అక్రమంగా శ్మశాన భూమి ఖాతా మార్పు
సాక్షి,బళ్లారి: తాలూకాలోని శంకరబండ గ్రామంలో వీరశైవ లింగాయత్ సమాజానికి చెందిన శ్మశాన భూమి ఖాతా నకిలీ పత్రాల ఆధారంగా మార్పు చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ విషయంపై శనివారం తాలూకాలోని శంకరబండకు చెందిన వీరశైవ సమాజ ప్రముఖులు అధికారులను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గ్రామ సర్వేనంబర్–163లో ఉన్న 1 ఎకరా 5 సెంట్ల భూమిని వీరశైవ లింగాయత్ రుద్రభూమిగా వినియోగిస్తున్నారని తెలిపారు. 1977–78వ సంవత్సరంలో గ్రామంలోని అయ్యప్ప కుమారుడు హనుమంతప్ప సమాజ ప్రయోజనార్థం ఈ భూమిని దానం చేశారని గుర్తు చేశారు. అప్పటి నుంచి వీరశైవ లింగాయత్ సమాజానికి చెందిన వారు మృతి చెందితే అక్కడే అంత్యక్రియలు నిర్వహించేవారన్నారు. అయితే 2004–05వ సంవత్సరంలో ఎర్రెప్ప అనే వ్యక్తి తప్పుడు రికార్డులు సృష్టించి తన పేరున హక్కు మార్చుకున్నారని ఆరోపించారు. తర్వాత ఎర్రప్ప భార్య పేరు మీద రికార్డులు సృష్టించారన్నారు. అయితే 13 ఏళ్లుగా ఎటువంటి అభ్యంతరాలు చేయలేదని, మల్లమ్మ కుమారులు ఈ భూమి తమది అంటూ వివాదం సృష్టిస్తున్నారని గుర్తు చేశారు. సమగ్రంగా తనిఖీ చేసి వీరశైవ లింగాయత్ శ్మశాన భూమి వివాదం పరిష్కరించాలని కోరారు. శంకరబండకు చెందిన వీరశైవ లింగాయత్ సమాజ ప్రముఖులు రాజశేఖరగౌడ, ప్రవీణ్, చంద్రయ్యస్వామి, రుద్రగౌడ, బసవనగౌడ, పంపాపతి, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు వీరశైవ లింగాయత్ ప్రముఖుల ఫిర్యాదు


