పచ్చని కాపురం ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు, ఇద్దరు ముసిముసిమాటల మెరికలు. ఇంతలో ఏ కష్టం వచ్చిందో, తనకు ఎందుకు జీవితం నచ్చలేదో, అర్ధాంతరంగా మృత్యుడికి చేరాలనుకుంది.. తను దూరమైతే పిల్లలు ఒంటరవుతారన్న ఉద్దేశ్యంతో వారిని కూడా తన ఒడికి చేర్చుకుంది. అల్లారుముద్దుగా పెంచిన బిడ్డలకు ఉరితాడు బిగించింది. ఆమె రాసిన చివరి లేఖ కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచేసింది.
పుత్తూరు: ఇద్దరు పిల్లలతో ఒక తల్లి మరణించిన సంఘటన పుత్తూరు పట్టణంలో కలకలం రేపింది. పుత్తూరు పట్టణం కృష్ణానగర్ 3వ వీధిలో నివాసం ఉంటున్న శివకుమార్ (28), పద్మజ (27)లకు తేజశ్రీ (7), లాస్య (4) అనే ఇద్దరు పిల్లలు. అప్పుల బాధ తాళలేక పద్మజ తన పిల్లలు తేజశ్రీ, లాస్యలతో పాటు ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న వారందరూ కృష్ణానగర్‌కు పరుగులు తీశారు. విగతజీవులుగా పడివున్న తల్లి, కూతుళ్లను, కన్నీరుమున్నీరై విలపిస్తున్న పద్మజ తల్లిదండ్రులను చూసి చలించిపోయారు.
ప్రేమించి పెళ్లిచేసుకుంది
పద్మజ పుత్తూరు మండలం నేసనూరు గ్రామానికి చెందిన కన్న ప్పరెడ్డి – నాగభూషణం దంపతుల కుమార్తె. శివశంకర్ పుత్తూ రు మండలం పైడిపల్లి గ్రామానికి చెందినవాడు. ఇద్దరూ డిగ్రీ చదువుకునే రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్లుగా వీరి వివాహ జీవితం సాగుతోంది. శివశంకర్‌కు ఉద్యోగం లేకపోవడంతో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎందుకింత పనిచేసిందో?
శ్రీసిటీకి ఉద్యోగానికి వెళ్లాను. మధ్యాహ్నం పిల్లలు చదివే స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. పాఠశాల 2.30 కి వదిలేస్తారు తీసుకెళ్లండన్నారు. తెలిసిన వ్యక్తికి మా పిల్లల్ని తీసుకెళ్లాలని ఫోన్‌చేశా. వాళ్లు తీసుకొస్తుంటే నా భార్య ఎదురుగా వచ్చి పిల్లల్ని తీసుకెళ్లిందంట. సాయంత్రం నాకు ఫోన్‌చేసి ఎక్కడున్నావని అడిగింది. 6 గంటల కంతా ఇంటికి వచ్చేస్తానని చెప్పా. గ్రూపునకు డబ్బులు కట్టావా అని అడిగింది. నేను మేడమ్‌తో మాట్లాడా వచ్చి కడతానని చెప్పా. సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తే తలుపువేసి ఉంది. ఎంతకూ తెరవకపోవడంతో మిద్దెపైకి వెళ్లి చూసా. అక్కడ లేకపోవడంతో ఇంటి కిటికీకొంత తీసి లోపలకు చూస్తే అమ్మాయి వేలాడుతూ కలిపించింది. వెంటనే ఇరుగుపొరుగు వారిని తీసుకువచ్చి తలుపు పగులకొడితే ముగ్గురూ వేలాడుతూ కనిపించారు. ఉద్యోగం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అప్పులు ఉన్నాయి. ఈనెల 2వ తేదీ నుంచి ఉద్యోగంలో చేరా. అప్పులు తీర్చేస్తానని కూడా చెప్పా. ఎందుకింత పనిచేసిందో తెలియడం లేదు.
శివశంకర్, పద్మజ భర్త
ఆఖరి లేఖ
పద్మజ తన బిడ్డలతో ఆత్మహత్య చేసుకునే మునుపు తన ఆఖరి లేఖను ఇలా రాసింది. ‘‘తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం ఒక గుణపాఠం. ఒక అమ్మాయి తన భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండకూడదు అని కోరుకుంటుందో, అలాంటివన్నీ నా భర్తలో ఉన్నాయి. ఇలాంటి జీవితాన్ని నేను కలలో కూడా ఊహించలేదు. శివశంకర్ నన్ను పెళ్లి చేసుకున్న పాపానికి నేను ఎంత కష్టపడాలో అంతా అనుభవించాను. నా కడుపున పుట్టిన పాపానికి నా పిల్లలు కూడా ఈ కష్టాలు అనుభవిస్తున్నారు. నిన్ను భరించే ఓపిక ఇక నాకు లేదు. ఊరంతా అప్పులే ఉన్నాయి. లోన్లు తీసేసి, నా దగ్గర డబ్బు లేదు అంటే నేను ఏం చేయాలి? నేను వాటిని తీర్చలేను. నువ్వు పనికి వెళ్లకపోయినా, ఎవరితో తిరిగినా అడిగే భార్య ఇక నీకు ఉండదు. హాయిగా ఉండు. నన్ను చేసుకుని నువ్వు కష్టపడుతున్నావు కదా, ఇక నేను ఉండను. హాయిగా బతుకు. భార్యను, పిల్లలను పోషించలేని వాడివి ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఎలాగో ఇంకో పెళ్లి చేసుకుంటావు కదా, ఈసారైనా జీవితంలో స్థిరపడ్డాక చేసుకో. అంతేగానీ నాలాగా ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకు. ఇంకొక జన్మలో తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకుని, పుట్టింటి వాళ్లతో కలిసి జీవించాలని దేవుడిని కోరుకుంటున్నాను..’’
ఒక్కసారి ‘‘పాప’’ అని పిలువు చాలు అన్నయ్యా
‘‘అన్నా.. ఇప్పటివరకు నీతో మాట్లాడలేదంటే నీ మీద ప్రేమ లేక కాదు, నిన్ను ఎదుర్కొనే ధైర్యం లేక. నీవు అడిగే ఏ ఒక్క ప్రశ్నకూ నా దగ్గర సమాధానం లేదు. ఎనిమిది సంవత్సరాలు అవుతోంది నీ నోటి నుండి ‘పాప’ అని విని. చివరి సారిగా నన్ను, నా పిల్లల్ని వచ్చి చూడు. ఇక చూడాలనుకున్నా మేము ఉండం. నీ నోటితో ఒక్కసారి ‘పాప’ అని పిలువు చాలు అన్నయ్యా. ప్లీజ్ అన్నా.. సారీ నాన్న, నన్ను క్షమించండి.
– ఇట్లు, వి. పద్మ
అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం
పద్మజ ఇంటి వద్ద లభించిన ఆధారాలతో ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణాలుగా తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులేనా? వేరే ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. మృతదేహాల పోస్టుమార్టం నివేదిక, విచారణలో కనుగొనే అంశాల ఆధారంగా ఆత్మహత్యకు కారణాలను వెల్లడిస్తాం.
– జి.రవికుమార్, డీఎస్పీ


