భారతదేశంలో కొన్ని ప్రదేశాలు మ్యాపులో సింపుల్‌గా కనిపించినా.. అక్కడి వాస్తవాలు భిన్నంగా ఉంటాయి. అలాంటి ఒక ప్రదేశమే మలానా గ్రామం. హిమాచల్ ప్రదేశ్‌లోని పార్వతీ లోయ పక్కనే, కొండల మధ్యలో ఉన్న ఈ గ్రామం ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఒక పురాతన ప్రదేశం.
ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఆలయాలను, గోడలను, మనుషులను తాకితే అధికారులు ఫైన్ వేస్తారు. స్థానికులకు ఎవరైనా బయటి వారు డబ్బులు ఇవ్వాల్సి వస్తే నేలపై లేదా కౌంటర్‌పై పెడతారు కానీ చేతికి ఇవ్వరు. పొరపాటున బయటి వాళ్లు టచ్ అయితే వెంటనే వెళ్లి స్నానం చేసి శుద్ధి చేసుకోవాలి అనేది ఇక్కడి ప్రజల విశ్వాసం.
మలానా గ్రామాన్ని (Malana Village) చాలా మంది ప్రపంచంలోనే అతిపురాతనమైన ప్రజాస్వామ్యం ఉన్న ప్రదేశంగా చెబుతారు. ఇక్కడ పోలీసు వ్యవస్థతో పని లేకుండా, జమ్లూ దేవత అనే స్థానిక దైవశక్తి సాక్షిగా తీర్పులు, నిర్ణయాలు జరుగుతాయి. మలానా ప్రజలు కానాశీ అనే ఒక సీక్రెట్ భాషలో మాట్లాడుతారు.
ఇది ఎంత సీక్రెట్ అంటే, వారు మాట్లాడే పదాలు చుట్టుపక్కల ఉన్న గ్రామస్థులకు కూడా అర్థం కావు. అలాగే అలెగ్జాండర్ (Alexander) సైనికుల వంశం ఇక్కడ కొనసాగుతుందని కూడా కొంతమంది అంటారు, కానీ దానికి స్పష్టమైన రుజువులు లేవు.
చదవండి: ఆ ఒక్క నిర్ణయంతో అద్భుత ఫలితాలు


