వస్త్రమే చిత్రము! | Gaurang Shah integrates a textile museum in his Hyderabad | Sakshi
Sakshi News home page

వస్త్రమే చిత్రము!

Jan 10 2026 4:12 AM | Updated on Jan 10 2026 4:12 AM

Gaurang Shah integrates a textile museum in his Hyderabad

∙కళాత్మకత

ప్రాచీన నిర్మాణాలను చూసినప్పుడు వాటిలోని కళాత్మకత మన చూపును తిప్పుకోనివ్వదు. అలాంటి సమయాల్లో గత కాలపు వైభవం గొప్పదనాన్ని చర్చించుకోకుండా ఉండలేం.  హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో డిజైనర్‌ గౌరంగ్‌ షా టెక్ట్స్‌టైల్‌ మ్యూజియం సందర్శిస్తే మనకు అలాంటి అనుభవమే ఎదురవుతుంది. దేశంలోని హస్త కళాకారుల సృజనను ఒక చోట చేర్చి మనకు అందించడంలో ఈ డిజైనర్‌ చేసిన కృషిని అభినందించకుండా ఉండలేం.

డిజైనర్‌ స్టూడియోలకు వెళ్లినప్పుడు మన చూపు మొదట గోడ మీదుగానే వెళుతుంది. గౌరంగ్‌ షా టెక్ట్స్‌టైల్‌ మ్యూజియంకు వెళ్లినప్పుడు అక్కడ పసుపు, కుంకుమ కలిపినట్టుగా ఉండే గోడలు కొన్నిచోట్ల, తెలుపు, ముదురు గోధుమ రంగుతో రూపుకట్టిన కళాత్మకత, పెయింట్‌లా కనిపించే ఫ్యాబ్రిక్‌ వర్క్స్‌ .. ఒక్కొక్కటి కథ చెబుతున్నట్టుగా కళాకారుల లోకంలోకి తీసుకెళుతుంది. 

మూడు అంతస్తులలో ఉన్న ఈ మ్యూజియం ప్రతి అంతస్తులో వాల్‌ ఆర్ట్, వస్త్రాలను ప్రతినెలా మార్చుతూ ఉంటారు. ఇందులో భాగంగా ఒక నెల కలంకారి, మరొక నెల పటోలా తరువాత జమ్దానీ.. ఇలా పూర్తిగా ఒక థెరపీ భావన మనలో కలుగుతుంది. గత సంవత్సరం ప్రవేశపెట్టిన ఈ కళాత్మక సంపద గురించి గౌరంగ్‌ షా మాట్లాడుతూ... 

‘‘ప్రాతికేళ్లుగా దేశమంతా చేనేతలతోనూ, హస్తకళాకారులతోనూ కలిసి పనిచేశాను. ఎక్కడెక్కడో మారుమూల పల్లెల్లో ఉన్న కళాకారులను కలుసుకున్నాను. కనుమరుగవుతున్న కళలకు రూపం ఇవ్వాలని ప్రయత్నించాను. అందుకు నా ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చాలా ఉపయోగపడింది. ఫ్యాషన్‌ షోలలో మన తెలుగు రాష్ట్రాలలోని చేనేతలతో ప్రాటు దేశవ్యాప్త చేనేతలను ప్రదర్శించాను. 

కొత్త డిజైన్స్, ఫ్యాబ్రిక్‌ మిక్సింగ్, డిజైనింగ్స్‌లో మార్పులు తీసుకువచ్చాను. వాటిలో షిబోరి డైయింగ్, బాతిక్‌ నమూనాలు, కలంకారి హ్యాండ్‌–పెయింటింగ్, బ్లాక్‌ ప్రింటింగ్‌ వంటి క్రాఫ్ట్‌ టెక్నిక్స్‌ అన్నింటినీ ఇప్పుడు ఒకేచోట పొందుపరిచాను. దేశంలోని పేరొందిన హస్తకళలు కలంకారీ, జమ్దానీ, గోటాపట్టీ, ,.. మొదలైన పెయింటింగ్, డైయింగ్, ఎంబ్రాయిడరీ వర్క్స్‌తో ఒక థీమ్‌గా తీసుకువచ్చాం. రాబోయేది వివాహ వేడుకల సీజన్‌ కాబట్టి ఇప్పుడు కంచి పట్టు థీమ్‌ తీసుకున్నాం.

గోడలు మాట్లాడతాయి...
ఇక్కడకు వచ్చినవారు .. చికంకారి, కాంత.. వంటి ఎంబ్రాయిడరీ శైలులతో ప్రాటు జమ్దానీ నేత, డైయింగ్‌ పద్ధతులతో ప్రకృతిలోని వివిధ రకాల పూల సొగసు, రేఖాగణిత నమూనాలు చూడచ్చు. లేత రంగుల్లో బెడ్‌ఫర్నిషింగ్, టేబుల్‌ రన్నర్స్, నేలపైన పరుచుకున్న కార్పెట్‌లు, లాంప్‌ షేడ్స్‌.. ఇవన్నీ టెక్స్‌టైల్‌ ఆర్ట్‌లో ఒక భాగమే. ఇక్కడకు వచ్చినవారు ‘మ్యూజియంలు గత కాలపు గుర్తులను ప్రదర్శిస్తాయి.

 కానీ, ఇక్కడ ఉన్నవాటిని ఈ రోజులకు ఎలా అన్వయిస్తున్నారు?’ అని అడుగుతుంటారు. మన చుట్టూ ఉన్న అందాలకు మరిన్ని మెరుగులు దిద్ది మరింత ఆసక్తికరంగా చూపిస్తే అది అన్ని కాలాలకు ఎవర్‌గ్రీన్‌గానే నిలుస్తుంది. ప్రతి ఫ్రేమ్‌కు పక్కనే ఆ వర్క్‌కి సంబంధించిన నోట్‌ కూడా ఉంటుంది. ఈ వివరాలు తెలుసుకోవడానికి దూర ప్రాంతాల నుంచి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులు చేస్తున్న విద్యార్థులు కూడా ఇక్కడకు 
వస్తుంటారు.

కాలానికి అతీతమైన కళాత్మకత
కలంకారీ ఆర్ట్‌కు సంబంధించి 57 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పుతో ఒక ΄్యానెల్‌ తయారు చేయించాం. రెండు గోడలను ఆక్రమించుకున్న ఈ డిజైనింగ్‌లో మహాభారతం, రామాయణం, భాగవతాన్ని అందంగా చిత్రీకరించారు. డిజైనర్‌ తిరుపతి క్లస్టర్‌లో రెండు సంవత్సరాలకు పైగా ఒకే కళాకారుడు దీనిని తయారు చేశాడు. ఇది సహజ రంగుల అద్భుతమైన వస్త్రం. వంద అడుగుల పొడవుతో ఉన్న ఒకే వస్త్రంపైన పూర్తి రామాయణం చిత్రిస్తున్నారు. 

అది త్వరలో రాబోతోంది. గోడలకు పెట్టిన ఫ్రేమ్స్‌లో తంజావూరు, గుజరాత్‌ మోచి కుట్టు, పంజాబ్‌ ఫుల్కారీలు, బెంగాలీల కథా వంటివి తీసుకున్నాం. ఇక తొమ్మిది అడుగుల ఎత్తు నుండి వేలాడదీసిన ప్రాతికపైగా చీరలది ఒక థీమ్‌. ఒక్కో నెల ఒక్కో థీమ్‌ చీరలను ఇక్కడ ఉంచుతాం. రాబోయే వివాహ వేడుకల కోసం కంచిపట్టు థీమ్‌ తీసుకున్నాం. 

ఆ పక్కనే జైపూర్‌ నుండి చేతితో చిత్రించిన టైల్స్, ఇతర ఫర్నిషింగ్‌ ఉంటుంది. ఇక రెండవ అంతస్తులో మహిళల కోసం రెడీ టు వేర్, మూడవ అంతస్తులో పురుషుల డ్రెస్సులు ఉంటాయి. ఇవే కాకుండా కాశ్మీర్‌ నుండి ఆంధ్ర వరకు ఉన్న నేత నైపుణ్యాలను ఇక్కడకు తీసుకువచ్చాం. ఈ కళ మూలంలో మొఘల్, కాకతీయ తోరణాలు, ఆలయ శిల్పాలు, పక్షులు, అటవీ సంపదను గుర్తుకు తెస్తాయి. అదంతా నేతలో సున్నితమైన అందాన్ని కళాకారులు తీసుకువచ్చారు. ఈ చేతిపనులన్నీ కళావశేషాలు కావు, సజీవ భాష.  

కళ్లు చెదిరే కళాఖండాలు
కృష్ణలీలల ఫ్రేమ్స్‌లో ప్రాటన్‌ పటోలా, పటచిత్ర, తంజావూరు వంటి విభిన్న పద్ధతులలో రూపొందాయి. ఆరి ఎంబ్రాయిడరీ, అహ్మదాబాద్‌లో రూపొందిన గణేశ కాన్వాస్‌లో మోగా సిల్క్, ఆర్గాంజా, మొఘల్‌ ఆర్కిటెక్చర్‌ను ఒకే ΄్యానెల్‌లో వచ్చేలా చూశాం. ఉ΄్పాడ, వెంకటగిరి, ప్రార్సీ గారా, పైథాని వరకు నేత పనితోప్రాటు దేశవ్యాప్తంగా ఏడు వేలకి పైగా కళాకారుల కుటుంబాలతో కలిసి పనిచేస్తున్నాం. ఇది మన సామూహిక జీవన కళా చైతన్యానికి వారధి’’ అని తెలియజేశారు ఈ డిజైనర్‌.  

– నిర్మలారెడ్డి, సాక్షి పీచర్స్‌ ప్రతినిధి
ఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement