కర్ణాటక: విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడి, కూతురు పుట్టిన తరువాత రూ.36 లక్షల డబ్బుతో ఉడాయించిన ఘరానా భర్త ఉదంతమిది. బెంగళూరులో బనశంకరిపోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. ఓ యువతి భర్తకు అనారోగ్యం కారణంగా 2021లో విడాకులు తీసుకుని విడిగా ఉంటోంది.
తరువాత మోసగాడు మోహన్‌రాజ్ పరిచయమై ప్రేమించింది, 2022లో వివాహం చేసుకున్నారు. తరువాతి ఏడాది వారికి కూతురు పుట్టింది. మోహన్‌రాజ్‌ను నమ్మిన ఆమె అడిగినంత డబ్బు ఇచ్చింది. కొత్తగా ఇల్లు కట్టిస్తానని చెప్పడంతో బంగారం కుదువ పెట్టి డబ్బులు ఇచ్చింది, ఇలా రూ.36 లక్షల వరకూ జేబులో వేసుకున్నాడు. గతేడాది ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటినుంచి జాడ లేదు. దీంతో కంగుతిన్న బాధితురాలు మోసపోయినట్లు గుర్తించింది. తనకు న్యాయం చేయాలని బనశంకరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.


