న్యూఢిల్లీ: దేశంలోని ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)తరచూ సరికొత్త ప్యాకేజీలను ప్రకటిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు’ ద్వారా ఒక ఆధ్యాత్మిక యాత్రను ప్రకటిచింది. తొమ్మిది రాత్రులు, 10 పగటి రోజులు సాగే ఈ సుదీర్ఘ యాత్ర ఫిబ్రవరి 5వ తేదీన ప్రారంభమై, ఫిబ్రవరి 14వ తేదీతో ముగుస్తుంది.
ఈ యాత్ర చేయాలనుకునేవారు గయ, పూరి జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, కోల్‌కతా, గంగాసాగర్, బైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య తదితర ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు.ఈ ప్రత్యేక పర్యాటక రైలు ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ పర్యటనలో గయలోని విష్ణుపాద ఆలయం, పూరిలోని జగన్నాథ స్వామి ఆలయం, కోణార్క్‌లోని సూర్య దేవాలయం, కోల్‌కతాలోని గంగాసాగర్, జసిదిహ్‌లోని బైద్యనాథ్ ధామ్, వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం, అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గర్హి తదిరత పవిత్ర క్షేత్రాలను దర్శించుకోవచ్చు.
ఈ రైలులో మొత్తం 767 సీట్లు అందుబాటులో ఉన్నాయి వీటిలో 2 ఏసీ విభాగంలో 49, 3 ఏసీ విభాగంలో 70, స్లీపర్ క్లాస్‌లో 648 సీట్లు ఉన్నాయి. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ప్రయాణికులకు సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ లేదా స్లీపర్ క్లాస్ ప్రయాణ సౌకర్యంతో పాటు అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో శాకాహార భోజనం అందిస్తారు. అలాగే స్థానిక ప్రాంతాల సందర్శన కోసం ఏసీ లేదా నాన్-ఏసీ బస్సుల సౌకర్యం ఉంటుంది. ధరల విషయానికి వస్తే ఎకానమీ (స్లీపర్) క్లాస్‌కు ఒక్కొక్కరికి రూ. 19,110, స్టాండర్డ్ (థర్డ్ ఏసీ) క్లాస్‌కు రూ. 31,720, కంఫర్ట్ (సెకండ్ ఏసీ) క్లాస్‌కు ₹41,980 గా నిర్ణయించారు. ఐదేళ్ల నుండి 11 ఏళ్ల లోపు పిల్లలకు స్వల్ప రాయితీతో కూడిన ధరలు వర్తిస్తాయి.
ఈ ఆధ్యాత్మిక యాత్రను బుక్ చేసుకోవాలనుకునే భక్తులు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు. ప్రయాణికుల ఆర్థిక వెసులుబాటు కోసం ఈ ప్యాకేజీని ఈఎంఐ (ఈఎంఐ) పద్ధతిలో కూడా పొందే అవకాశం కల్పించారు. ఐఆర్సీటీసీ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల ద్వారా సులభ వాయిదాల పద్ధతిలో నగదు చెల్లించే వెసులుబాటు ఉంది. తక్కువ ఖర్చుతో దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం అని ఐఆర్‌సీటీసీ తెలిపింది.
ఇది కూడా చదవండి: షాకింగ్ రిపోర్ట్: ఆ వ్యాధితో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం


