ఏ కాలంలో అయినా ప్రయాణమంటే సంతోషం. ఉల్లాసం. ఉత్సాహం. అయితే కాలంతోటు ప్రయాణాలకు సంబంధించి అభిరుచులు, ఆసక్తులు, ట్రెండ్స్ మారుతున్నాయి. అలాంటి వాటిలో కొన్ని ట్రెండ్స్ గురించి...
రోడ్ ట్రిప్
పదిమందితో కలిసి ప్రయాణాలను ఎంజాయ్ చేసే వారు ఒక రకం. ఒంటరిగా మాత్రమే ఎంజాయ్ చేసే వారు మరొక రకం. రెండో కోవకు చెందిన వారికి నచ్చిన ట్రెండ్...రోడ్ ట్రిప్. హిల్టన్ ‘ట్రెండ్స్ రిపోర్ట్’ ప్రపంచవ్యాప్తంగా రోడ్ ట్రిప్‌లకు పెరుగుతున్న ఆసక్తి గురించి వెల్లడించింది. ‘క్లాసిక్ రోడ్ ట్రిప్ అనేది లగ్జరీ అనుభవం’ అంటున్నాడు డ్రైవింగ్ హాలిడే స్పెషలిస్ట్ హంటర్ మోస్. ఒకటి లేదా రెండు రోజుల ప్రయాణల పట్ల ఆసక్తి చూపే వారు రోడ్ ట్రిప్‌లను ఇష్టపడుతున్నారు. జెన్ జీలో ఎక్కువ మంది సోలో రోడ్ ట్రిప్‌లను ఇష్టపడుతున్నారు.
‘చే గువేరా ది మోటర్‌సైకిల్ డైరీస్ పుస్తకం చదివిన తరువాత, మోటర్ బైక్‌పై ప్రయాణాలు చేయాలనే ఆసక్తి మొదలైంది. మొదట్లో కష్టం అనిపించినా ఆ తరువాత ఎలాంటి సమస్య అనిపించలేదు. రోడ్డు ట్రిప్‌లతో మనసు ఉత్సాహంగా ఉంటుంది’ అంటున్నాడు హైదరాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్ చేతన్.
‘ఉత్తర అమెరికా, యూరప్‌లలో కారు అనేది వాహనం మాత్రమే కాదు. అంతకుమించి. రోడ్డు ప్రయాణాలలో అది వారికి స్నేహితుడు. రోడ్డు పొడవునా కారుతో ముచ్చట్లు చెబుతూ ప్రయాణిస్తుంటారు చాలామంది’ అంటుంది ఒక ట్రావెల్ డిజిటల్ సంస్థలో చీఫ్ బిహేవియర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మిలేనా నికోలోవా.
అల్ట్రా పర్సనలైజ్‌డ్ ట్రిప్స్
ప్రయాణం అంటేనే సంతోషం. అయితే విషాద సమయాల్లో చేసే ప్రయాణాలు కూడా ఉంటాయి. విషాదం నుంచి బయటి పడి మనసును తేలిక చేసుకునే ప్రయాణాలు ఇవి. ఇలాంటి అల్ట్రా పర్సనలైజ్‌డ్ ట్రిప్స్ గత కొన్ని సంవత్సరాలుగా ఊపందుకున్నాయి.
కుటుంబ సభ్యుల మరణం, విడాకులు తీసుకోవడం... ఇలా జీవితంలోని రకరకాల విషాదాల నుంచి బయటపడడానికి ఈ స్పెషల్ టూర్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ‘గ్రీఫ్ టూర్స్ అనేవి ట్రావెల్ ఇండస్ట్రీకి సరికొత్త అవకాశం’ అంటుంది కల్చరల్ ట్రెండ్స్ స్పెషలిస్ట్ జాస్మిన్ బినా.
‘విషాదాల నుంచి బయటపడడానికి ప్రయాణాలు, కొత్త ప్రదేశాలు ఏ మేరకు ఉపయోగపడతాయి?’ అని చెప్పడానికి సంబంధించి శాస్త్రీయ పరిశోధనలు పరిమితంగానే ఉన్నప్పటికీ ‘విషాదం నుంచి బయటపడే ఒక మార్గం...ప్రయాణం’ అనేదాంట్లో విభేదాలు లేవు.
న్యూరో ఇమేజింగ్‌తో దుఃఖాన్ని అధ్యయనం చేసిన శాస్త్రవేత్త మేరీ ఫ్రాన్సిస్... ‘ప్రయాణం అనేది దుఃఖం నుంచి బయటపడే మార్గాలలో ఒకటి’ అన్నారు. దుఃఖం నుంచి బయటపడే ఈ మార్గాన్ని ‘వెల్నెస్ ట్రావెల్ ట్రెండ్’ అని కూడా పిలుస్తున్నారు.
‘రెండు ప్రపంచాల మధ్య మనం ఊగిసలాడుతున్నప్పుడు దుఃఖం నుంచి బయటపడడానికి ప్రయాణం ఉపకరిస్తుంది. అదుపు తప్పిన భావోద్వేగాలను నియంత్రించడానికి సహాయపడుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించడం ద్వారా దుఃఖభారాన్ని తగ్గించుకోవచ్చు’ అంటున్నారు డాక్టర్ రాబర్ట్ నీమెయర్.
(చదవండి: జస్ట్ రెండేళ్లకే ఏడాదికి రూ. 12 లక్షల నుంచి రూ. 24 లక్షల అధిక వేతనం..! కానీ..)


