ఆహార వృథాను అరికట్టే ‘అర్క ట్రైసైకిల్‌’ | Solar tricycle gives vendors a clean green push | Sakshi
Sakshi News home page

ఆహార వృథాను అరికట్టే ‘అర్క ట్రైసైకిల్‌’

Mar 6 2026 12:40 PM | Updated on Mar 21 2026 12:27 AM

Solar tricycle gives vendors a clean green push

ఎండలు ఏటేటా అంతకంతకూ మండిపోతున్నాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తోపుడు బండ్ల ద్వారా వినియోగదారుల ఇళ్ల దగ్గరకు తెచ్చి చిరు వ్యాపారులు (కొందరు సేంద్రియ / ప్రకృతి వ్యవసాయదారులు కూడా) అమ్ముతూ ఉంటారు. అయితే, ఇలా పండిన పంట తినేవారి ఇంటికి చేర్చే లోగా రోజువారీగా 10–15% వరకు ఎండకు వడపడి, రంగు మారి, దుమ్మూ ధూళి పడి పాడైపోయి వృథా అవుతున్నాయని అంచనా. ఈ వృథాను అరికట్టగలిగితే విలువైన ఆహారం వృథా కాకుండా ఉంటుంది. రిటైల్‌ విక్రయదారుల ఆదాయమూ పెరుగుతుంది. 

సాధారణ తోపుడు బండ్ల వల్ల జరిగే ఈ నష్టాన్ని అరికట్టడానికి బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్‌ఆర్‌) సౌర విద్యుత్తుతో నడిచే ట్రైసైకిల్‌ను రూపొందించింది. దీనికి ‘అర్క ట్రైసైకిల్‌’ అని పేరు పెట్టారు (కర్ణాటకలో ‘అర్కావతి’ నది ఒడ్డున ఐఐహెచ్‌ఆర్‌ ఉంది. అందుకే ఈ సంస్థలో రూపొందే కొత్త వంగడాలు, ఇతర ఉత్పత్తులకు కూడా ముందు అర్క అని పెడుతూ ఉంటారు. 

అర్క అని ఏ వంగడం, ఉత్పత్తి పేరులో ఉంటే అది బెంగళూరు ఐఐహెచ్‌ఆర్‌ అభివృద్ధి చేసిందని తెలుసుకోవచ్చు). అందంగా, సౌకర్యవంతంగా ఐఐహెచ్‌ఆర్‌ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ ట్రైసైకిల్‌.. సౌర విద్యుత్తుతో నడుస్తుంది. ఇందులో ఉంచే కూరగాయలు, పండ్లు తదితర ఉత్పత్తులు పాడైపోకుండా ఉష్ణోగ్రత, తేమలను ‘ఎవాపరేటివ్‌ కూలింగ్‌’ పద్ధతిలో నియంత్రించవచ్చు. 

కూరగాయల బరువుతో కూడిన తోపుడు బండిని నెట్టుకుంటూ వెళ్లే చాకిరీని అర్క ట్రైసైకిల్‌ చాలా వరకు తగ్గిస్తుంది. సాధారణ తోపుడు బండితో తిరిగే ప్రాంతాల కన్నా ట్రైసైకిల్‌ ద్వారా ఎక్కువ ప్రాంతాల్లో వేగంగా తిరుగుతూ.. తక్కువ కాలంలోనే ఎక్కువ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు.  

సౌర విద్యుత్తు ద్వారా చల్లగాలి ప్రసరించే ఏర్పాటు ఉండటం వల్ల అర్క ట్రైసైకిల్‌ ద్వారా తీసుకెళ్లే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పుట్టగొడుగులను కోత తర్వాత 36–48 గంటల పాటు తాజాగా ఉంచుకుంటూ అమ్ముకోవడానికి వీలవుతుంది. తక్కువ కష్టంతో తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రాంతాల్లో ట్రైసైకిల్‌ తిరుగుతుంది. కూరగాయలు, పండ్లు, ఆకుకూరల నాణ్యత, నిల్వ సామర్థ్యం కూడా బాగా పెరుగుతుంది. 

ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన వ్యవసాయోత్పత్తులను నాణ్యంగా, తాజాగా వినియోగదారుల ఇళ్లకు తీసుకెళ్లి ఇవ్వటం అర్క ట్రైసైకిల్‌ వల్ల సాధ్యమవుతుందని దీన్ని రూపొందించిన ఐఐహెచ్‌ఆర్‌ ప్రధాన శాస్త్రవేత్త డా. జి. సెంథిల్‌ కుమార్‌ ‘సాక్షి’తో చెప్పారు. 

అర్క ట్రైసైకిల్‌ ప్రత్యేకతలు

భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఏఆర్‌) కు అనుబంధ సంస్థ అయిన బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్‌ఆర్‌) రూపకల్పన చేసినది. 

దీని పైనే సౌర ఫలకాలు ఉంటాయి. ఎండలో తిరిగేటప్పుడే బ్యాటరీ చార్జ్‌ అవుతూ ఉంటుంది. ఆ శక్తితోనే ట్రైసైకిల్‌ నడుస్తుంది. దీన్ని నడిపే వ్యక్తి సైకిల్‌ తొక్కనవసరం లేదు. నెట్టుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ కష్టం తప్పుతుంది. బ్యాటరీ ఫూర్తిగా చార్జి అయితే 50 కిలోమీటర్ల దూరం నిరాటంకంగా ప్రయాణిస్తుంది.

ఇందులో 20 ప్లాస్టిక్‌ క్రేట్స్‌ను పెట్టుకునే ఏర్పాటు ఉంది. ఒక్కో క్రేట్‌లో 10 కిలోల సరుకును పెట్టవచ్చు. 200 కిలోల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పుట్టగొడుగులను తీసుకెళ్లవచ్చు.

సౌరవిద్యుత్తుతో ఎవాపరేటివ్‌ కూలింగ్‌ సిస్టం ద్వారా గాలిని చల్లబరిచి ఈ ట్రైసైకిల్‌లోని పచ్చి సరుకు పాడవకుండా ఉండేందుకు సరిపోయే చల్లదనాన్ని ఇచ్చే వ్యవస్థ ఉంది. 

రాత్రి పూట అమ్మకాలు చేయడానికి వీలుగా ఎల్‌ఇడి బల్బులు ఉన్నాయి. డిజిటల్‌ కాటా ఉంది. 

ప్రజలకు వినిపించేలా ఉత్పత్తుల వివరాలు పెద్దగా వినపడేలా చెప్పడానికి సోలార్‌ విద్యుత్‌తో నడిచే మైక్‌ ఉంటుంది. మబ్బులున్నప్పుడు దీన్ని విద్యుత్‌తో చార్జ్‌ చేసుకోవచ్చు.

వినియోగదారుల భద్రత కోసం ఆటోమేటిక్‌గా శానిటైజర్‌ పరికరం ఉంది. 

తోపుడు బండ్ల వ్యాపరులకు కూరగాయలు, పండ్ల వృథాను తగ్గించుకొని అధిక ఆదాయం పొందేందుకు ట్రైసైకిల్‌ ఉపయోగపడుతుంది. 

తమ ఇళ్ల దగ్గరకే వచ్చి పరిశుభ్రంగా, తాజాగా ఉండే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పుట్టగొడుగులు అమ్ముతున్నందున అర్క ట్రైసైకిల్‌ పట్ల వినియోగదారులు ఆకర్షితులవుతారు. 

అర్క ట్రైసైకిల్‌ ధర రూ. లక్షన్నర. తోపుడు బండిపై అమ్మితే వృథా అయ్యే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ట్రైసైకిల్‌ ద్వారా నిక్షేపంగా అమ్ముకోవచ్చు కాబట్టి రెండేళ్లలో దీని ఖర్చును తిరిగి రాబట్టుకోవచ్చు. 

నిర్వహణ పతంగి రాంబాబు
సాక్షి, సాగుబడి డెస్క్‌

(చదవండి: జస్ట్‌ మూడు నెలల్లో 14 కిలోలు బరువు తగ్గాలంటే..!)

Advertisement
 
Advertisement
Advertisement