బతుకులో జీవం నింపే కళ | Batik artist Maria Clara talks about art, life | Sakshi
Sakshi News home page

బతుకులో జీవం నింపే కళ

Mar 6 2026 5:43 AM | Updated on Mar 6 2026 5:43 AM

Batik artist Maria Clara talks about art, life

‘మనసుకు నచ్చిన పని ఎంతటి సంతృప్తిని ఇస్తుందో హస్తకళల ద్వారానే అర్థం చేసుకోవచ్చు అంటారు’ మరియా క్లారా. సికింద్రాబాద్‌లోని నాగోల్‌లో ఉంటున్న మరియా ఉద్యోగాన్ని వదిలేసి, కలంకారి, బాతిక్‌ పెయింటింగ్‌ నేర్చుకొని కలంబాతిక్‌ మరియా క్లారా గా తన కళకు గుర్తింపు తెచ్చుకున్నారు. మహిళ జీవితంలో తగిలే ఎదురుదెబ్బలు ఆమె మనసును ఎలా గాయపరుస్తాయో, తిరిగి ఆమె జీవితం కొత్తగా ఎలా మార్పు చెందుతుందో ఈ కళ కూడా వస్త్రం మీద అలాగే కళ్లకు కడుతుంది’ అంటూ కళాత్మకమైన విశేషాలను పంచుకున్నారు...

‘‘కరోనా నా జీవితంలో పెద్ద మార్పు తెచ్చింది. రెండు దశాబ్దాల పాటు ప్రైవేట్‌ ఉద్యోగంలో యాంత్రికంగా రోజులు గడిచిపోయాయి. జీవితంలో జీవం ఉండేదెలాగో అన్వేషిస్తుండగా హస్త కళలు నన్ను ఆకట్టుకున్నాయి. ఆ సమయంలో బాతిక్‌ ఆర్ట్‌తో గొప్ప అనుభూతిని పొందాను. మావారు ప్రైవేట్‌ జాబ్‌ చేసి, రిటైర్‌ అయ్యారు. మా అబ్బాయి జాబ్‌ చేస్తున్నాడు. ఎవరి ప్రయాణం వాళ్లదే. నేను వాళ్లకు సపోర్ట్‌ చేస్తాను. వాళ్లు నాకు సపోర్ట్‌ చేస్తారు. నా ఇష్టాన్ని వాళ్లు కాదనరు.

అర్థమెంతో...
వ్యాక్స్‌తో క్లాత్‌ మీద ముందుగా గీతలను డిజైన్‌ వచ్చేలా గీస్తాం. తర్వాత దానిని ముందే సిద్ధం చేసుకున్న రంగులలో ముంచుతాం. దాంతో ఆ క్లాత్‌మీద ఉన్న వ్యాక్స్‌ లైన్‌ అంతా విరిగిపోతుంది. ఆ గీతల స్థానంలో రంగు లైన్లు లైన్లుగా ఇంకిపోయి, ఒక చెప్పలేని అందం కనిపిస్తుంది. ఎక్కడైతే ఎవరి వల్లనైతే మనం బాధపడతామో, ఆ తర్వాత అదే బాధ అవతలి వారు పడుతున్నప్పుడు దానిని  తొలగించాలని చూస్తాం. ఎందుకంటే ఆ నొప్పిని అనుభవించిన వాళ్లకే ఆ బాధ ఏంటో అర్థం అవుతుంది. అంటే, ‘నువ్వు నొప్పిని అనుభవిస్తేనే, అవతలి వారికి ఉపశమనం ఇవ్వగలవు..’. అని ఈ బాతిక్‌ ద్వారా జీవితపు అర్థం ఏంటో తెలిసి వచ్చింది. అంటే నొప్పిని అనుభవించిన స్త్రీయే, నొప్పికి మందుకూడా వేయగలదు. అది ఈ బాతిక్‌ చూపుతుంది. మనసుకు అయిన గాయాలకు రంగులు పూసి, మనకే అందంగా చూపించే కళ ఇది.

ఆసరా అయ్యేలా కూడా ఉండాలి
మన గురించి బయటివారికి చెప్పలేని భావాలను ఆర్ట్‌ రూపంలో చెప్పవచ్చు. నటించాల్సిన అవసరం లేకుండా చేసేవి హస్తకళలే. నేను చేసేది కమర్షియల్‌ వర్క్‌ కాదు. ఎవరైనా తమకు నచ్చిన అంశం డిజైన్‌లో వచ్చేలా చేసి ఇవ్వమని అడిగితే దానికి తగినట్టు చేసి ఇస్తాను. ఉదాహరణకు.. ‘మా ఇంట్లో పెళ్లి ఉంది, వధూవరుల డిజైన్‌ చేసి ఇవ్వాలి’ అని అడిగితే అలాగే చేసి ఇస్తాను. మనసుకు నచ్చిన పని చేస్తున్నప్పుడు పది మందికి ఆసరా అయ్యేలా కూడా ఉండాలని కోరుకుంటాం.

ఉపాధి కల్పిస్తున్నాను..
కొన్ని చీరలు, డ్రెస్సులు కలం బాతిక్‌ పెయింటింగ్‌ చేసి, బొటిక్స్‌కి ఇస్తాను. ఈ వర్క్‌ని కొంతమంది మహిళలకు నేర్పి, వారికి ఉపాధిని కల్పిస్తున్నాను. గుజరాతీ, బెంగాల్‌ రాష్ట్రాలలో ఈ బాతిక్‌ పెయింటింగ్‌ బాగా ్రపాచుర్యంలో ఉంది. మన దగ్గర బ్లాక్‌ ప్రింట్‌ అచ్చులతో వేస్తారు. నేను మాత్రం పూర్తిగా చేతితోనే వేస్తాను. కాలేజీలు, స్కూళ్లకు కూడా వెళ్లి అక్కడి విద్యార్థులకు ఈ వర్క్‌  నేర్పిస్తున్నాను. ఈ కళ గురించి ఏమీ తెలియని వారు కూడా వయసుతో నిమిత్తం లేకుండా ఈ పనిని నేర్చుకోవచ్చు. హైదరాబాద్‌లోని ఇందిరా మహిళా శక్తి బజార్‌లో జరిగే కార్యక్రమంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు ఈ వర్క్‌ నేర్పించే అవకాశం లభించింది. ఇష్టంతో నేర్చుకున్న పని నన్ను ఎంతో మంది కళాకారులకు చేరువ చేసింది. భావోద్వేగాల సమతుల్యతను నేర్పించింది’ అంటూ హస్తకళల గొప్పతనాన్ని అందంగా వివరించారు ఈ కళాకారిణి.

– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement