కరిగిపోతున్న కలర్స్ | Sakshi Funday Special Story: Chromophobia is an intense fear of colors | Sakshi
Sakshi News home page

కరిగిపోతున్న కలర్స్

Feb 22 2026 3:48 AM | Updated on Feb 22 2026 4:12 AM

Sakshi Funday Special Story: Chromophobia is an intense fear of colors

రాత్రి నిద్రలో కలలో ఇంద్రధనుస్సు వచ్చి గుడ్‌బై చెప్పి వెళ్లిపోతే? ఉదయం లేచేసరికి ఆకాశం నీలంగా కాకుండా బూడిద రంగులో కనిపిస్తే? కళ్ల ముందు కనిపించే ప్రతి దృశ్యం ఒక నలుపు–తెలుపు ఫొటోలాగా మారిపోతే? మన వీథులు, ఇళ్లు, దుస్తులు, సినిమాలు, లోగోలు అన్నీ ఒకే నీరసపు ఛాయలోకి జారిపోతే? ఇది ఊహ కాదు, ఇదే మన ప్రస్తుత వాస్తవం! ఎందుకంటే, ప్రపంచం నిశ్శబ్దంగా, నెమ్మదిగా, ఎవరికీ తెలియకుండానే తన రంగుల్ని కోల్పోతోంది. మెరుపులు మసకబారుతున్నాయి; పచ్చని జీవం క్రమంగా బూడిదలో కలిసిపోతోంది. ఇప్పుడు ఆ జీవానికి మళ్లీ రంగులు నింపాల్సిన సమయం వచ్చింది!

ఈ మార్పు కేవలం ట్రెండ్‌ కాదు. ఇది మన మనస్తత్త్వపు పరివర్తన. మన మనసుల్లో మనకు తెలియకుండానే జరిగిన సైలెంట్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌. ఇదే మనల్ని ‘కలర్‌ మోడ్‌’ నుంచి ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌ మోడ్‌’లోకి మారిపోయేలా చేసింది. ఎంతలా అంటే ‘రంగులు మరీ ఎక్కువైతే ప్రమాదం’ అన్నట్టు ఒక లోతైన భయంలా మారిపోయింది. దాన్నే మనం సరదాగా ‘క్రోమోఫోబియా’(Chromophobia) అంటే రంగుల పట్ల భయం అని పిలవొచ్చు. అయితే ఇక్కడ ప్రశ్న ఒక్కటే! ప్రపంచం నిజంగా మరింత శాంతంగా మారుతోందా? లేక మనం అనుభూతుల్ని కోల్పోతున్నామా? ఇది కేవలం రంగుల గురించే కాదు, ఇది మన చూపుల గురించి.

మన సంస్కృతి గురించి, మన భావోద్వేగాల గురించి తెలుపుతోంది. ఒక్కసారి సాధారణ పార్కింగ్‌ స్థలంలో నడుస్తున్నారని ఊహించుకోండి. చుట్టూ ఏముంది? నలుపు, తెలుపు, వెండి రంగుల కార్లు అంతే! అది పార్కింగ్‌ కాదు, ఒక బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమా షూటింగ్‌ సెట్‌ లోకేషన్‌లా కనిపిస్తుంది. అదే ఒకప్పుడు ఎరుపు రంగు కార్లు అగ్నిజ్వాలలాంటి ఉత్సాహంతో మెరిసేవి. ఆకుపచ్చ కార్లు ప్రకృతిని గుర్తు చేసేవి. నీలం కార్లు ఆకాశాన్ని నేలపైకి దించేవి. ఇప్పుడు? అన్నీ మౌనంగా, మెటాలిక్‌గా, నిర్లిప్తంగా నిలబడి ఉన్నాయి. కార్లకే ఎమోషన్స్ లేవేమో అన్నట్టు. మొత్తం పార్కింగ్‌ లాట్‌ ఒక పెద్ద బ్లాక్‌ అండ్‌ వైట్‌ మోడ్‌లోకి మారిపోయింది. 

ఇవన్నీ అకస్మాత్తుగా మారలేదు. మనమే మార్చేశాం. ఎందుకంటే ప్రజలు ఎక్కువగా న్యూట్రల్‌ రంగుల్నే ఎంచుకోవడం మొదలుపెట్టారు. డిమాండ్‌ పెరిగింది, కంపెనీలు అదే ఉత్పత్తి చేశాయి, మార్కెట్‌ అదే నడిపింది. అంటే మన ఎంపికలే ప్రపంచాన్ని బీజ్, గ్రే, బ్లాక్‌ అండ్‌ వైట్‌ చేసేశాయి. సింపుల్‌గా చెప్పాలంటే, మనమే లైట్లు ఆర్పేసి, ‘ఎందుకు ప్రపంచం చీకటిగా ఉంది?’ అని అడుగుతున్నాం. 

కళ తప్పిన పండుగలు! 
ఒకప్పుడు ఫంక్షన్  అంటే రంగుల సర్కస్, వెలుగుల మేళా, డాన్స్ చేసే లైట్లు, నవ్వే పూలతోరణాలు ఇలా మొత్తం వేదికే ఒక రంగుల బాణసంచాలాగ పేలేది! పెళ్లి మండపం గులాబీ, ఊదా, బంగారం, ఎరుపుతో మెరిసేది. సంగీత్‌ అంటే నీయాన్  తుఫాను, హల్దీ అంటే పసుపు పరవశం, మెహందీ అంటే ఆకుపచ్చ కళా ప్రదర్శన. అతిథులు కూడా ఇంద్రధనుస్సులా ఒక్కొక్కరూ ఒక్కో రంగులో వచ్చేవారు. కాని, ఇప్పుడు ఫంక్షన్ కి వెళ్తే ఏముంది? ‘‘వైట్‌–బీజ్‌–గ్రే’’ త్రిమూర్తులు పాలిస్తున్నారు! స్టేజ్‌ డెకర్‌ మినిమల్, లైటింగ్‌ స్మోకీ, ఫ్లవర్స్‌ పేస్టల్‌ సెటప్‌ చూస్తే పెళ్లా? లేక మ్యూజియం ఎగ్జిబిషనా? అన్న డౌట్‌ వస్తుంది. ఫొటోలు కూడా ఫిల్టర్‌లో పుట్టి, ఫిల్టర్‌లో పెరిగి, ఫిల్టర్‌లోనే జీవిస్తున్నట్టున్నాయి. అతిథుల డ్రెస్సుల్లోనూ మెరిసే రంగులు సెలవు పెట్టి వెళ్లిపోయాయి.

అచ్చం ఇలాగే, పండుగలకూ ఇదే వైరస్‌ సోకింది. దీపావళి అంటే ఒకప్పుడు రంగోలీలు నేలపై ఇంద్రధనుస్సులా పాకేవి, దీపాలు నక్షత్రాల్లా మెరిసేవి. మరిప్పుడో? సింపుల్‌ డెకర్, తక్కువ రంగు, ఎక్కువ ఫొటోషూట్‌. సంక్రాంతి ముగ్గులు కూడా చిన్నవి, నీరసపు టోన్స్లో కనిపిస్తున్నాయి. హోలీ అంటే రంగుల సునామీ కదా? ఇప్పుడు చాలా చోట్ల ‘లైట్‌ హోలీ’ పేరుతో రెండు మూడు రంగులు, పది సెల్ఫీలతో సరిపెట్టుకుంటోంది. వినాయక చవితిలో భారీ రంగుల మండపాల బదులు వుడ్, బీజ్, గ్రే థీమ్‌ గణపతి కూడా ‘నేను పండుగకా? ఇంటీరియర్‌ షోకా?’ అని అడిగేలా డెకరేషన్స్‌ చేస్తున్నారు. ఇలా మొత్తానికి మన ఫంక్షన్లు, పండుగలు నెమ్మదిగా రంగుల కళను కోల్పోతోంది.

కార్‌ కలర్స్‌ బై ఇయర్‌ 
ప్రధాన ఆటో పెయింట్‌ సరఫరాదారులు, వివిధ అంతర్జాతీయ పెయింట్‌ కంపెనీలు ప్రతి ఏడాది చేసిన పరిశ్రమ స్థాయి సర్వేలు ఆధారంగా ఒక చార్ట్‌ విడుదల చేశారు. ఇదొక ఉత్పత్తి గణాంకాలు, డీలర్‌ అమ్మకాల డేటాను కలిపి రూపొందించిన విజువల్‌ మ్యాప్‌. ఇందులో అమెరికా, యూరప్, చైనా, జపాన్ , భారత్‌ వంటి ప్రధాన మార్కెట్లలో కొత్తగా అమ్ముడైన కార్ల రంగులను నమోదు చేశారు. ఇందులో మొత్తం 1990–2020 అంటే మూడు దశాబ్దాల ప్రయాణంలో రంగులు ఎలా మెరిశాయి, ఎలా మసకబారాయి అన్నదానికి స్పష్టమైన సాక్ష్యం దాగుంది. 

ఈ ‘కార్‌ కలర్స్‌ బై ఇయర్‌’ చార్ట్‌ను చూస్తే, తొంభైల్లో రోడ్లు చిన్న ఇంద్రధనుస్సుల్లా ఉండేవి: నీలం రంగు వాహనాలు పెద్ద భాగం ఆక్రమించి ఆకాశంలా విస్తరించింది, ఎరుపు రంగు ధైర్యంగా మెరిసేది. ఆకుపచ్చ రంగు ప్రకృతితో పోటీ పడేది. పసుపు, పర్పుల్‌ రంగు వాహనాలు చిన్న చిన్న అతిథుల్లా అప్పుడప్పుడు తళుక్కుమనేవి. కాని, 2000లు మొదలయ్యే సరికి సైలెంట్‌ తిరుగుబాటు మొదలైంది  నలుపు నెమ్మదిగా పైకి ఎగబాకి పవర్‌ఫుల్‌ విలన్ లా బలపడింది, తెలుపు ఒక్కసారిగా పెరిగి శాంతి మంత్రంతో రాజ్యాన్ని నిర్మించింది, బూడిద ఎప్పటిలాగే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌లా స్థిరంగా నిలిచింది. 2010ల నాటికి చార్ట్‌ స్పష్టంగా మారిపోయింది. 

రంగుల పార్టీ ముగిసింది, బ్లాక్‌–వైట్‌–గ్రే డామినేషన్  మొదలైంది. అదే సమయంలో ఎరుపు శాతం క్రమంగా పడిపోయి అరుదైన సెలబ్రిటీలా మారింది, నీలం జారిపోతూ కనుమరుగైంది, పచ్చ రంగు దాదాపు గ్రాఫ్‌ నుంచి మాయమై ‘ఎకో–లెజెండ్‌’గా మిగిలింది, ఈ సంఖ్యలన్నీ చెప్పేది ఒక్కటే చెప్తున్నాయి. రోడ్లు రంగుల్ని వదిలేసి మోనోక్రోమ్‌ మోడ్‌లోకి వెళ్లిపోయాయి, మనం మాత్రం దీన్ని ‘మినిమలిజం’ అని పిలుస్తూ చప్పట్లు కొడుతున్నాం. 

ఇంటిలోనూ రంగులు లేవు!
ఒకప్పుడు రంగురంగుల ఇళ్లతో వీథులు ఆహ్వానం పలికేవి. ఇంట్లోకి అడుగు పెట్టగానే గోడలు పసుపు, పింక్, లైట్‌ గ్రీన్ లో మెరిసేవి. సోఫాలు ఎరుపు, నీలం, ఊదా కవర్‌లతో చిరునవ్వు చిందించేవి. కర్టెన్లు గాలికి ఊగుతూ ఇంద్రధనుస్సులా డాన్స్ చేసేవి. టీవీ యూనిట్‌ డిజైనర్‌ చెక్కతో మెరిసేది, షోకేస్‌ గ్లాస్‌ కాంతులతో కళకళలాడేది. కుషన్లు పూల డిజైన్లతో జీవం నింపేవి. కాని, ఇప్పుడు ఇంట్లోకి అడుగుపెడితే కనిపించేది రంగుల ఇల్లు కాదు ‘బీజ్‌ ఎగ్జామ్‌ హాల్‌’! గోడలు బూడిద, సోఫాలు గ్రే, కర్టెన్లు క్రీమ్, కార్పెట్‌ డస్ట్‌ షేడ్, కుషన్లు మ్యాట్‌ టోన్ . ప్రతిది నిశ్శబ్దంగా, నీరసంగా, డల్‌గా కనిపిస్తోంది. 

ఇక ఇంటీరియర్‌ వస్తువులైతే మరీ మినిమలిస్టిక్‌. వైట్, గ్రే, బ్లాక్, సిల్వర్‌ ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మిషన్లు, డిష్‌వాషర్లు అన్నీ ఒకే ‘ఈస్తటిక్‌ డిసిప్లిన్ ’ను పాటిస్తున్నట్టు ఒకే రంగులో ఉంటున్నాయి. బెడ్‌రూమ్‌లో బెడ్‌షీట్లు కూడా నీయాన్  పోయి, పేస్టల్‌ ప్యాలెట్‌కు మారిపోయాయి. వంటగదిలో ప్లేట్లు, కప్పులు కూడా తెలుపు, బూడిద మోడ్‌లోకి వెళ్లిపోయాయి. పిల్లల గదిలో కార్టూన్  కలర్స్‌ పోయి, మ్యూట్‌ టోన్  వాల్‌పేపర్‌లు వచ్చేశాయి. ఇక దుస్తుల అల్మరా చూస్తే, ఒకప్పుడు ఎరుపు చీరలు, ఆకుపచ్చ లెహంగా, నీలం షర్టులు, పసుపు కుర్తాలు ఉండేవి. ఇప్పుడు మాత్రం బ్రాండెడ్‌ పేరుతో బీజ్, బ్లాక్, వైట్, గ్రే రంగులతోనే అల్మరా నిండిపోతోంది. మొత్తానికి మన ఇళ్లు నెమ్మదిగా ‘కలల రంగుల ఇంటి’ నుంచి ‘ఇన్ స్టా–ఈస్తటిక్‌ గ్రే బాక్స్‌’గా మారిపోతున్నాయి. 

తత్త్వవేత్తల అనుమానం? 
రంగులంటే మనకున్న ఎంత ఎక్కువ ప్రేమ ఉన్నా, పాశ్చాత్య తత్త్వశాస్త్రానికి ఉన్న అనుమానం కూడా అంతే పెద్దది. ప్రాచీన గ్రీకు తత్త్వవేత్త ప్లేటో నుంచే మొదలైంది ఈ కలర్‌ డౌట్‌ డ్రామా. అతని మాటల్లో మనం చూస్తున్న ప్రపంచం ఒక మాయ. ‘గోడలపై పడే నీడలే మనకు కనిపించే నిజాలు. కళ్లతో కనిపించే రంగులన్నీ ఇంద్రియ మాయలే, అసలు సత్యం మాత్రం బుద్ధితోనే గ్రహించాలి’ అని చెప్పాడు. అంటే ఎరుపు, నీలం, పసుపు అన్నీ ప్లేటో లెక్కలో ‘నమ్మకానికి పనికిరాని విజువల్‌ ఎఫెక్ట్స్‌’. అతని శిష్యుడు అరిస్టాటిల్‌ వచ్చి ఇంకో ట్విస్ట్‌ ఇచ్చాడు. ‘అందమైన రంగుల గందరగోళం కంటే రంగుల్లేని స్పష్టమైన రూపమే గొప్పది’ అని చెప్పాడు. 

సింపుల్‌గా చెప్పాలంటే పెయింట్‌ బాగున్నా డ్రాయింగ్‌ చెత్త అయితే వ్యర్థమే అన్నమాట. ఆ తర్వాత ప్రసిద్ధ జర్మన్‌ తత్త్వవేత్త ఇమాన్యుయేల్‌ కాంట్‌ రంగును కేవలం అలంకారంగా పక్కన పెట్టేశాడు. ‘రంగు కళను ఆకర్షణీయంగా చేస్తుంది. కాని అది నిజమైన సౌందర్యానికి ప్రమాణం కాదు’ అన్నాడు. ఇలా రంగు అంటేనే భావోద్వేగం, అస్థిరత, మాయ అని ముద్ర వేసి, రూపం అంటే తర్కం, క్రమం, సత్యం అని కిరీటం పెట్టేశారు తత్త్వవేత్తలు. ఆ ఫలితమే ఈ రోజు మన చుట్టూ కనిపించే బూడిద ప్రపంచం. ఈ గ్రే ఇళ్లు, డల్‌ సినిమాలు, మ్యూట్‌ దుస్తులు– వీటిని చూస్తుంటే అనిపిస్తుంది మనం రంగులను కోల్పోలేదు, తత్త్వశాస్త్రం చిన్నప్పుడే మనకు ‘కలర్‌ భయం’ నేర్పించిందేమో! 

అసలు నిజం! 
చరిత్ర మనకు చూపిస్తుందేమిటంటే, రంగు ఎప్పుడూ శత్రువు కాదు. బరోక్‌ కళలో బంగారం, ఎరుపు, పచ్చ, నీలం, మిగతా రంగులు కలసి ఒక క్రమబద్ధమైన భావోద్వేగ తుఫాన్లుగా మన మనసును కదిలిస్తాయి, ఆలోచింపజేస్తాయి, దైవంతో కలిపిస్తాయి. అయితే, అలంకారం లేని గోడలు, భావోద్వేగం లేని భవనాలు, గాజు–స్టీల్‌ కార్యాలయాలు, ఒకేలా కనిపించే నగరాలు, మనసును తాకని నిర్మాణాలు. ఇవన్నీ అత్యల్ప ప్రయోగాలు, తక్కువ వైవిధ్యంతో తయారవడం వల్ల మనిషి ప్రతిభను, ఉత్సాహాన్ని, సృజనాత్మకతను దెబ్బతీస్తాయి. అందుకే, ఇక్కడ మనం కోల్పోతున్నది కేవలం అందమైన  రంగుల వైవిధ్యాన్ని మాత్రమే కాదు. అంతకు మించి రంగులను కళ్లారా ఆస్వాదించే ఆనందాన్ని కూడా. అందుకే అందరూ ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది.

ఇదొక వైరస్‌!
మోనోక్రోమ్‌ ప్రపంచం అంటే విప్లవం కాదు, నిశ్శబ్దంగా నడుస్తున్న ‘గ్రే వైరస్‌’ లాంటిది. ఆటోమొబైల్‌ ప్రపంచాన్ని చూస్తేనే అర్థమవుతుంది: ప్రముఖ పెయింట్‌ కంపెనీల లెక్కల ప్రకారం కొత్త కార్లలో 80 శాతానికి పైగా నలుపు, తెలుపు, బూడిద, వెండి రంగులే, ఎరుపు అంటే ఇప్పుడు అరుదైన పక్షి, ఆకుపచ్చ అంటే దాదాపు లెజెండ్, పసుపు అంటే కేవలం కథల్లో వినే పురావర్ణం; ఒకప్పుడు కారు అంటే యజమాని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేది.

ఫైర్‌ రెడ్‌ అంటే ఉత్సాహం, ఫారెస్ట్‌ గ్రీన్  అంటే ప్రకృతి ప్రేమ, స్కై బ్లూ అంటే స్వేచ్ఛ. అయితే, ఇదంతా కార్లకే పరిమితం కాదని బ్రిటన్  సైన్స్ మ్యూజియం ఏడువేల వస్తువులపై చేసిన అధ్యయనంలో తేలింది. ఇక్కడ సుమారు పద్దెనిమిది వందల రంగులు నెమ్మదిగా డైట్‌లోకి వెళ్లి ముదురు ఎరుపు, పల్చని గులాబీగా, జంగిల్‌ పచ్చ బూడిద పచ్చగా, మెరుస్తున్న పసుపు మట్టి వర్ణంగా మారిపోయాయని చెప్పారు. ఇలా మొత్తం ప్రపంచమే నవ్వులు తగ్గించుకుని సైలెంట్‌ మోడ్‌లోకి జారిపోతుంటే, మనం మాత్రం చప్పట్లు కొడుతూ ‘సింపుల్‌ డిజైన్‌!’ అని సెల్ఫీ తీసుకుంటున్నాం.  

సినిమా రంగు వెలిసిపోతోందా?
సినిమా థియేటర్‌లో అడుగుపెట్టడం అంటే రంగుల పండుగ లాంటిది. తెరపై బాణసంచా పేలినట్టు వెలుగులు, పాటల్లో ఇంద్రధనుస్సు పరుగులు, బంగారు రేకుల్లా మెరిసే విలన్‌ కోటలు. రంగు రంగుల దుస్తుల్లో ఆడిపాడే నటీనటులు కనిపించేవారు. కాని, ఇప్పుడు టికెట్‌ తీసుకుని లోపలికి వెళ్తే కనిపించేది కేవలం ‘ఫిల్టర్‌ ఫీవర్‌’ మాత్రమే! చారిత్రక చిత్రాల పేరుతో అప్పట్లో ఇలా ఉండేది అని చూపించడానికి టెక్నీషియన్స్‌ ఫైనల్‌ పింట్ర్‌కి పొగమంచు ఫిల్టర్స్‌ని ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు రిడ్లీ స్కాట్‌ దర్శకత్వంలోని నెపోలియన్‌ చిత్రాన్ని తీసుకోండి. షూటింగ్‌ సమయంలో అద్భుతమైన రంగుల సెట్‌లు ఉపయోగించారు. కాని, తుది చిత్రంలో అన్నీ చల్లని నీలి–బూడిద రంగులో మసకబారిపోయాయి.

విచిత్రంగా ఇది ఇప్పుడు హాలీవుడ్‌ కొత్త ఫ్యాషన్ లా మారిపోయింది. ఇక మన భారతీయ సినిమాకు వస్తే పరిస్థితి ఇంకా ఫన్నీ. సంజయ్‌ లీలా భన్సాలీ సెట్స్‌ అంటేనే రంగుల రాజమహల్‌లా వెలుగు, వైభవం, ఆడంబరం అన్నీ కనిపిస్తాయి. కాని, అదే సినిమా థియేటర్‌లోకి వచ్చేసరికి అదే రాజమహల్‌ కాస్త డల్‌ బ్లూ–గ్రే ఫిల్టర్‌లో మునిగిపోతోంది. ‘అప్పట్లో ఇలా ఉండేది’ అని చూపించడానికి వేసే ఫిల్టర్స్, హీరోయిన్ల మెరిసే దుస్తులను కూడా మసకబారుస్తున్నాయి. ఇదే ట్రెండ్‌ తెలుగు, తమిళ, హిందీ థ్రిల్లర్లలోనూ కనిపిస్తోంది.

‘దయ్యాలు రాత్రుళ్లే కదా కనిపించేది?’ అనే లాజిక్‌తో క్రైమ్, హారర్‌ సినిమాలన్నింటినీ డార్క్‌ మోడ్‌లో పెట్టేస్తున్నారు. అయితే పాటలు మాత్రం కాసిన్ని రంగులను బతికిస్తున్నాయి. ఒక్కసారిగా వచ్చే  నీయాన్  లైట్లు, భారీ సెట్స్, రంగులు వర్షంలా వచ్చి, చిన్న నవ్వు నవ్వి, సెల్ఫీ తీసుకుని అతిథుల్లా వచ్చి వెళ్లిపోతున్నాయి. ఇలా మొత్తానికి సినిమా ప్రపంచం కూడా నెమ్మదిగా ‘కలల ప్యాలెట్‌’ను వదిలేస్తోంది. అందుకే, ఈ బూడిదలో మన భావోద్వేగాలు కూడా మసకబారుతున్నాయా?

  • దీపిక కొండి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement