వారసత్వ సంపద అపురూపమైనది. విలువను గుర్తెరిగి పరిరక్షించుకోదగినది. కొత్త తరానికి ఆ స్ఫూర్తిని అందించదగినది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్నో పురాతన నాగరికతలకు ప్రతిరూపాలుగా వారసత్వ కట్టడాలు, స్థలాలు ఎన్నో ఉన్నాయి. వీటిని వరల్డ్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్‌గా గుర్తించి పరిరక్షించటం ఆధునికుల బాధ్యత. సాంస్కృతిక, ఆథ్యాత్మిక, చారిత్రక, వ్యవసాయక హెరిటేజ్ సైట్స్ గురించి మాత్రమే ఇప్పటికి తెలుసు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో సహకార సంస్థలు కూడా చేరాయి.
ఇది అంతర్జాతీయ సహకార సంవత్సరం. ఈ సందర్భంగా సుప్రసిద్ధ సహకార సాంస్కృతిక వారసత్వ సంస్థలను గుర్తించే బృహత్ కృషికి అంతర్జాతీయ సహకార కూటమి (ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్– ఐసీఏ) శ్రీకారం చుట్టింది. 25 దేశాలకు చెందిన అంతర్జాతీయంగా పేరొందిన 31 పురాతన సహకార సంస్థలకు ‘కోఆపరేటివ్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్’గా తొలివిడతలో విశిష్ట గుర్తింపు లభించింది. ప్రత్యేక వెబ్‌సైట్‌లో ఈ సైట్స్ విశిష్టతలను తాజాగా అందుబాటులోకి తెచ్చారు.
సహకార సాంస్కృతిక వారసత్వంలో భారత్‌కు విశేష భాగస్వామ్యం ఉంది. ‘కోఆపరేటివ్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్’గా గుర్తింపు పొందిన సంస్థల్లో గుజరాత్ కేంద్రంగా విస్తరించిన పాడి రైతుల సహకార మకుటం ‘అమూల్’తోపాటు కేరళకు చెందిన ‘ఉరులుంగల్ వర్క్‌ర్స్ సొసైటీ’ చోటు దక్కించుకున్నాయి. అసలు సహకార ఉద్యమం అంటే ఏమిటి? ఈ ఉద్యమ చరిత్ర ఏమిటి? సుసంపన్న వారసత్వం ఏమిటి?... వివరంగా తెలుసుకుందాం!
దిగ్గజ సహకార సంస్థలకు ‘సహకార సాంస్కృతిక వారసత్వ’ సంస్థలుగా గుర్తించటంతో పాటు వీటన్నిటినీ ఆన్‌లైన్‌లో ఒక్కచోట చూపించే ప్రపంచ పటం ఇప్పటి వరకు లేదు. ఈ కొరత తీర్చుతూ ఈ నెల 12న అంతర్జాతీయ సహకార కూటమి (ఐసీఏ) అధికారికంగా ప్రకటన చేసింది. సహకార సాంస్కృతిక వారసత్వ వేదికను, సహకారం తరతరాలుగా సంస్కృతి, విద్య, జీవనోపాధిని ఎలా రూపొందించిందో వివరించే స్థలాల మొట్ట మొదటి ప్రపంచ పటాన్ని ప్రారంభించింది. బ్రెసిలియాలోని బ్రెజిల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక వేడుకలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సహకార ఉద్యమ సజీవ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం, దాని ప్రాముఖ్యతను ఎత్తిచూపటానికి ఈ ఆవిష్కరణ ఒక చారిత్రాత్మక అడుగుగా నిలిచిపోతుంది.
ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల నుంచి 31 సహకార సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను మొట్టమొదట ఈ పటంలో ఐసీఏ చోటు కల్పించింది. ఆధునిక సహకారానికి జన్మస్థలం రోచ్‌డేల్ (యునైటెడ్ కింగ్‌డం) మొదలుకొని.. నోవా పెట్రోపోలిస్ (బ్రెజిల్) లోని మాన్యుమెంటో ఆవో కోఆపరేటివ్ నుంచి అముల్ డెయిరీ కోఆపరేటివ్ – వర్గీస్ కురియన్ మ్యూజియం (భారతదేశం), ఉరులుంగల్ వర్కర్స్ కోఆపరేటివ్ (భారతదేశం), ఫెడరేషన్ ఆఫ్ సదరన్ కోఆపరేటివ్స్ (అమెరికా), మోషి కో–ఆపరేటివ్ యూనివర్సిటీ (టాంజానియా) నుంచి అంతర్జాతీయ కార్మిక సంస్థ కోఆపరేటివ్, సోషల్ అండ్ సాలిడారిటీ ఎకానమీ యూనిట్ (స్విట్జర్లాండ్) వరకు ఇందులో ఉన్నాయి. ఐసీఏ గ్లోబల్ ఆఫీస్ సహకారంతో ఆర్గనైజేషన్ ఆఫ్ బ్రెజిలియన్ కోఆపరేటివ్స్ (ఓసీబీ), భారత్‌కు చెందిన నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ) ఈ మ్యాప్‌ను రూపొందించాయి.
‘ఈ వారసత్వ స్థలాలు సహకారం, సంఘీభావాన్ని బోధించే సజీవ తరగతి గదులు. సహకారం సుసంపన్న చరిత్ర అని, న్యాయమైన సమాజాలను నిర్మిస్తున్న సాంస్కృతిక శక్తి అని ఇవి నిరూపిస్తున్నాయి’ అని ఆర్గనైజేషన్ ఆఫ్ బ్రెజిలియన్ కోఆపరేటివ్స్ (ఓసీబీ) అధ్యక్షుడు మార్సియో లోప్స్ డి ఫ్రీటాస్ అన్నారు. ‘ఈ గ్లోబల్ ప్లాట్‌ఫామ్, వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేయడంలో ఎన్‌సీడీసీ సాంకేతిక పరమైన భాగస్వామి కావటం సంతోషకరం. సహకారానికి సంబంధించిన కాలాతీత వారసత్వాన్ని ప్రపంచ ప్రజలు చూడటం కోసం నమోదు చేయటానికి ఈ కృషి దోహదపడింది’ అని ఎన్‌సీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ బన్సాల్ (ఐఏఎస్) అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా మొదట విడతలో 31 ప్రసిద్ధ సంస్థలను సహకార సాంస్కృతిక వారసత్వ సంస్థలుగా ఈ పటంలో చేర్చారు. ఇకముందు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. పంచవ్యాప్తంగా సహకార సంస్థలు, సమాఖ్యలు, సంఘాలు తమకు తెలిసిన సహకార వారసత్వ హోదా ఇవ్వదగిన సైట్‌లు, సంస్థలు, జీవన సంప్రదాయాలను ప్రతిపాదించవచ్చు. సహకార సాంస్కృతిక వారసత్వ ప్రదేశాల గుర్తింపుపై కొత్త మార్గదర్శకాలలో నిర్వచించిన స్పష్టమైన అంతర్జాతీయ ప్రమాణాల ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఐసీఏలో సభ్యులైన సహకార సంస్థలు, వ్యక్తులు ఈ పటంలో చేర్పింపునకు ఈ కింది వెబ్‌సైట్ ద్వారా నామినేట్ చెయ్యవచ్చు.
www.culturalheritage.coop/ nominations
ఐసీఏ రెక్టర్ జనరల్ జెరోయిన్ డగ్లస్ అధ్యక్షతన గల వర్కింగ్ గ్రూప్ నిర్ణయం తీసుకొని, అర్హతగల సంస్థలకు హెరిటేజ్ గుర్తింపునిచ్చి ఈ పటంలో పొందుపరుస్తారు. ఈ బృందంలో మొరాకో, జర్మనీ, నైజీరియా, భారతదేశం, జపాన్, యూకే, బ్రెజిల్, అమెరికాలకు చెందిన సీనియర్ సహకారవేత్తలు ఉన్నారు.
ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నది కంటికి కనిపించే సుప్రసిద్ధ సహకార సంస్థలకు సంబంధించిన ప్రపంచ సహకార సాంస్కృతిక వారసత్వ పటం గురించి. దీన్ని ‘గోచర సహకార వారసత్వ జాబితా’ అనొచ్చు. వచ్చే ఏడాదిలో ‘అవ్యక్త సహకార వారసత్వ జాబితా’ను కూడా ఐసీఏ ప్రకటించనుంది. సహకార సంస్కృతిని ప్రతిబింబించే మౌఖిక సంప్రదాయాలు, అభ్యాసాలు, ఆచారాలకు ఇందులో చోటుకల్పిస్తారు.
సహకార ఉద్యమం అంటే..?
ఉమ్మడి యాజమాన్యంలో, ప్రజాస్వామ్యబద్ధంగా నియంత్రించబడే సంస్థ ద్వారా తమ సాధారణ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అవసరాలను తీర్చుకోవడానికి స్వచ్ఛందంగా ఐక్యమయ్యే వ్యక్తులతో కూడిన స్వయంప్రతిపత్తి గల సంఘం. స్వయం సహాయం, పరస్పర సహాయం సూత్రాలపై సభ్యుల అవసరాలు తీర్చటం కోసం పనిచేసే ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆర్థిక, సామాజిక ఉద్యమం. బాహ్య వాటాదారులకు లాభాలను పెంచడం కంటే సభ్యులకు సేవ చేసే లక్ష్యంతోనే ఏర్పాటైనవి సహకార సంఘాలు.
అంతర్జాతీయంగా విస్తరించిన సహకార ఉద్యమానికి చోదక శక్తి అంతర్జాతీయ సహకార కూటమి (ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్– ఐసీఏ). ఇది 130 ఏళ్లుగా పనిచేస్తోంది. ప్రతి కథా ఒక స్వరంతో ప్రారంభమవుతుంది. వ్యక్తులు బృందంగా ఏర్పడి కలలను పండించుకున్నప్పుడు.. కోఆపరేటివ్ ఉద్యమంలో ఈ స్వరం ప్రతిధ్వనిస్తుంది. ఇది సమాజాలను మర్చేస్తుంది. తరతరాల పాటు ఆ మార్పు కొనసాగుతూ ఉంటుంది. కోఆపరేటివ్ కల్చరల్ హెరిటేజ్ ఒక ప్రపంచ ఉద్యమం. సహకారం నుంచి పుట్టిన కథల్లో, సంప్రదాయాల్లో, కల్పనల్లోని ఈ సహకార ఉద్యమ స్వరాలన్నిటినీ ఈ ఉద్యమం భద్రంగా కాపాడుతూ ఉంటుంది అని ఐసీఏ తెలిపింది.
అమూల్: శ్వేత విప్లవ స్ఫూర్తి
‘ఆనంద్ మిల్క్ యునైటెడ్ లిమిటెడ్ (అమూల్)’ పాల ఉత్పత్తుల దిగ్గజ సహకార సంఘం, ఆనంద్ మ్యూజియం భారతీయ చిన్న, సన్నకారు పాడి రైతుల శ్వేత విప్లవ స్ఫూర్తికి సంబంధించిన అవిచ్ఛిన్న సహకార సంస్కృతి వారసత్వ స్ఫూర్తికి నిదర్శనాలుగా నిలుస్తాయి. 1946లో త్రిభువన్‌దాస్ పటేల్, తర్వాత డాక్టర్ వర్గీస్ కురియన్ చూపిన బాటలో అమూల్ దిగ్గజ సంస్థగా అవతరించింది. ఇవ్వాళ 78 ప్రాసెసింగ్ ప్లాంట్లలో రోజుకు 28 కోట్ల లీటర్ల పాలను శుద్ధి చేసి ఉత్పత్తులను తయారు చేస్తారు. గుజరాత్‌లోని 37 లక్షల పాడి రైతుల శ్రమ అమూల్ గుండెచప్పుడై వెల్లివిరుస్తోంది.
ఆనంద్ నగరంలోని అమూల్ మ్యూజియం భవనం భారతదేశంలోని అత్యంత అసాధారణ సహకార విజయ గాథలలో ఒకదాన్ని చెప్పే భవనం ఉంది. అమూల్ మ్యూజియం కేవలం ప్రదర్శనల గ్యాలరీ కాదు, ఇది ఒక దేశాన్ని మార్చిన సహకార ఆదర్శాలకు సజీవ నివాళి. ఇక్కడ భారతదేశ స్వాతంత్య్ర పోరాటం, క్షీర విప్లవం పెనవేసుకున్న కథనాలు వినిపిస్తాయి. స్వావలంబన కల సహకార ఉద్యమంలో ఎలా శాశ్వత రూపాన్ని ΄పొందిందో అముల్ మ్యూజియం చూపిస్తుంది. నవంబర్ 26న కురియన్ పుట్టిన రోజును భారతదేశం జాతీయ పాల దినంగా జరుపుకుంటుంది.
ఉరలుంగల్: శ్రామిక సహకార స్ఫూర్తి
ఉరలుంగల్ లేబర్ కాంట్రాక్ట్ కో–ఆపరేటివ్ సొసైటీ (యూఎల్‌సీసీఎస్).. సాధారణ కార్మికులు తమ ఉపాధి కోసం, పని భద్రత కోసం నిర్మించుకున్న అద్భుత సహకార సౌధం. కేరళ తీర్రప్రాంత పట్టణం వడకరలో ఉరలుంగల్ ప్రధాన కార్యాలయం ఉంది. శ్రామికుల చెమట చుక్కలతో ఇటుక ఇటుక పేర్చి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆశాసౌధం ఇది.
ఆసియాలోని అత్యంత గొప్ప సహకార సంస్థలలో ఒకది. 1925లో కొద్ది మంది దార్శనిక కార్మికుల సమూహం స్థాపించారు. సంపద లేదా ప్రత్యేక హక్కు నుంచి పుట్టలేదు. అవసరం, ఐక్యత, ధైర్యం నుంచి పుట్టింది. న్యాయమైన వేతనాలు, గౌరవానికి నోచుకోని 14 మంది ఉరలుంగల్ గ్రామ కార్మికులు న్యాయం కోసం వేచి ఉండటానికి బదులుగా, దాన్ని తామే నిర్మించుకోవాలని నిర్ణయించుకొని సహకార సంఘం ఏర్పాటు చేసుకున్నారు. సామాజిక సమానత్వం, సహకార చర్యను సమర్థించిన స్థానిక తత్వవేత్త వాగ్భటానంద సంస్కరణవాద ఆదర్శాలే వారికి మార్గనిర్దేశం చేశాయి.
‘గౌరవంగా పని చేయండి, సమిష్టిగా పంచుకోండి, సమాజానికి సేవ చేయండి’ ఇదీ వారి నినాదం. రోడ్లు, వంతెనలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు నిర్మించే ప్రజా మౌలిక సదుపాయాల నిర్మాణ సంస్థగా ఈ సొసైటీ ఎదిగింది. సేంద్రియ వ్యవసాయం, కళలు, సాఫ్ట్‌వేర్, డిజిటల్ రంగాల్లోకి కూడా ప్రవేశించటం విశేషం. ప్రజలు నిజాయితీ, క్రమశిక్షణ, ఒకరిపై ఒకరు విశ్వాసంతో కలిసి పనిచేసినప్పుడు, వారు సృష్టించగల సంపదకు పరిమితి లేదని ప్రపంచానికి గుర్తు చేస్తూనే ఉంటుంది ఉరులుంగల్.
ఇవి కేవలం సంస్థలు మాత్రమే కాదు!
సహకార సంస్థలు కేవలం సంస్థలు మాత్రమే కాదు. అవి సంస్కృతి, చరిత్ర, గుర్తింపును కలిగి ఉంటాయి. ఈ సహకార సాంస్కృతిక వారసత్వ ప్రదేశాల ప్రపంచ పటాన్ని ఆవిష్కరించటం ద్వారా సహకారాన్ని యావత్ మానవాళి భాగస్వామ్య వారసత్వ విజయంగా జరుపుకుంటున్నాం. సంఘీభావం, స్వయం సహాయం ద్వారా ప్రజలను, సమాజాలను అనుసంధానిస్తాం.
– ఏరియల్ గ్వార్కో, అధ్యక్షుడు, అంతర్జాతీయ సహకార కూటమి(ఐసీఏ)
పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్
(చదవండి: కొత్తిమీర పంటతో జస్ట్ 30 రోజుల్లోనే రూ.లక్ష లాభం!.. శెభాష్)


