అత్యంత విషపూరితమైన గడ్డిమందు పారాక్వాట్‌..! | Paraquat Poisoning: Symptoms And Treatment | Sakshi
Sakshi News home page

అత్యంత విషపూరితమైన గడ్డిమందు పారాక్వాట్‌..! ప్లీజ్‌ క్విట్‌

Mar 6 2026 12:57 PM | Updated on Mar 6 2026 1:10 PM

Paraquat Poisoning: Symptoms And Treatment

అత్యంత విషపూరితమైన (హై అక్యూట్‌ టాక్సిసిటీ) గడ్డి/కలుపు మందు పారాక్వాట్‌ను నిషేధించాలన్న డిమాండ్‌ ఊపందుకుంది. దీన్ని 9 పంటల్లో గడ్డి/కలుపు నివారణకు వినియోగించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, 25 పంటల్లో దీన్ని తెలిసో తెలియకో వాడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ మందును చల్లేటప్పుడు జాగ్రత్తలు తగిన రీతిలో తీసుకోకపోవటం వల్ల రైతులు, రైతుకూలీలు ఆ విషప్రభావానికి తీవ్రఅస్వస్థతకు గురై చనిపోతున్నారు. 

ఈ ప్రమాదకరమైన రసాయనం గాలి ద్వారా పీల్చినా, క్షణికావేశంలో తాగినా, దీన్ని చల్లిన నేలపై నడిచేటప్పుడు ముల్లు గుచ్చుకున్నా శరీరం విషపూరితమవుతుంది. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె దెబ్బతింటాయి. దీని ప్రభావాన్ని అడ్డుకోవటానికి ఇప్పటి వరకు విరుగుడు చికిత్స అందుబాటులో లేదు. ఈ కారణంగా పారాక్వాట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిషేధించాలన్న డిమాండ్‌ నానాటికీ బలపడుతోంది. 

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్, డాక్టర్స్‌ ఎగెనెస్ట్‌ పారాక్వాట్‌ పాయిజన్‌ సంస్థలు సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌లో పలువురు పాల్గొని నిషేధం కోసం పోరాడతామన్నారు. ఇప్పటికే ఒడిషా, కేరళ రాష్ట్రాల్లో నిషేధించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ నిషేధించాల్సిన అవసరం ఉంది. పెస్టిసైడ్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌ ఇండియా కొన్ని సంవత్సరాల క్రితమే రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించి నిషేధించాలని కోరింది. ఈ నేపథ్యంలో అసలు పారాక్వాట్‌ కలుపు/గడ్డి మందు పూర్వాపరాలేమిటో తరచి చూద్దాం...

పారాక్వాట్‌ డైక్లోరైడ్‌.. నాన్‌–సెలెక్టివ్‌ కాంటాక్ట్‌ హెర్బిసైడ్‌. అంటే.. ఏదో ఒక రకం కలుపు మొక్కనో లేదా ఏవో కొన్ని రకాల కలుపు మొక్కల్నో నిర్మూలించడానికి ఉద్దేశించింది కాదు. ఇది తాకిన అన్ని ఆకుపచ్చ మొక్కల కణజాలాలను చంపుతుంది లేదా దెబ్బతీస్తుంది. వేగంగా పనిచేసే రసాయనం. ఇలాంటి కలుపు మందులు పారిశ్రామిక ప్రాంతాల్లో, రోడ్ల పక్కన చెట్లు, గడ్డిని నియంత్రచడానికి.. తేయాకు, పత్తి, బంగాళాదుంపలు తదితర పంటల్లో కలుపు మొక్కలను తొలగించడానికి పయోగిస్తారు.

ఇటువంటి గడ్డి మందులు మొక్కల కణ త్వచాలను నాశనం చేయడం ద్వారా, కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం కలిగించడం ద్వారా ఆ మొక్కలు ఎండిపోయేలా చేస్తాయి. దీనివల్ల గంటల్లోనే మొక్కల భాగాలు వేగంగా, స్పష్టంగా ఎండిపోతాయి, వాడిపోతాయి. పారాక్వాట్‌ను గడ్డి, పెద్ద ఆకులతో కూడిన కలుపు మొక్కలను వేగంగా నాశనం చేయడానికి విస్తృతంగా ఉపయోగిస్తారు.

1964 నుంచి వాణిజ్యపరంగా ఉత్పత్తి
పారాక్వాట్‌ డైక్లోరైడ్‌ గడ్డి మందుకు 140 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ప్రపంచంలో అత్యంత విసృతంగా ఉపయోగంలో ఉన్న, వివాదాస్పదమైన కలుపు మందులలో ఒకటి. 19వ శతాబ్దం చివరలో మొదటిసారిగా సంశ్లేషణ చేయబడినప్పటికీ, కలుపును చంపే దీని  సామర్థ్యాన్ని 20వ శతాబ్దం మధ్యలో మాత్రమే గుర్తించారు. ఆస్ట్రియన్‌ రసాయన శాస్త్రవేత్తలు హ్యూగో వీడెల్, ఎం. రస్సోలు 1882లో మొదట అయోడైడ్‌ ఉప్పుగా సంశ్లేషణ చేశారు. 

1955లో ఇంగ్లాండ్‌లోని ఇంపీరియల్‌ కెమికల్‌ ఇండస్ట్రీస్‌ (ఐఇఐ) శాస్త్రవేత్తలు వ్యవసాయ రసాయనంగా దాని సామర్థ్యాన్ని గుర్తించారు. 1962 నుంచి వాణిజ్య పరంగా ఉత్పత్తి చెయ్యటం ్ర΄ారంభమైంది. 1964 మొదట అమెరికాలో పురుగుమందుగా ఉపయోగించడానికి నమోదైంది. 1970 దశకం చివరలో మెక్సికన్‌ గంజాయి పొలాలపై పారాక్వాట్‌ను అమెరికా స్ప్రే చేయించింది. 1985లోజూన్‌లో వెండింగ్‌ మెషిన్‌ ద్వారా విక్రయించిన పానీయాలలో ఈ రసాయనం కలవటం ఫలితంగా కనీసం 10 మంది మరణించారు. 

2007లో నిషేధించిన ఈయూ
అమెరికా 1978లో పారాక్వాట్‌ను అధిక విషపూరిత స్వభావం కారణంగా గుర్తించి, పరిమితంగా వాడే పురుగుమందుగా వర్గీకరించింది. 1980–90 దశకాల్లో అనేక దేశాలు దీన్ని నియంత్రించటం ప్రారంభించాయి. పారాక్వాట్‌ వల్ల ప్రజారోగ్యానికి తీరని హాని జరుగుతోందని స్వీడన్, తదితర ఐరోపా దేశాలు పట్టుబట్టటంతో 2007లో యూరోపియన్‌ యూనియన్‌ నిషేధించింది. 

ప్రస్తుతం చైనా (దేశీయ వినియోగం మాత్రమే), బ్రెజిల్, థాయిలాండ్‌తో సహా 70కి పైగా దేశాల్లో పారాక్వాట్‌ గడ్డి మందు వాడకాన్ని నిషేధించాయి లేదా దశలవారీగా వాడకాన్ని నిలిపివెయ్యటానికి నిర్ణయాలు తీసుకున్నాయి. అయినప్పటికీ అమెరికాతో పాటు భారత్‌ సహా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇప్పటికీ విస్తృతంగా ఉపయోగిస్తూనే ఉన్నారు.

అమెరికాలో త్వరలో ఉత్పత్తి నిలిపివేత
పారాక్వాట్‌ గడ్డి మందు ప్రభావానికి గురైన వారికి పార్కిన్సన్స్‌ వ్యాధి వస్తోందని నమ్ముతున్నారు. దీని తయారీదారులపై ప్రస్తుతం అమెరికాలో వేలాది వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌ నాటికి పారాక్వాట్‌ గడ్డి మందు తయారీని నిలిపివేస్తానని సింజెంట బహుళ జాతి కంపెనీ ప్రకటించినట్లు ద గార్డియన్‌లో తాజాగా కథనం ప్రచురితమైంది. 

ఈ నిర్ణయం ప్రజారోగ్యంలో ఒక మైలురాయి వంటిదని ఫ్లోరిడా యూనివర్సిటీలోని ఫిక్సెల్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మైఖేల్‌ ఓకున్‌ వ్యాఖ్యానించారు. యూరప్‌ దేశాలు సహా అనేక దేశాలు నిషేధించినప్పటికీ అమెరికాలో సోయాబీన్స్, పత్తి, మొక్కజొన్న, ద్రాక్ష, పిస్తా, వేరుశనగ వంటి ఎన్నో పంటల్లో ఇప్పటికీ దీన్ని వాడుతూనే ఉన్నారు.

భారత్‌లో పరిస్థితులు
భారతదేశంలో పారాక్వాట్‌ డైక్లోరైడ్‌ వాడకాన్ని నిషేధించాలన్న డిమాండ్‌ ప్రబలంగా ఉంది. దీన్ని ఉపయోగించడానికి జాతీయ స్థాయిలో అనుమతి ఉంది. అయినప్పటికీ.. దీని అత్యధిక విషపూరిత స్వభావం, దీన్ని తాగటం ద్వారా ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య పెరుగుతుండటంతో ఒడిషా, కేరళ వంటి రాష్ట్రాలు నిషేధించాయి. ఒడిశా రాష్ట్రంలో ΄ారాక్వాట్‌ అమ్మకం, పంపిణీ, వాడకంపై నిషేధం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 2023 చివరిలో నిషేధించింది. ప్రతి ఆరు నెలలకోసారి నిషేధాన్ని పొడిగిస్తోంది. కేరళ గతంలో నిషేధాన్ని అమలు చేసింది. కానీ, పురుగుమందుల తయారీదారులు చట్టబద్ధంగా సవాలు చేసిన తర్వాత 2022లో దాన్ని రద్దు చేసింది.

ఈ నేపధ్యంలో తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పారాక్వాట్‌ విష ప్రభావంతో వందలాది మంది మరణిస్తున్నందున దీన్ని నిషేధించాలని పిటిషనర్లు కోరుతున్నారు. కలుపు మందుపై మీ వైఖరేమిటో వివరించమని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

9 పంటలకే అనుమతి
పారాక్వాట్‌ కలుపు మందును టీ, కాఫీ, పత్తితో సహా తొమ్మిది నిర్దిష్ట పంటలపై మాత్రమే ఉపయోగించడానికి కేంద్ర క్రిమిసంహారకాల బోర్డు రిజిస్ట్రేషన్‌ కమిటీ అనుమతించింది. అయితే, దేశంలో 25 రకాల పంటలపై ఉపయోగించబడుతున్లట్లు పెస్టిసైడ్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌ ఇండియా సర్వే నివేదికలు సూచిస్తున్నాయి. ఇలా వాడటం భారతీయ క్రిమిసంహారకాల చట్టాన్ని ఉల్లంఘించటమే. భారత దేశంలో 1,500 కంటే ఎక్కువ తయారీ యూనిట్లు పారాక్వాట్‌ను ఉత్పత్తి చేయడానికి లైసెన్స్‌ పొందగా, వీటిలో 35 ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. 

ప్రభుత్వం నియమించిన అనుపమ్‌ వర్మ కమిటీ 2015లో పారాక్వాట్‌ను సమీక్షించి, ‘కఠినమైన పరిమితులు’, మెరుగైన ప్యాకేజింగ్‌ పద్ధతులు పాటిస్తూ వినియోగాన్ని కొనసాగించడానికి అనుమతించింది. అయితే ఈ చర్యలు సమర్థంగా అమలు కావటం లేదని నిపుణులు వాదిస్తున్నారు.

సైనైడ్‌ కన్నా ప్రమాదకరం
వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు పారాక్వాట్‌ను ‘సైనైడ్‌ కంటే ప్రమాదకరమైనది‘ అని అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే దీనికి విరుగుడు లేదు. అందువల్ల పొలాల్లో దీన్ని పిచికారీ చేసే క్రమంలో దాని విషప్రభావానికి గురైన వారు లేదా దీన్ని క్షణికావేశంలో తీసుకున్న వారికి చికిత్స చేసి రక్షించటం కష్టసాధ్యమైంది. దీంతో మరణాలు రేటు పెరుగుతోంది. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వంటి వైద్య సంఘాలు దీన్ని వెంటనే పూర్తిగా నిషేధించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

దేశవ్యాప్తంగా నిషేధించాలి
పారాక్వాట్‌ వంటి అత్యంత విషతుల్యమైన వ్యవసాయ రసాయనాల వాడాకాన్ని వదిలించుకోవడానికి, వాటి వల్ల కలిగే హానిని నిలువరించటానికి పనిచేస్తున్నాం. క్లోర్‌పైరిఫోస్, ఫి్ర΄ోనిల్‌ పురుగుమందులు, అలాగే అట్రాజిన్, పారాక్వాట్‌ డైక్లోరైడ్‌ కలుపు మందులపై అధ్యయనం చేశాం. 

పారాక్వాట్‌ను 9 పంటల్లో వాడటానికి ప్రభుత్వ అనుమతి ఉంటే 25 పంటల్లో వాడుతున్నట్లు మా అధ్యయనంలో తేలింది. దీన్ని వాడే క్రమంలో చాలా మంది దీని విషప్రభావానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని క్షణికావేశంలో తాగి ఆత్మహత్యల పాలవుతున్న రైతులు, రైతు కూలీల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. 

ప్రాథమికంగా ప్రాణాలను చంపడానికి రూపొందించబడిన పురుగుమందుల దీర్ఘకాలిక పరిణామాలను రైతులు, వినియోగదారులు అర్థం చేసుకోవాలి. పురుగుమందుల హానికరమైన ప్రభావాలపై శాస్త్రవేత్తలు మరింత పరిశోధన చేయాలి. విధాన నిర్ణేతలు కూడా తమ అవగాహనను పెంచుకోవాలి.  

రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ఈ విష రసాయనాలను నియంత్రించడంపై దృష్టి పెట్టాలి. వాతావరణ మార్పుకు ప్రధాన కారకాల్లో విధ్వంసక పురుగుమందులు కూడా ఉన్నాయి. అత్యంత విషతుల్యమైన పారాక్వాట్‌ గడ్డి మందును దేశవ్యాప్తంగా నిషేధించాలి. 
– డాక్టర్‌ దొంతి నరసింహారెడ్డి, విధాన నిపుణుడు, పెస్టిసైడ్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌ ఇండియా 
స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement