తిరుచ్చి: తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో మాతా శిశు మరణాల రేటు తగ్గుముఖం పట్టినప్పటికీ, బాల గర్భిణుల సంఖ్య పెరుగుతుండటం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. 2025 ఏప్రిల్ నుండి నవంబర్ మధ్య కాలంలో జిల్లాలో 834 మంది బాలికలు గర్భం ధరించినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఈ సంఖ్య వెయ్యి మార్కును దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
టీనేజ్ గర్భం అంటే..
జిల్లాలో సగటున నెలకు 100 కేసులు, అంటే రోజుకు మూడు నుండి నాలుగు కేసులు నమోదవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2024-2025)లో ఈ సంఖ్య 1,234 గా ఉండటం చూస్తుంటే, పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థం అవుతుంది. 13 నుంచి 19 ఏళ్ల లోపు వయసులో గర్భం దాల్చడాన్ని టీనేజ్ గర్భంగా పరిగణిస్తారు. చట్టబద్ధంగా 19 ఏళ్ల వయసు దాటాక గర్భం దాల్చేందుకు అనుమతి ఉంటుంది. 2025, ఏప్రిల్‌లో వెలువడిన ‘తమిళనాడు జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ రీసెర్చ్’ నివేదిక ప్రకారం, 10-19 ఏళ్ల లోపు తల్లులు ఫిట్స్, ఇన్ఫెక్షన్లు, ప్రసవానంతర సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా పుట్టబోయే బిడ్డలు తక్కువ బరువుతో పుట్టడం, నెలలు నిండకుండానే జన్మించడం లాంటి వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
బలవంతపు వివాహాలు
ఈ ఆందోళనకర ధోరణికి బాల్య వివాహాలే ప్రధాన కారణమని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు. కుటుంబ, సామాజిక ఒత్తిళ్లు, లైంగిక వేధింపులు, విద్యకు దూరం కావడం, ఆరోగ్య విషయాలపై అవగాహన లేకపోవడం మొదలైనవి ఈ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. తమ పిల్లలు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారని తెలియగానే.. తల్లిదండ్రులు వారికి బలవంతంగా వివాహం జరిపించడం లేదా చదువుపై ఆసక్తి లేక బాలికలే పెళ్లికి మొగ్గు చూపడం లాంటి ఉదంతాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి.
ప్రతీ కేసుపై దర్యాప్తు
గ్రామ స్థాయి శిశు సంరక్షణ కమిటీల (వీఎల్‌సీపీసీ) పర్యవేక్షణ లోపించడం కూడా ఈ సమస్యకు ఒక కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం బాల్యవివాహాలపై సదస్సులు నిర్వహించడమే కాకుండా, ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని మాతాశిశు హక్కుల కార్యకర్తలు కోరుతున్నారు. కాగా తిరుచ్చి జిల్లా యంత్రాంగం ఈ విషయంపై ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోందని, నమోదైన ప్రతి కేసును నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: ‘హిందీని రుద్దితే..’ రాజ్ ఠాక్రే తీవ్ర హెచ్చరిక


