పెళ్లయిన కొన్ని గంటలకే.. సినిమా తరహా ట్విస్ట్‌.. | UP Couple Marriage Lasted Only A Few Hours | Sakshi
Sakshi News home page

పెళ్లయిన కొన్ని గంటలకే.. సినిమా తరహా ట్విస్ట్‌..

Feb 27 2026 3:49 PM | Updated on Feb 27 2026 4:36 PM

UP Couple Marriage Lasted Only A Few Hours

హమీర్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో సినిమా తరహా ట్విస్ట్‌లతో ఓ ఘటన జరిగింది. పెళ్లయిన కొన్ని గంటలకే వధూవరులు తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి ఉండటానికి వధువు నిరాకరించడంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఇరు కుటుంబాల మధ్య చర్చల అనంతరం, తక్షణమే విడాకులు తీసుకోవాలని దంపతులు నిర్ణయించుకున్నారు.

అసలేం జరిగిందంటే.. పెళ్లి వేడుకలు అనంతరం వధువు మిథిలేష్ కుమారి తన అత్తవారింటికి చేరుకుంది. శోభనం రాత్రి దంపతులిద్దరూ గదిలోకి వెళ్లిన సమయంలో.. ఆమె తన భర్త ధరమ్ సింగ్ కుష్వాహాతో ఉండటానికి నిరాకరించింది. తాను వేరొకరిని ప్రేమిస్తున్నానని.. తన ఇష్టానికి వ్యతిరేకంగా ఈ వివాహం జరిపించారని మిథిలేష్ పేర్కొంది. తన కుటుంబ సభ్యులు తనను కొట్టి, బలవంతంగా పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారంటూ భర్తకు వివరించింది.

వరుడు ధరమ్ సింగ్ కుష్వాహా స్పందిస్తూ.. వధువు ఈ విషయాన్ని ముందే చెప్పి ఉంటే బాగుండేదన్నాడు. అలా చేసి ఉంటే ఇరు కుటుంబాలకు ఈ అవమానం తప్పేదని.. అసలు పెళ్లే జరిగేది కాదన్నాడు. ఇరు కుటుంబాలు హమీర్‌పూర్‌లోని రాత్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాయి. పోలీసులు ఇరు పక్షాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, వధువు మిథిలేష్ తన నిర్ణయం మార్చుకోలేదు. తన భర్తతో ఉండటం ససేమిరా అంటూ స్పష్టం చేసింది.

పోలీసులు మాట్లాడుతూ.. ఇరు వర్గాలతో సుదీర్ఘంగా చర్చలు జరిపామని.. కాపురానికి వెళ్లడానికి వధువు ఇష్టపడటం లేదని.. దీంతో పరస్పర అంగీకారంతో విడిపోవాలని కుటుంబాలు నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం, ఆ జంట తక్షణమే విడాకులు తీసుకున్నారు. వధువు తన కుటుంబ సభ్యులతో కలిసి తన పుట్టింటికి వెళ్లిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement