న్యూఢిల్లీ: భారతదేశం ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సంక్షోభంతోనే కాకుండా, పెను ఆర్థిక సంక్షోభంతోనూ కొట్టుమిట్టాడుతోంది. దేశాన్ని పట్టిపీడిస్తున్న ఒక వ్యాధి ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. అదే మధుమేహం (డయాబెటిస్). దీని కారణంగా భారత్ ఎదుర్కొంటున్న ఆర్థిక భారం అక్షరాలా 11.4 ట్రిలియన్ డాలర్లకు(ఒక వెయ్యి ఇరవై ఎనిమిది లక్షల కోట్లు) చేరుకుందని తాజా పరిశోధనలో వెల్లడైంది.
మధుమేహం కారణంగా అమెరికా తర్వాత అత్యధిక ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్న దేశంగా భారత్ రెండో స్థానంలో నిలిచింది. 11 ట్రిలియన్ డాలర్లతో చైనా మూడో స్థానంలో ఉంది. కేవలం ఇది ఒక ఆరోగ్య సమస్యగానే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్యగా రూపాంతరం చెందిందని ఈ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 828 మిలియన్ల(82 కోట్ల 80 లక్షలు) మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో నాలుగో వంతు కంటే ఎక్కువ మంది భారత్‌లోనే ఉన్నారని లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన నివేదిక వెల్లడించింది.
2022 నాటికి ప్రపంచంలోనే అత్యధిక డయాబెటిస్ బాధితులు ఉన్న దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. పైగా భారత్‌లో మధుమేహంతో బాధపడుతున్న వారిలో దాదాపు 62 శాతం మందికి ఎటువంటి వైద్య చికిత్స అందకపోవడం అత్యంత ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి దేశ ప్రజల ఆరోగ్యంపైననే కాకుండా, దీర్ఘకాలికంగా దేశ ఉత్పాదకతపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. మధుమేహం వల్ల కలిగే ఆర్థిక నష్టం కేవలం ఆసుపత్రి ఖర్చులకే పరిమితం కాదని ‘నేచర్ మెడిసిన్’ తన పరిశోధన వెల్లడించింది. రోగికి తోడుగా ఉండే వారు తమ ఉపాధిని వదులుకోవడం వల్ల దేశ జీడీపీలో దాదాపు 1.7 శాతం మేర నష్టం వాటిల్లుతోందని పేర్కొంది. మధుమేహం వల్ల కలిగే ఆర్థిక భారంలో దాదాపు 90 శాతం లెక్కకు అందని ఖర్చులకే అవుతున్నదని వియన్నా యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో చికిత్స ఖర్చులు అధికంగా ఉంటే, భారత్ వంటి దేశాల్లో రోగుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఆర్థిక భారం పెరుగుతోంది. క్యాన్సర్ లేదా అల్జీమర్స్ వంటి వ్యాధుల కంటే కూడా మధుమేహం వల్ల కలిగే ఆర్థిక నష్టం అత్యధికమని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, బరువు నియంత్రణ ద్వారా ఈ వ్యాధిని అడ్డుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు సకాలంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే, భారీ ఖర్చులను నివారించవచ్చని, దేశ ఆర్థిక వ్యవస్థకు వాటిల్లే నష్టాన్ని తగ్గించవచ్చని ఈ అధ్యయనం తెలియజేస్తోంది.
ఇది కూడా చదవండి: వృద్దాప్యంలో యవ్వనం.. జపాన్ బామ్మల సరికొత్త రికార్డు


