ఫీజు కట్టలేదని హాల్ టికెట్ నిరాకరణ
సాక్షి,బళ్లారి: ద్వితీయ పీయూసీ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రైవేటు కళాశాల యాజమాన్యం కర్కఽశంగా వ్యవహరించడంతో ఓ విద్యార్థినికి శాపంగా మారింది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పీయూసీ పరీక్షలు ప్రారంభం కాగా హావేరి జిల్లా రాణిబెన్నూరులోని బీఏజేఎస్‌ఎస్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని జెస్సికా సారా రూ.30 వేలు ఫీజు చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యం హాల్ టికెట్‌ను నిరాకరించారు. పరీక్షకు వెళ్లే ముందు కూడా విద్యార్థిని తనకు హాల్ టికెట్ ఇవ్వాలని ప్రాధేయపడింది. ఎంత బ్రతిమలాడినా ఫీజు కడితేనే కాని హాల్ టికెట్ ఇవ్వబోమని మహిళా లెక్చరర్ తేల్చిచెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఉన్నతాధికారులు స్పందించారు. కన్నడ పరీక్ష రాయకుండా అడ్డుకున్న నేపథ్యంలో కళాశాల యాజమాన్యంపై పలువురు సీరియస్ అయ్యారు. తక్షణం హాల్ టికెట్ ఇవ్వాలని కళాశాల యాజమాన్యానికి సూచించారు.
బోర్డు నిర్వాకంతో విద్యార్థులకు పాట్లు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో శనివారం నుంచి ద్వితీయ పీయూసీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా కళ్యాణ కర్ణాటక భాగంలోని యాదగిరి జిల్లాలో హాల్ టికెట్‌లో గందరగోళం నెలకొంది. ఇంటర్ బోర్డు చేసిన నిర్వాకంతో విద్యార్థులు పలు అగచాట్లు పడ్డారు. పరీక్ష కేంద్రాలను వెతకడం కోసం నానావిధాలుగా ఇబ్బందులు పడ్డారు. హాల్ టికెట్‌లో పరీక్ష కేంద్రం పేరు తప్పుగా ముద్రితమైంది. పరీక్ష కేంద్రం ఒక చోట ఉంటే అధికారులు హాల్ టికెట్‌లో తప్పుడు చిరునామా ముద్రించి గంటల తరబడి వేచి ఉండేలా చేశారని విద్యార్థులు వాపోయారు. యాదగిరి సభా పీయూ కళాశాలలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు లుంబిని పార్క్ వద్ద కళాశాల ఉంటే గంజ్ సర్కిల్‌లో పరీక్ష కేంద్రం ఉన్నట్లు హాల్ టికెట్‌లో చూపించడంతో విద్యార్థులు కొంత గందరగోళంలో పడ్డారు. చివరికి విద్యార్థులకు పరీక్ష రాయడానికి అవకాశం కల్పించారు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
పరీక్షకు హాజరు కాలేక విద్యార్థి కన్నీరు
కళాశాల యాజమాన్యంపై అధికారుల మండిపాటు


