పిల్లలు తమ కాళ్లను ఇంగ్లిషు అక్షరం ‘డబ్ల్యూ’ ఆకృతిలో ఉంచి కూర్చోవడం వాళ్ల కీళ్ల ఆరోగ్యానికీ, కండరాలకూ అంత మంచిదికాదంటూ సూచిస్తున్నారు పిల్లల డాక్టర్లు. పిల్లలు మోకాళ్లను ముందు పెట్టి... మిగతా కాళ్ల భాగాన్ని వెనకకు నెట్టి ఉంచడంతో చూడ్డానికి ఆ భంగిమ ‘డబ్ల్యూ’ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని డబ్ల్యూ సిట్టింగ్ అంటారు. పిల్లలు ఈ భంగిమలో కూర్చోడానికి అలవాటైతే దాని వల్ల కలిగే అనేక అనర్థాలేమిటన్నది తెలుసుకుందాం...
కూర్చునే వయసుకు వచ్చాక చిన్నారులు నేల మీద డబ్ల్యూ ఆకృతిలో కాళ్లుంచేలా కూర్చుండిపోయే భంగిమను ‘రివర్స్ టైలరింగ్ సిట్టింగ్’ అనీ లేదా ‘ఫ్రాగ్ సిట్టింగ్’ అని కూడా అంటారు. ఇలా క్యూట్‌గా కనిపించేలా మోకాళ్లను ముందువైపునకూ, అరికాళ్లు రెండూ వెనక్కు ఉంచుతూ కూర్చుండిపోవడం వల్ల మున్ముందు అనేక సమస్యలొస్తాయంటూ పేర్కొంటున్నారు.
డబ్ల్యూ సిట్టింగ్‌తో అనర్థాలివే...
→ ఇలా కూర్చున్నప్పుడు తొడ ఎముక (ఫీమర్)తో పాటు, మోకాలి కిందివైపున ఉండే ప్రధాన ఎముక ‘టిబియా’పై ఒత్తిడి పడటం వల్ల చిన్నారుల పాదాలు ఉండాల్సినట్లుగా కాకుండా లోపలివైపునకు తిరగడం (ఇన్ టోయింగ్) జరగవచ్చు.
→ ఇలాగే కూర్చుండిపోవడం అలవాట్లయ్యాక వాళ్ల కాళ్ల కదలికలు... కదలాల్సినంతగా కాకుండా కాస్త పరిమితంగా కదిలే అవకాశముంది. ఆ తర్వాత వీళ్లు బాసిపట్లు (సక్లంముక్లం) వేసినట్లుగా కూర్చోవడమూ కష్టమవుతుంది.
→ కండరాలు బలహీనపడటం : ఈ డబ్ల్యూ సిట్టింగ్‌లో దీర్ఘకాలం కూర్చుండేవారి కాలి కండరాలు బలహీనంగా మారే అవకాశమూ ఉంటుంది.
→ బాలెన్స్ తప్పడం, మైల్స్‌స్టోన్స్ ఆలస్యం కావడం : కండరాలు బలహీనం కావడంతో నిలబడినప్పుడు వారు బ్యాలెన్స్ సరిగ్గా నిలపలేకపోవడం వంటి అనర్థాలూ ఉండవచ్చు. దీనివల్ల వారి వయసుకు తగ్గట్లుగా చోటుచేసుకోవాల్సిన క్రమబద్ధమైన అభివృద్ధి (డెవలప్‌మెంటల్ మైల్‌స్టోన్స్) ఆలస్యం కావచ్చు.
→ మోకాళ్లు, కీళ్ల నొప్పులు : డబ్ల్యూ సిట్టింగ్స్ బాగా అలవాటైన పిల్లల్లో మోకాళ్ల, కీళ్ల నొప్పులు చాలా త్వరగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆర్థరైటిస్ సమస్య కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ.
→ పోష్చర్ సరిగా లేకపోవడం : ఈ పిల్లల్లో భవిష్యత్తులో పాదాలు లోపలివైపునకు తిరిగే ‘ఇన్ టోయింగ్’తో పాటు వెన్ను సరైన భంగిమలో లేకపోవడంతో వాళ్ల దేహం పోష్చర్‌లో కూడా మార్పులు వచ్చే అవకాశముంది.
సరిదిద్దడమిలా...
→ బాసిపట్లు వేసినట్లుగా (సక్లం ముక్లం) కూర్చోబెట్టడం : దీన్నే ఇంగ్లిష్‌లో క్రిస్‌క్రాస్ సిట్టింగ్ అని కూడా అంటారు. డబ్ల్యూ సిట్టింగ్‌లో ఉండే పిల్లలను ఆ భంగిమలో బదులు క్రిస్ క్రాస్ భంగిమలో కూర్చుబెడుతూ... క్రమంగా డబ్ల్యూ సిట్టింగ్‌కు దూరం చేయడం.
→ కాళ్లు రెండూ సాచినట్లుగా (లాంగ్ సిట్టింగ్) కూర్చోబెట్టడం : చిన్నారులు కాళ్లను డబ్ల్యూ ఆకృతిలో ముడిచి ఉన్నప్పుడు వాళ్లను రెండు కాళ్లూ సాచినట్లుగా లాంగ్ సిట్టింగ్‌లో కూర్చోబెట్టడం.
→ డబ్ల్యూ సిట్టింగ్ భంగిమలో కాకుండా కరెక్ట్ పోష్చర్‌లో కూర్చుండేలా సైడ్ సిట్టింగ్‌లాంటివీ ప్రోత్సహించడం.
→ డబ్ల్యూ సిట్టింగ్‌కు బదులు ఇతరత్రా పోష్చర్లలో కూర్చున్నప్పుడు వాళ్లను మెచ్చుకుంటూ ఉండటం.
పై అలవాట్లను ప్రోత్సహించడం వల్ల డబ్ల్యూ సిట్టింగ్‌తో కలిగే అనర్థాలు తొలగిపోవడంతోపాటు భవిష్యత్తులో ఎముకలూ, కీళ్లు, కండరాలు ఆరోగ్యకరంగా ఉండేందుకు ఇది దోహదపడుతుంది.


