వరించిన విశ్వగురు వరల్డ్ రికార్డు
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల బాలిక వేసిన పెయింటింగ్ విశ్వగురు వరల్డ్ రికార్డు సాధించింది. నిజాంపేట్ సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో పెయింటింగ్‌లో శిక్షణ పొందిన విశ్వేశ్వరరెడ్డి, అరుణ దంపతుల కుమార్తె ప్రవ్య ఆదిత్రి నాలుగు అడుగుల ఎత్తు, ఐదు అడుగుల వెడల్పు మొత్తం 20 అడుగుల కాన్వాస్‌పై కేవలం 12.44 నిమిషాల్లో శివుడి పెయింటింగ్ (Lord Shiva Painting) వేసి ఆదివారం ఈ రికార్డును సొంతం చేసుకుంది.
బంజారాహిల్స్ ప్రసాద్ ఫిలిం ల్యాబ్స్‌లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవిదేవి, రిటైర్డ్ ఎస్పీ ఎస్‌ఎం రత్న, డాక్టర్ గుండ్లూరు సురేంద్రబాబు, డాక్టర్ మల్లిక్ సింగరాజు, డాక్టర్ విజయభాస్కర్, విశ్వగురు వరల్డ్ రికార్డు ఫౌండర్ సీఈఓ డాక్టర్ సత్యవోలు రాంబాబు, డైరెక్టర్ పూజిత, డాక్టర్ ఎంఆర్‌ఎస్ రాజు సమక్షంలో అతి తక్కువ సమయంలో శివుడి పెయింటింగ్ వేసి ఆశ్చర్యపరిచింది. ఆమె ప్రతిభను తిలకించిన అతిథులు సన్మానించి అభినందనలు తెలిపారు.


