలు హత్యకేసులో భర్తే ప్రధాన నిందితుడు. అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసును విచారించాం. విచారణలో భర్తే హంతకుడని తేలింది. అందుకు ఊతం ఇచ్చేలా ఐదు రకాల ఆధారాల్ని సైతం సేకరించాం. వాటిల్లో నిందితుడు పోలీసులకు ఇచ్చిన ‘ఏప్రిల్ 23వ తేదీ రాత్రి నేను నా భార్యకు క్యాన్యులా (ఇంట్రావీనస్ పైపు) ద్వారా మందు ఇచ్చాను. మేము అర్ధరాత్రి నిద్రపోయాము. తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో నేను నిద్రలేచి క్యాన్యులాను తీసేశాను’ స్టేట్మెంట్ కీలకంగా వ్యవహరించినట్లు చెప్పారు.
నిందితుడు కృతికాతో ఆమె మరణానికి ముందు కొన్ని గంటలపాటు ఆమెతో ఉన్నాడని సాక్ష్యాలు నిర్ధారిస్తున్నాయి. వైద్య ఆధారాల ప్రకారం, కృతికా శరీరంలో ప్రొపోఫోల్ అనే శక్తివంతమైన అనస్థీషియా మందు ఆనవాళ్లు బయటపడ్డాయి. ముఖ్యంగా ఆమె కాళ్లలో కూడా ఈ ఆనవాళ్లు కనిపించడం, మందు బయట నుంచి ఇంజెక్షన్ ద్వారా ఇచ్చినట్లు స్పష్టంగా చూపుతోంది. కృతికా మరణం తర్వాత నిందితుడు పోస్ట్‌మార్టం జరగకుండా తీవ్రంగా వ్యతిరేకించాడు. తన మామగారు, కుటుంబ సభ్యులను ఒత్తిడి చేసి అడ్డుకోవాలని ప్రయత్నించాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఒక వైద్యుడిగా ఆయనకు పోస్ట్‌మార్టం ద్వారా నిజమైన మరణ కారణం బయటపడుతుందని తెలుసు’
అదనంగా, నిందితుడు స్వయంగా ప్రొపోఫోల్ మందును ఒక ఫార్మసిస్ట్ వద్ద కొనుగోలు చేసినట్లు ఎలక్ట్రానిక్ ఆధారాలు చూపుతున్నాయి. “తన మొబైల్ ఫోన్ ద్వారా, తన బ్యాంక్ ఖాతా ద్వారా ఆన్‌లైన్ చెల్లింపు చేశాడు. కృతికా మరణం అనంతరం, నిందితుడు ఒక మహిళా స్నేహితురాలికి పేమెంట్ యాప్ ద్వారా సందేశాలు పంపినట్లు కూడా ఆధారాలు చూపుతున్నాయి.
‘ప్రియురాలి కోసమే తన భార్యను హత్య చేసినట్లు చెప్పుకొచ్చాడు. కానీ సదరు ప్రియురాలు మాత్రం ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని కొట్టి పారేసింది. దీంతో ‘నేను ఎప్పటికీ హంతకుడిగానే ఉంటాను, నువ్వు సంతోషంగా జీవించు’ అని ప్రతిస్పందించాడు” అని ప్రాసిక్యూటర్ వెల్లడించారు. ఈ సందేశాలు నిందితుడి ఉద్దేశాన్ని, ప్రేరణను స్పష్టంగా చూపడమే కాకుండా, అతని నేరాన్ని ఒప్పుకున్నట్లుగా ఉన్నాయని ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించారు.
జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్రరెడ్డి (32), డాక్టర్ కృతికారెడ్డి (28) 2024 మే 26న పెద్దలు వైభవంగా పెళ్లి చేశారు. ఇద్దరూ మారతహళ్లిలో నివాసం ఉన్నారు. డాక్టర్ కృతికారెడ్డి బెంగళూరు ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రిలో చర్మ రోగ నిపుణురాలుగా పనిచేసే వారు. అదే ఆసుపత్రిలో భర్త జనరల్ సర్జన్.
కాగా, తన వివాహేతర సంబంధానికి డాక్టర్ కృతికారెడ్డి అడ్డుగా ఉందనే ఆమె భర్త డాక్టర్ మహేంద్రరెడ్డి దారుణానికి ఒడిగట్టాడు. ప్రియురాలితో సాన్నిహిత్యం కోసమే భార్యను హత్య చేశాడు. ఆ సమయంలో కృతిక సోదరి డాక్టర్ నిఖిత మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరితో వివాహం కాక మునుపు నుంచే మరో వైద్యురాలితో మహేంద్రరెడ్డికి సంబంధం ఉందని ఆరోపించారు. వివామైన అనంతరమూ ఆ సంబంధాన్ని కొనసాగించాడని తప్పుబట్టారు. వివాహమైన రెండు నెలల నుంచే సొంతంగా ఆసుపత్రి పెట్టుకునేందుకు నగదు కావాలని ఒత్తిడి చేయడం, ఆ తర్వాత చికిత్స పేరిట ఎక్కువ మోతాదులో అనస్తీషియా డోసు ఇచ్చాడని ఆక్రోశించారు. ఆపై నేరం భయటపడుతుందనే ఉద్దేశ్యం తన అక్క భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించకుండా అడ్డుకునే ప్రయత్నించినట్లు మండిపడింది.


