ప్రేమంటే అంతేగా! అంతేగా! | Pradeep Kondaparthi-Saraswati life story, Valentines Day special | Sakshi
Sakshi News home page

ప్రేమంటే అంతేగా! అంతేగా!

Feb 14 2026 5:11 AM | Updated on Feb 14 2026 5:11 AM

Pradeep Kondaparthi-Saraswati life story, Valentines Day special

వాలెంటైన్స్‌ డే

‘అంతేగా... అంతేగా’ ఈ సినిమా డైలాగ్‌ ఇటీవల కాలంలో బాగా పాపులర్‌ అయింది. ‘ముద్దమందారం’ ప్రదీప్‌ కాస్తా ‘అంతేగా.. అంతేగా’ ప్రదీప్‌ను చేసింది. నేటికాలం ప్రేమలకు అసలు సిసలు శత్రువు ఇగో. చిన్న చిన్న ఇగోలతోనే లవ్‌ బ్రేకప్‌లు పెరుగుతున్నాయి. ‘నా మాటే నెగ్గాలనే’ పంతానికి పోకుండా ‘అంతేగా!

 నువ్వు చెప్పింది రైటే కదా!’ అనే ఒక్కమాట ప్రేమను పదికాలాల పాటు నిలుపుతుంది.వంద అబద్ధాలు ఆడయినా ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. ఒక్క అంతేగా, అంతేగా! డైలాగ్‌ వాడితే ఎన్ని ప్రేమలైనా నిలబెట్టుకోవచ్చు.. సరదాగా నవ్వుకుని.. కాస్త సీరియస్‌గా ఆలోచించండి.

‘సెల్ఫ్‌ సెంట్రిక్‌గా ఉండే ప్రేమలు దీర్ఘకాలం మనలేవు. రిలేషన్‌ ఒక పుష్పగుచ్చంలా ఉండేలా చూసుకోవాలి’ అంటున్నారు సీనియర్‌ నటుడు ప్రదీప్‌ కొండపర్తి, సరస్వతి దంపతులు. 37 ఏళ్ల కుటుంబ జీవనంలోని ప్రేమను ‘వాలెంటైన్స్‌ డే’ సందర్భంగా పంచుకున్న విశేషాలు..

ఆరేంజ్డ్‌ నుంచి లవ్‌
ప్రదీప్‌: మాది మ్యారేజ్‌ తర్వాత ప్రేమ. అరేంజ్డ్‌ మ్యారేజ్‌. చెట్టుకు నీళ్లు పోస్తేనే అది పువ్వులు ఇస్తుంది. మనిషి కూడా అంతే, గుప్పెడు ప్రేమను పంచితే తిరిగి ప్రేమను అందిస్తాడు. ఈ మార్గాన్ని ఎంచుకున్నాం కాబట్టి ప్రేమ అనే పుష్పగుచ్చంలో ఇలా సాగిపోతున్నాం. 
సరస్వతి: నా ఎం.ఎ.  తర్వాత పెళ్లి అయ్యింది. చిన్న కుటుంబం నుంచి ఉమ్మడి కుటుంబంలోకి వచ్చాను. ప్రయత్నపూర్వకంగా మార్చుకోవాల్సినవి, మలుచుకోవాల్సినవి తప్పక ఉంటాయి. నేను కొంచెం సైలెంట్‌. ప్రదీప్‌ గారితో జర్నీ స్టార్ట్‌ అయ్యాక ఆయన అందించిన ప్రేమ, కంఫర్ట్‌ వల్ల సులువుగా అందరిలో కలిసిపోయాను. పెళ్లి తర్వాత పీహెచ్‌డి చేశాను, యాంకరింగ్‌ ఫీల్డ్‌లోకి వచ్చాను, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తున్నాను.. ఇదంతా ప్రదీప్‌గారి సపోర్ట్‌ వల్లే.

భేదాభిప్రాయాలు
సరస్వతి: సాధారణంగా ఎదుటివారిని మార్చాలనుకున్నప్పుడే విభేదాలు తలెత్తుతాయి. అయితే, మన ప్రవర్తన ద్వారా అవతలి వాళ్లలో మార్పు తీసుకురావచ్చు. ఇద్దరూ ఓపెన్‌గా ఉంటేనే పాజిటివ్‌ ఛేంజ్‌ తీసుకు రాగలుగుతాం. నా వరకు నేను  డిసిప్లిన్‌గా ఉంటాను. టైమ్, నీట్‌నెస్‌.. ఖచ్చితత్త్వం పాటిస్తాను. ఏదైనా భేదాభిప్రాయాలు వస్తే కొంత పాజ్‌ ఇచ్చి చూడాలి. అప్పుడు వారికే అర్థమైపోతుంది.
ప్రదీప్‌: ఇద్దరమూ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ ట్రెయినర్స్‌గా ఉన్నాం. కాబట్టి, ముందు మేం పాటించి, అవి మిగతావారికి చెబుతాం. అందుకే, మాట తీరు, ప్రవర్తన సరిగ్గా ఉండటానికి ప్రాక్టీస్‌ చేయాల్సి ఉంటుంది. ఏది చేసినా మనవాళ్లతో బాగుండటానికే అనుకుంటే ఎన్ని విభేదాలు ఉన్నా అవి పెద్దవిగా అనిపించవు.

త్యాగాలు
ప్రదీప్‌: ఎంత బిజీ అనుకున్నా సరే కొన్నింటికి తప్పక టైమ్‌ కేటాయించుకోవాల్సిందే! కలిసి చేసే ప్రయాణంలో బిజీ అంటే కుదరదు. ‘నా నుంచి మన’ అనుకుంటే అద్భుతమే కదా! 
సరస్వతి: ఇద్దరి మధ్య స్నేహం ఉండాలి. ఎదుటివారి కోణంలో నుంచి ఆలోచించాలి. చిన్న చిన్న త్యాగాలు చేయాలి. ఏదైనా సందర్భం ఎదురైనప్పుడు ‘ఇబ్బంది పడకు, నేను చూసుకుంటాలే’ అని చెప్పాలి. ఎక్కడైనా పొరపాటు జరిగితే, దానిగురించి అవతలి వారికి చెప్పే సంస్కారం ఇద్దరిలోనూ ఉండాలి. బలహీనతలను పట్టుకొని నస పెట్టకూడదు. కొన్ని విషయాల్లో సర్దుకుపోయే తత్త్వం ఉండాలి.

అలవాట్లు
ప్రదీప్‌: రిలేషన్‌ షిప్‌ను ఒక బొకేలా తీసుకుంటే అందులో అలవాట్లు కూడా వస్తాయి. అయితే, అలవాట్లు వ్యసనాలు కాకూడదు. పాటలు పాడటం, రచనలు చేయడం, టీవీ.. ఇలా చాలా విషయాల్లో భార్యాభర్తల అలవాట్లలలో తేడాలు ఉంటాయి. వాటి గురించి కామెంట్స్‌ చేయడం, జోకులేయడం చేస్తే.. బాధపడే సందర్భాలూ ఉంటాయి. రోజులో అరగంటసేపైనా మాట్లాడుకుంటే ఇద్దరి మధ్యా అవగాహన పెరుగుతుంది. 
సరస్వతి: ఇద్దరికీ నష్టం కలుగుతున్నాయనుకున్న అలవాట్లు ఏవైనా ఉంటే వాటిని పక్కన పెట్టేయడమే మేలు. మా వరకు విసుగు అనిపించే అలవాట్లు లేవు. చాలా మందికి వ్యసనాల వల్ల సమస్య ఉంటుంది. ముందుగా గుర్తించి, వాటికి ఒక హద్దు గీసుకుంటే సరి!

ఊహించని కానుక
ప్రదీప్‌ : చివరి వరకు మిగిలేది భార్యభర్తలే. ఒకరి ఎక్స్‌పెక్టేషన్స్‌ని మరొకరు అర్ధం చేసుకొని, వాటిని అందించగలగాలి. ఎప్పుడైతే ఎదుటివారి భావాలకు, టైమ్‌కు ప్రాధాన్యత ఇస్తామో, అదే తిరిగి మనకు వస్తుంది. ప్రతి చర్యలో, మాటలో నీకు నేనున్నాను అనే ఎక్స్‌ప్రెషన్‌ను ఇవ్వగలిగితే చాలు. సమస్యలు రావు.
సరస్వతి: ఎమోషనల్‌ వెల్‌బీయింగ్‌ అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. పార్టనర్‌కి ఊహించని కానుక ఇవ్వాలని ఉంటుంది. అది, డైమండ్‌ నెక్లెస్‌లు కానక్కర్లేదు. సందర్భాన్ని బట్టి ఒక పేపర్‌పైన లవ్‌ సింబల్‌ గీసి, ఇచ్చినా ఆ సమయానికి అది పెద్ద కానుకే. ఆ ప్రేమలో స్వచ్ఛతనే చూడాలి. ఒకసారి నా బర్త్‌డే రోజున రిలేటివ్స్‌ పెళ్లికి వెళ్లాం. తిరిగి వస్తూ చార్మినార్‌ దగ్గర అర్ధరాత్రి కేక్‌ కట్‌ చేయించారు. నాటి సంఘటన ఎప్పటికీ మర్చిపోలేను. ఇలా ఊహించనివి ఎంతో ఆనందాన్నిస్తాయి. మా ఇద్దరి అభిరుచులు వేరు, ఆలోచనలు వేరు, నచ్చే కలర్స్‌ వేరు.. చాలా వైరుధ్యం ఉంది. కానీ, మేం ఇద్దరం ఒకటే.

– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement