ఆక్రమణదారులు పరిహారానికి అనర్హులు | Andhra Pradesh High Court verdict in Vijayawada Railway Over Bridge land acquisition case | Sakshi
Sakshi News home page

ఆక్రమణదారులు పరిహారానికి అనర్హులు

Feb 8 2026 5:12 AM | Updated on Feb 8 2026 5:12 AM

Andhra Pradesh High Court verdict in Vijayawada Railway Over Bridge land acquisition case

చట్టబద్ధ యాజమాన్య పత్రాలు లేకుంటే 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం కోరలేరు

దీర్ఘకాలం నివాసం ఉన్నంతమాత్రాన యాజమాన్య హోదా రాదు  

ప్రభుత్వ భూమిలో ఎంత కాలం ఉన్నా వారు ఆక్రమణదారులే

విజయవాడ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి భూ సేకరణ కేసులో హైకోర్టు తీర్పు

సాక్షి, అమరావతి: చట్టబద్ధ యాజమాన్య పత్రాలు లేకుండా ప్రభుత్వ భూమిలో ఎన్ని దశాబ్దాలు ఉన్నా..  వారు ఆక్రమణదారులుగానే పరిగణించబడతారని హైకోర్టు స్పష్టం చేసింది. దీర్ఘకాలిక నివాసం ఆధారంగా భూ యజమాని హోదా రాదని తేల్చి చెప్పింది. ఆక్రమణదారులు 2013 భూసేకరణ చట్టం కింద ‘భూ యజమానులు‘ నిర్వచన పరిధిలోకి రారని, పరిహారానికి అర్హులు కాలేరని కుండబద్దలు కొట్టింది. భూమిపై లేదా ఆస్తిపై చెల్లుబాటయ్యే యాజమాన్య హక్కులు కలిగి ఉన్న వారు మాత్రమే 2013 భూ సేకరణ చట్టం కింద పరిహారానికి అర్హులని వివరించింది.

పిటిషనర్లు కోరినట్టు భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయ గృహ వసతి కల్పించిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. రైల్వే ఓవర్‌ బ్రిడ్జి కోసం తమ అధీనంలో ఉన్న భూములు తీసుకున్నందున తమకు పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చింది. అలాగే అధికారులపై వారు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్లనూ కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్‌ ఇటీవల తీర్పు వెలువరించారు.

పూర్వీకుల కాలం నుంచి ఆ భూముల్లోనే ఉంటున్నాం
తాము ఉంటున్న భూమిని ప్రభుత్వం రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌ నిర్మాణం కోసం తీసుకుంటున్నందున తమకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరుతూ విజయవాడలోని గుణదల ప్రాంతానికి చెందిన పలువురు 2020,21,22 సంవత్సరాల్లో రిట్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ భూమిలో తాము తమ పూర్వీకుల కాలం నుంచి నివసిస్తున్నామని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆస్తి పన్ను చెల్లిస్తున్నామని, విద్యుత్, మునిసిపల్‌ నీటి కనెక్షన్లు కూడా ఉన్నాయని వివరించారు. తాము భూమిలేని పేదలమని, అక్కడే షాపులు నడుపుకుంటూ జీవిస్తున్నామని, తమకు న్యాయం చేయాలని కోరారు.

అయితే  పిటిషనర్లు ఆక్రమించిన భూమి ప్రభుత్వ కాలువ, శ్మశాన వాటిక భూమిగా రికార్డుల్లో ఉందని అధికారులు హైకోర్టుకు నివేదించారు. పిటిషనర్ల వద్ద ఎటువంటి యాజమాన్య పత్రాలు లేవని, కేవలం పన్నులు కట్టినంత మాత్రాన యాజమాన్య హక్కులు రావని వివరించారు. అయినప్పటికీ, పిటిషనర్లతో పాటు ఇతర బాధితులకు మానవతా దృక్పథంతో ప్రత్యామ్నాయంగా 114 ఇళ్లు కేటాయించామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చింది. వీరు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం పొందలేరని స్పష్టంచేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement