ప్రపంచంలోనే అత్యధికంగా దీర్ఘాయువు కలిగిన వారు ఉన్న దేశంగా జపాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. 2025 సెప్టెంబర్ నాటి గణాంకాల ప్రకారం జపాన్‌లో 100 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి సంఖ్య రికార్డు స్థాయిలో లక్షకు (99,763 మంది) చేరుకుంది. ఈ వృద్ధుల జనాభాలో ఏకంగా 88 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. జపాన్ ప్రజల దీర్ఘాయువు రహస్యం.. వారి సంప్రదాయ ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమనే కాకుండా, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఆహారం కంటే అలవాట్లే కీలకం
ఢిల్లీలోని సిటీ ఇమేజింగ్ అండ్ క్లినికల్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆకార్ కపూర్ అభిప్రాయం ప్రకారం, జపాన్ ప్రజల దీర్ఘాయువుకు కేవలం వారు తీసుకునే ఆహారం మాత్రమే కారణం కాదు. క్రమశిక్షణ, నిరంతరం యాక్టివ్ ఉండటం, సామాజిక అనుబంధాలతో కూడిన జీవన విధానం మొదలైనవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా ‘మితంగా తినడం’ అంటే పొట్ట నిండక ముందే భోజనాన్ని ముగించడం (హరా హచి బు) వంటి పద్ధతులు శారీరక మెటబాలిక్ ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారానికి, చక్కెర పదార్థాలకు దూరంగా ఉండటం వారిని ఆరోగ్యంగా ఉంచుతోంది.
మహిళల దీర్ఘాయువు వెనుక..
జపాన్ శతవృద్ధులలో 88 శాతం మహిళలే ఉండటానికి జీవశాస్త్రపరమైన, ప్రవర్తనాపరమైన పలు కారణాలు ఉన్నాయి. మహిళల్లో ఉండే 'ఈస్ట్రోజెన్' హార్మోన్ గుండె సంబంధిత సమస్యల నుండి రక్షణ కల్పిస్తుందని, కణాల వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేస్తుందని డాక్టర్ కపూర్ వివరించారు. దీనితో పాటు మహిళలు తమ ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, సామాజిక సంబంధాలను మెరుగుపరుచుకోవడం ద్వారా వారు కుంగుబాటు (Depression) వంటి సమస్యలకు దూరంగా ఉంటూ, యవ్వనవంతులుగా జీవిస్తున్నారని పరిశోధనల్లో వెల్లడయ్యింది.
నివారణే శరణ్యం
జపాన్ ప్రజల దీర్ఘాయువు వెనుక ఆ దేశ పటిష్టమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఉంది. ఆ దేశంలో వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే, వ్యాధి రాకుండా చూసుకోవడానికే అత్యధిక ప్రాధాన్యతనిస్తారు. ప్రభుత్వం అందించే సార్వత్రిక ఆరోగ్య కవరేజీతో సామాన్యులకు కూడా మెరుగైన వైద్యం అందుబాటులో ఉంది. రోజువారీ నడక, ఇంటి పనులు, హాబీలలో నిమగ్నం కావడం, బలమైన సామాజిక బంధాలు జపాన్ ప్రజల ఆయుష్షును పెంచుతున్నాయి.
ఇది కూడా చదవండి: కేరళ అవియల్ తింటారా? లడక్ తుక్పా సిప్ చేస్తారా?


