మేఘాల మధ్య దోబూచులాడే భానోదయాన్ని తిలకించాలంటే..! | Tourist hotspot Vanjangi Hill gets Renowned as a surreal sunrise retreat | Sakshi
Sakshi News home page

మేఘాల మధ్య దోబూచులాడే భానోదయాన్ని తిలకించాలంటే..! అక్కడకు వెళ్లాల్సిందే..

Jan 5 2026 5:18 PM | Updated on Jan 5 2026 6:47 PM

Tourist hotspot Vanjangi Hill gets Renowned as a surreal sunrise retreat

మంచు తెరలను కప్పుకున్న పచ్చని కొండ కోనలు..మేఘాల మధ్య దోబూచులాడుతూ ఆకాశాన అద్భుతమైన భానోదయాన్ని తిలకించాలంటే అది వంజంగిలోనే సాధ్యం.  

ఆంధ్రప్రదేశ్‌లో సన్‌రైజ్‌ టూరిజం గురించి మాట్లాడితే వెంటనే గుర్తుకు వచ్చే పేరు వంజంగి. ఒకప్పుడు చిన్న గిరిజన గ్రామంగా ఉన్న ఈ ఊరు, ఇప్పుడు సన్‌రైజ్‌ టూరిజంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. వంజంగి అనే పేరు వినగానే చాలా మంది మనసులో మెదిలేది మేఘాల మధ్య నుంచి వెలుగులు చిందిస్తూ ఉదయించే సూర్యుడు. కమర్షియల్‌ హంగులు లేని ఈ గిరిజన ప్రాంతం, ప్రకృతి సహజ అందాలతో ప్రశాంతమైన పర్యాటక అనుభవాన్ని అందిస్తోంది. తెల్లవారుజామున ఆకాశంలో మేఘాలు దోబుచులాడే విన్యాసమే వంజంగిని ప్రత్యేకంగా నిలబెడుతోంది.

అరకు దగ్గరలో.. ప్రకృతి మధ్యలో..
అరకు లోయకు సమీపంలో, అల్లూరి సీతారామ రాజు జిల్లాలో పాడేరు మండలానికి దగ్గరగా ఉన్న వంజంగి కొండ, ఇటీవలి కాలంలో పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తున్న అందమైన ప్రాంతం. ఒకప్పుడు సాధారణ గిరిజన గ్రామంగా ఉన్న ఈ ప్రాంతం, ఇప్పుడు యువ పర్యాటకులు, ఫోటోగ్రాఫర్లు, సోలో ట్రావెలర్ల మధ్య ప్రత్యేక గుర్తింపు పొందింది.

గుడ్‌మార్నింగ్‌
వంజంగి చేరుకోవడానికి పర్యాటకులు సుమారు రెండు గంటల పాటు ట్రెక్కింగ్‌ చేస్తారు. రాత్రి మొత్తంట్రెక్కింగ్‌ చేసి అలసిపోయిన క్షణంలో, మేఘాలను చీల్చుకుంటూ భానుడు ‘గుడ్‌మార్నింగ్‌’ చెప్పే దృశ్యం కనిపిస్తుంది. ఆ ఒక్క క్షణమే చాలుం అలసట అంతా మరిచిపోయి, మరో ప్రపంచంలోకి అడుగుపెట్టామా అనే అనుభూతి కలుగుతుంది.

ఎటు చూసినా కొండలను దుప్పటిలా కప్పేసిన మేఘాలుం వాటి మధ్య నుంచి తన కిరణాలతో సందర్శకులను తాకే సూర్యుడు. ఈ అరుదైన దృశ్యం కోసమే పర్యాటకులు దూర దూరాల నుంచి వంజంగి చేరుకుంటారు.

రోజుకో తీరు
వంజంగిలో సూర్యోదయం ప్రతీ రోజూ ఒకేలా ఉండదు. ఇదే ఇక్కడి అసలైన ప్రత్యేకత. కొన్ని రోజులు మేఘాలు పరుపులా పరిచేసినట్టు కనిపిస్తాయి. ఆ మేఘాల మధ్య మధ్యలో సూర్యుడు క్షణకాలం దర్శనమిచ్చి మళ్లీ మాయం అవుతాడు. మరోసారి ఫోటో తీసుకుందాం అనుకునేలోపే మబ్బులు కమ్మేస్తాయి. కానీ కనిపించిన ఆ ఐదు నిమిషాలే చాలుం జీవితాంతం గుర్తుండి΄ోయే జ్ఞాపకాలు మిగులుతాయి.

క్లౌడ్‌ బెడ్‌ సన్‌రైజ్‌
వంజంగిని చాలామంది ‘క్లౌడ్‌ బెడ్‌ సన్‌రైజ్‌’ అని పిలుస్తారు. ఉదయం ఐదు గంటలకు కనిపించే సూర్యోదయాన్ని వీక్షించేందుకు చాలామంది తెల్లవారుజామున 3–4 గంటలకే ట్రెక్కింగ్‌ ప్రారంభిస్తారు. సాధారణంగా ఒక రోజు ముందే అరకు చేరుకుని, అక్కడి నుంచి పాడేరు దారి మీదుగా వంజంగివైపు ప్రయాణిస్తారు. సుమారు రెండు గంటల ట్రెక్కింగ్‌ అనంతరం వ్యూ పాయింట్‌ చేరుకుంటారు.

లగ్జరీ కాదు నిజజీవితం
వంజంగి పర్యాటకం అంటే లగ్జరీ కాదు. ఇక్కడ కృత్రిమ ఏర్పాట్లు, భారీ సంఖ్యలో పర్యాటకులు, గలగలా మోగే శబ్దాలు కనిపించవు. గిరిజన గ్రామం కావడంతో హోమ్‌స్టేలు కూడా పరిమితంగానే ఉంటాయి. విద్యుత్‌ సరఫరా, మొబైల్‌ సిగ్నల్స్‌ కొన్నిసార్లు బలహీనంగా ఉండొచ్చు. కానీ ఈ చిన్న చిన్న అసౌకర్యాలే వంజంగిని ఒక ప్యూర్‌ ట్రావెల్‌ డెస్టినేషన్‌గా మార్చాయి.
– ఎం.జి.కిశోర్, ట్రావెలర్‌

బాధ్యతాయుతమైన పర్యాటకానికి ఉదాహరణ
సోషల్‌ మీడియా కారణంగా వంజంగి పాపులారిటీ పెరిగినా, ఇప్పటికీ ఇది కమర్షియల్‌ పర్యాటక కేంద్రంగా మారలేదు. ఇది లోపం కాదు, పెద్ద ప్లస్‌ పాయింట్‌. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడం, ప్రకృతిని కాపాడుకోవడం కోసం పర్యాటకులను పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నారు. దీని వల్ల ఈ ప్రాంతం తన సహజ స్వరూపాన్ని ఇప్పటికీ నిలుపుకుంటోంది.

ఎప్పుడు వెళ్లాలి?
వంజంగి సందర్శించడానికి అక్టోబర్‌ నుంచి మార్చి వరకు సరైన సమయం. ఈ సమయంలో పొగమంచు, మేఘాల మధ్య నుంచి సూర్యుడు ఉదయించే దృశ్యం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. సన్‌రైజ్‌ చూడాలంటే ఉదయం 4.30 నుంచి 5 గంటల మధ్య వ్యూ పాయింట్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.

ఎక్కడ ఉండాలి?
విశాఖ జిల్లా నుంచి లంబసింగి లేదా అరకు చేరుకుని, అక్కడి నుంచి వంజంగి ట్రిప్‌ ప్లాన్‌ చేయవచ్చు. ఉదయం 5:00–6:30 మధ్య మబ్బుల మ్యాజిక్‌ షో ముగిసిన వెంటనే ఎక్కువ మంది తమ హోటల్‌కి వెళ్తారు. చాలామంది అరకును బేస్‌ చేసుకుని వంజంగి ట్రిప్‌ ప్లాన్‌ చేస్తారు. వంజంగికి దగ్గరలోని పాడేరు మండలంలో కూడా నైట్‌స్టే ప్లాన్‌ చేయవచ్చు. 

అక్కడి నుంచి షేరింగ్‌ ఆటో లేదా జీప్‌ ద్వారా వంజంగి కొండ పాదం వరకు చేరుకోవడం సులభం. వంజంగి, ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు ప్రకృతిని గౌరవిస్తూ, ప్రశాంతంగా ప్రయాణాన్ని ఆస్వాదించగలిగే ఒక ప్రత్యేక అనుభవం. బయటి ప్రపంచానికి దూరంగా ఒకరోజు గడపాలి అనుకునేవారికి ఇది ఒక అవసరం.
ఎం జి కిశోర్‌ ట్రావెలర్‌

(చదవండి: ట్రావెల్స్‌లో సరికొత్త ట్రెండ్స్‌..! ఇలాంటి టూర్స్‌ గురించి విన్నారా?)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement