రొయ్యల సాగు సున్నితమైనది. నీటి నాణ్యతలో మార్పులు, వ్యాధులు, వాతావరణ మార్పులు వంటి అంశాలకు చాలా త్వరగా మార్పు కనిపిస్తుంది. ఎంత మంచిగా నిర్వహణ చేసినా, కొన్ని సందర్భాల్లో సాగును కొనసాగించడం ప్రమాదకరంగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో రైతులు అత్యవసర పట్టుబడి చేస్తారు. అంటే నిర్ణయించిన తుది తేదీకి ముందే పట్టుబడి జరుపుతారు. ఇలా చేయడం ద్వారా జీవించి ఉన్న మిగిలిన రొయ్యలను కాపాడవచ్చు. ఆర్థిక నష్టాలను తగ్గించవచ్చు. రోగాలు ఇతర చెరువులకు వ్యాపించకుండా ఆపవచ్చు. డిస్ట్రెస్ హార్వెస్ట్ అనేది వైఫల్యం కాదు. భారీ నష్టాలను తప్పించుకునే ఒక తెలివైన నిర్ణయం.
అత్యవసర పట్టుబడి అంటే?
రొయ్యల చెరువులో పరిస్థితులు హానికరంగా మారినప్పుడు, ముందుగానే రొయ్యలను పట్టుబడి చేసుకోవడం. ఇది సాధారణంగా ప్రమాద నిర్వహణ కోసం తీసుకునే నిర్ణయం. పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నప్పుడు వెంటనే అత్యవసర పట్టుబడి చెయ్యటం సాగును కొనసాగించడం కన్నా మంచి పని.
అత్యవసర పట్టుబడి ఎప్పుడు చెయ్యాలి?
1. వ్యాధులు సోకినప్పుడు లేదా అనుమానం ఉన్నప్పుడు...
రొయ్యల చెరువుల్లో వ్యాధులు చాలా వేగంగా వ్యాపిస్తాయి. రైతులు ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే అప్రమత్తంగా ఉండాలి:
∙ఫీడ్ తీసుకోవడం ఆకస్మికంగా తగ్గటం
∙బలహీనంగా కనిపించడం లేదా ఉపరితలంపై ఈదటం
∙ఎర్రగా కనిపించటం, గుల్ల వదులుగా ఉండడం
∙అకస్మాత్తుగా మరణాలు
∙డబ్ల్యూఎస్‌ఎస్‌వీ, ఈహెచ్‌పీ, ఐఎంఎన్‌వీ, ఐహెచ్‌హెచ్‌ఎన్‌వీ వంటి వ్యాధులు కొన్ని గంటల్లోనే/ రోజుల్లోనే చెరువును పూర్తిగా నాశనం చేయగలవు. త్వరగా హార్వెస్ట్ చేయటం పెద్ద నష్టాన్ని నివారిస్తుంది.
2. నీటి నాణ్యత తీవ్రంగా క్షీణించినప్పుడు...
కొన్నిసార్లు నీటి నాణ్యత చాలా వేగంగా పడిపోతుంది. దాన్ని సరిచేయడానికి సమయం సరిపోదు.
సాధారణ కారణాలు... ∙మబ్బు వాతావరణం లేదా మరణాలు ∙అధిక అమోనియా లేదా నైట్రైట్
అలాగే ప్లాంక్టాన్ నీరు రంగు మారటం ∙భారీ వర్షాల వల్ల సెలినిటీ లేదా పి.హెచ్. ఒక్కసారిగా పడిపోవటం
ఇవి అదుపులోకి రాకపోతే అత్యవసర పట్టుబడి ఉత్తమం.
3. చెరువు అడుగు పాడై విషతుల్యం కావటం...
రొయ్యలు చెరువు అడుగులోనే ఎక్కువ కాలం ఉంటాయి. అడుగు భాగం చెడితే అవి త్వరగా ప్రభావిత మవుతాయి.
జాగ్రత్త సంకేతాలు... కుళ్ళిన గుడ్డు వాసన ∙రొయ్యలు అంచులకు లేదా ఎయిరేటర్ల దగ్గరకు చేరటం
అధిక బురద లేదా నల్లటి నేల ∙పేగు ఖాళీగా ఉండటం, బలహీనంగా కనిపించటం
ఇవి వ్యాధులకు ముందు వచ్చే సూచనలు
4. తీవ్రమైన వాతావరణం / ప్రకృతి వైపరీత్యాలు
తుఫాన్లు, భారీవర్షాలు, వరదలు వంటి సందర్భాల్లో చెరువు రక్షణకు ప్రమాదం ఉంటుంది. చెరువు గట్లు తెగి΄ోవటం లేదా నీరు నిండి΄ోవడం లాంటి పరిస్థితుల్లో ముందుగానే హార్వెస్ట్ చేయటం సురక్షితం.
5. ఆర్థిక / మార్కెట్ కారణాలు
చాలాసార్లు మార్కెట్ పరిస్థితుల వల్ల కూడా ముందుగానే హార్వెస్ట్ చేస్తారు.
ఉదాహరణకు:
రొయ్యల ధరలు ఒక్కసారిగా పడిపోవటం, ప్రాసెసర్లు కొనుగోలు తగ్గించటం
ఫీడ్, విద్యుత్ ఖర్చులుపెరగటం
ప్రస్తుత సైజుకు మంచి మార్కెట్ ధర లభించడం..
అత్యవసర పట్టుబడిలో రకాలు:
1. పాక్షిక పట్టుబడి
స్టాక్‌లో కొంత భాగమే ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా చెరువులో బయోమాస్ అధికంగా ఉన్నప్పుడు పాక్షిక పట్టుబడి చేస్తారు. సాధారణంగా కొంత నీరు వదిలి లాగుడు వలలు, చేతి వలలతో పట్టుబడి చేస్తారు. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మిగిలిన రొయ్యలు పెరుగటానికి అవకాశం ఉంటుంది.
2. పూర్తి పట్టుబడి
ఈ క్రింది సందర్భాల్లో పూర్తిగా పట్టుబడి చేస్తారు
వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నప్పుడు, మరణాలు పెరిగినప్పుడు
నీటి నాణ్యత పూర్తిగా క్షీణించినప్పుడు తీవ్రమైన వాతావరణ హెచ్చరికలున్నప్పుడు
ఈ సందర్భంలో చెరువును పూర్తిగా వదిలి, రొయ్యలను వెంటనే పట్టుబడి చేయాలి.
అత్యవసర పట్టుబడి చేసే విధానం:
మొదటగా చెరువు పరిస్థితి త్వరగా అంచనా వేయాలి. రొయ్యల సైజు, సర్వైవల్, మేత తీసుకోవటం, సమస్యకు కారణం వంటి అంశాలు చూడాలి. దీనిపై ఆధారపడి పాక్షిక లేదా పూర్తి పట్టుబడి చేపట్టాలి.
నిర్ణయం తీసుకున్న వెంటనే ఏర్పాట్లు మొదలు పెట్టాలి. కొనుగోలుదారులకు సమాచారం ఇవ్వాలి. ఫీడ్ ఇవ్వటం తగ్గించాలి ఎయిరేషన్ పెంచాలి. పని వారు, వలలు, ఐస్, వాహనం వంటివి సిద్ధం చేయాలి.
పట్టుబడి సమయంలో రొయ్యలను జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాలి. పాక్షిక పట్టుబడి కోసం లాగుడు వలలు, చేతి వలలు అనువైనవి. పూర్తి హార్వెస్ట్ కోసం నీటిని నెమ్మదిగా వదలాలి/దింపాలి. రొయ్యలను వెంటనే ఐస్‌లో ఉంచాలి. ∙రొయ్యలను శుభ్రపరిచి, గ్రేడింగ్ చేసి, చల్లని పరిస్థితుల్లో కొనుగోలుదారునికి పంపాలి.
అత్యవసర పట్టుబడి తర్వాత చెరువు నిర్వహణ
అత్యవసర పట్టుబడి తర్వాత చెరువులో చని΄ోయిన రొయ్యలు ఉంటే వాటిని సరిగ్గా ఏరి దూరంగా పాతి పెట్టాలి. కాలువలు లేదా వాగుల్లో వేస్తే వ్యాధులు వ్యాపిస్తాయి. ∙చెరువును పూర్తిగా శుభ్రపరచి డిస్‌ఇన్ఫెక్ట్ చెయ్యాలి. అడుగున పేరుకు΄ోయిన సేంద్రియ వ్యర్థాలను తొలగించాలి. అవసరమైనంత క్లోరిన్ లేదా సున్నం వేయాలి. చెరువు అడుగు పూర్తిగా ఆరాలి. అదనపు బురదను తొలగించాలి. ఇన్లెట్, అవుట్‌లెట్ ప్రాంతాలను కూడా శుభ్రం చేయాలి. ∙తదుపరి సాగు ప్రారంభించే ముందు ప్రధాన కారణాన్ని గుర్తించాలి. సీడ్ నాణ్యత, నీటిపరీక్షలు, ఎయిరేషన్, బయోసెక్యూరిటీ, ఫీడింగ్ తదితర విషయాల్లో లోపాలున్నాయా అని పరిశీలించాలి.
ఇదీ చదవండి: స్మృతి మంధాన పెళ్లి వాయిదా : మరో వార్త వైరల్
ఒక ముఖ్యమైన రక్షణ చర్య
సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం పెద్ద నష్టాలను నివారించగలదు. వ్యాధులు ప్రబలకుండా ఆపగలదు. రైతును ఆర్థికంగా రక్షించగలదు. అవసరమైనప్పుడు అత్యవసర పట్టుబడి చెయ్యాల్సిన పరిస్థితిని వైఫల్యంగా కాకుండా, తెలివైన, సమయోచిత నిర్ణయంగా చూడాలి. మంచి బయోసెక్యూరిటీ, నీటినాణ్యతపై నిత్యపర్యవేక్షణ, సమర్థవంతమైన చెరువు నిర్వహణ తద్వారా డిస్ట్రెస్ హార్వెస్ట్ అవసరాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
కీలకమైన నిరోధక చర్యలు
అత్యవసర పట్టుబడి అవసరం రాకుండా ఉండాలంటే...
ఎస్‌పీఎఫ్/ వ్యాధి రహిత సీడ్ ఉపయోగించాలి
బలమైన బయోసెక్యూరిటీ పాటించాలి
ఓవర్ స్టాకింగ్, ఓవర్ ఫీడింగ్ చేయకూడదు
చెరువు అడుగును శుభ్రంగా ఉంచాలి
ప్రోబయోటిక్స్ వాడాలి – అత్యవసర ఎయిరేటర్లు సిద్ధంగా ఉంచాలి
రోజూ చెరువు రికార్డులు రాయాలి
నీటకరిగిన ఆక్సిజన్, అమోనియా, నైట్రైట్, పీహెచ్, అల్కలినిటీ రెగ్యులర్‌గా చెక్ చెయ్యాలి
– డా. పి. రామ్మోహన్‌రావు (9885144557)
మత్స్యశాఖ ఉప సంచాలకులు (విశ్రాంత), కాకినాడ
నిర్వహణ : పంతంగి రాంబాబు సాగుబడి డెస్క్


