పండుగలు అనగానే అందరికీ ముందుగా పిండి వంటలు గుర్తుకు వస్తాయి. అలాగే పండుగల రోజుల్లో రుచికరమైన వివిధ ఆహారాలను ఆరగించాలని అనిపిస్తుంది. అటువంటి సందర్భాల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మన ప్రాంతీయ ఆహారాలు లభించకపోతే నిరాశ కలుగుతుంది. అయితే దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లినప్పుడు ఈ లోటు కనిపించదు. ఎందుకంటే రాజధానిలోని స్టేట్స్ భవన్ ఆ కొరత తీరుస్తూ, దేశంలోని వివిధ ప్రాంతాల రుచులను అందిస్తోంది.
సకల రుచుల సమాగమం
దేశ రాజధాని ఢిల్లీ అంటే కేవలం రాజకీయాలకే కాదు.. అద్భుతమైన రుచులకు కూడా నిలయం. ముఖ్యంగా చాణక్యపురిలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వ అతిథి గృహాలు (స్టేట్ భవన్స్), పర్యాటకులకు అద్భుతమైన వివిధ ప్రాంతాల ఆహార రుచులను అందిస్తున్నాయి. ఇక్కడి కాంటీన్లలో ఆయా రాష్ట్రాలకు చెందిన నిపుణులైన వంటగాళ్లు, సంప్రదాయ పద్ధతుల్లో ప్రాంతీయ వంటకాలను తయారు చేస్తారు. ఇక్కడ లభించే ఆహారాలు.. దేశంలోని ఆహార ప్రియులు ఢిల్లీని సందర్శించినప్పుడు వారి ‘అభిరుచి’ని పరిపూర్ణం చేస్తాయి.
ఆంధ్రప్రదేశ్ భవన్: రూ. 200కే వెజ్ థాలీ
అశోకా రోడ్డులోని ఆంధ్రప్రదేశ్ భవన్ ఢిల్లీలోనే అత్యంత ప్రసిద్ధ స్టేట్ భవన్ కాంటీన్. ఇది దశాబ్దాలుగా విద్యార్థులు, ఉద్యోగులు, స్థానికులు, పర్యాటకులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక్కడ లభించే అన్‌లిమిటెడ్ వెజ్ థాలీలో అన్నం, పప్పు, సాంబార్, రసం, కూరలు , పెరుగు కేవలం రూ. 200లకే లభిస్తాయి. నాన్-వెజ్ ప్రియుల కోసం స్పైసీ మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ చెట్టినాడ్ వంటి ప్రత్యేక వంటకాలు అందుబాటులో ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్ సమయంలో లభించే దోశలు ఇక్కడ చాలా ఫేమస్.
కర్ణాటక సంఘం-కేరళ హౌస్: పరిపూర్ణతనిచ్చే పాయసం
ఆర్.కె. పురంలోని కర్ణాటక సంఘంలో లభించే అద్భుతమైన రాగి దోశ, మసాలా దోశ, స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ ఆహార ప్రియుల నోరు ఊరిస్తాయి. ఇక్కడ దక్షిణాది సంగీతం వింటూ, ప్రశాంతమైన వాతావరణంలో భోజనం చేయవచ్చు. జంతర్ మంతర్ రోడ్డులోని కేరళ హౌస్ ‘సమృద్ధి’ కాంటీన్.. కేరళ సంప్రదాయ ఎర్ర బియ్యం (రెడ్ రైస్), అవియల్ (కొబ్బరితో చేసిన కూరగాయల మిశ్రమం), కేరళ ఫిష్ కర్రీకి పెట్టింది పేరు. ఇక్కడ దొరికే కొబ్బరి పాలు, బియ్యంతో చేసే ‘పాయసం’ ఇక్కడి భోజనానికి పరిపూర్ణతనిస్తాయి.
బీహార్ నివాస్- గుజరాత్ భవన్: నెయ్యి వంటకాలు తింటుంటే..
బీహార్ నివాస్‌లోని ‘ది పాట్‌బెల్లీ’ రెస్టారెంట్ అద్భుతమైన ‘లిట్టీ చోఖా’తో అత్యంత ప్రాచుర్యం పొందింది. మట్టి వాసనతో కూడిన ఈ రుచి ఆహార ప్రియులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఇక కౌటిల్య మార్గ్‌లోని గుజరాత్ భవన్ తన అద్భుతమైన వెజ్ థాలీతో రుచులూరిస్తుంటుంది. ఇందులో ఖిచ్డీ, కఢీ, ధోక్లా, తెప్లా,నెయ్యితో చేసిన వంటకాలు గుజరాతీ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. తీపి, వగరు రుచుల కలయికతో ఇక్కడి భోజనం ఇంటి వాతావరణాన్ని గుర్తు చేస్తుంది.
మహారాష్ట్ర సదన్- బెంగాలీ రుచులు: ‘బిజోలి గ్రిల్’ ఒక్కసారి తింటే..
ఇండియా గేట్ సమీపంలోని మహారాష్ట్ర సదన్ పరిపూర్ణ రెస్టారెంట్‌ను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ లభించే మిసల్ పావ్, సాబుదానా ఖిచ్డీ, మహారాష్ట్ర థాలీలోని జుంకా (శనగపిండి వంటకం) చాలా అద్భుతంగా ఉంటాయి. తూర్పు భారత్ రుచుల కోసం బంగా భవన్‌లోని ‘బిజోలి గ్రిల్’ ఉత్తమమైనది. బెంగాలీ సంప్రదాయ చేపల వంటకాలు, ముఖ్యంగా ఆవాల ఘాటుతో కూడిన 'షోర్షే హిల్సా', స్టీమ్డ్ ఫిష్ (భాపా హిల్సా), కోషా మాంగ్షో (మటన్ కర్రీ) ఇక్కడి సిగ్నేచర్ వంటకాలుగా చెబుతుంటారు.
ఒడిశా నివాస్- అస్సాం భవన్: రొయ్యల వేపుడు ఫేమస్
ఒడిశా నివాస్‌లో లభించే ప్రత్యేకమైన ‘ప్రాన్ కాషా మసాలా’ (రొయ్యల వేపుడు), ఆవాలతో చేసే చేపల కూర అద్భుత సీ ఫుడ్ రుచులను అందిస్తాయి. ఇక్కడి ఛేనా పోడా (జున్ను స్వీట్) అస్సలు మిస్ కాకూడదు. అస్సాం భవన్ విషయానికొస్తే ఇక్కడ ఆవనూనె ఘుమఘుమలతో కూడిన అస్సామీ ఫిష్ కర్రీ, లూచీ, అచ్చమైన అస్సామీ చాయ్ లభిస్తాయి. ఇక్కడి వంటకాలు తక్కువ మసాలాలతో, సహజ సిద్ధమైన రుచులతో ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
లడఖ్-కశ్మీర్: సాల్టీ టీతో కొత్త అనుభూతి
చలికాలంలో లడఖ్ భవన్‌లో లభించే వేడివేడి తుక్పా (నూడిల్ సూప్), మోమోలు, దెన్తుక్ (హ్యాండ్ పుల్డ్ నూడిల్స్)లను తినకుండా ఎవరూ ఉండలేరు. ఇక్కడి బట్టర్ టీ (సాల్టీ టీ) ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది. జమ్ముకశ్మీర్ భవన్‌లో లభించే రాజరికపు వంటకాలైన రోగన్ జోష్ (మటన్), యఖ్ని (మీట్ బ్రోత్), దమ్ ఆలూ ఎంతో ప్రాచుర్యం పొందాయి. కశ్మీరీ సంప్రదాయ వంటకాల్లోని అద్భుత రుచులు ఇక్కడ కనిపిస్తాయి.
ఇది కూడా చదవండి: 8 నెలల్లో 834 బాల గర్భిణులు.. షాకింగ్ నిజాలివే..


