breaking news
Vijayawada railway line
-
ఆక్రమణదారులు పరిహారానికి అనర్హులు
సాక్షి, అమరావతి: చట్టబద్ధ యాజమాన్య పత్రాలు లేకుండా ప్రభుత్వ భూమిలో ఎన్ని దశాబ్దాలు ఉన్నా.. వారు ఆక్రమణదారులుగానే పరిగణించబడతారని హైకోర్టు స్పష్టం చేసింది. దీర్ఘకాలిక నివాసం ఆధారంగా భూ యజమాని హోదా రాదని తేల్చి చెప్పింది. ఆక్రమణదారులు 2013 భూసేకరణ చట్టం కింద ‘భూ యజమానులు‘ నిర్వచన పరిధిలోకి రారని, పరిహారానికి అర్హులు కాలేరని కుండబద్దలు కొట్టింది. భూమిపై లేదా ఆస్తిపై చెల్లుబాటయ్యే యాజమాన్య హక్కులు కలిగి ఉన్న వారు మాత్రమే 2013 భూ సేకరణ చట్టం కింద పరిహారానికి అర్హులని వివరించింది.పిటిషనర్లు కోరినట్టు భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయ గృహ వసతి కల్పించిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం తమ అధీనంలో ఉన్న భూములు తీసుకున్నందున తమకు పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చింది. అలాగే అధికారులపై వారు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్లనూ కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ఇటీవల తీర్పు వెలువరించారు.పూర్వీకుల కాలం నుంచి ఆ భూముల్లోనే ఉంటున్నాంతాము ఉంటున్న భూమిని ప్రభుత్వం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం తీసుకుంటున్నందున తమకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరుతూ విజయవాడలోని గుణదల ప్రాంతానికి చెందిన పలువురు 2020,21,22 సంవత్సరాల్లో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ భూమిలో తాము తమ పూర్వీకుల కాలం నుంచి నివసిస్తున్నామని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆస్తి పన్ను చెల్లిస్తున్నామని, విద్యుత్, మునిసిపల్ నీటి కనెక్షన్లు కూడా ఉన్నాయని వివరించారు. తాము భూమిలేని పేదలమని, అక్కడే షాపులు నడుపుకుంటూ జీవిస్తున్నామని, తమకు న్యాయం చేయాలని కోరారు.అయితే పిటిషనర్లు ఆక్రమించిన భూమి ప్రభుత్వ కాలువ, శ్మశాన వాటిక భూమిగా రికార్డుల్లో ఉందని అధికారులు హైకోర్టుకు నివేదించారు. పిటిషనర్ల వద్ద ఎటువంటి యాజమాన్య పత్రాలు లేవని, కేవలం పన్నులు కట్టినంత మాత్రాన యాజమాన్య హక్కులు రావని వివరించారు. అయినప్పటికీ, పిటిషనర్లతో పాటు ఇతర బాధితులకు మానవతా దృక్పథంతో ప్రత్యామ్నాయంగా 114 ఇళ్లు కేటాయించామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చింది. వీరు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం పొందలేరని స్పష్టంచేసింది. -
రేపల్లె - బందరు రైల్వే లైన్‌పై దృష్టి
సారథి, వేదవ్యాస్ హామీ పెడన నియోజకవర్గంలో ప్రచారం టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి 500 మంది చేరిక పెడన, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే రేపల్లె-మచిలీపట్నం మీదుగా నరసాపురానికి రైల్వేలైన్ నిర్మాణానికి కృషిచేస్తానని ఆ పార్టీ మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి కొలుసు పార్థసారథి చెప్పారు. రైల్వే లైన్ నిర్మాణం జరిగితే పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాలు ఆర్థికంగా, పారిశ్రామికంగా, సామాజికంగా ఎంతో అభివృద్ధి చెందుతాయన్నారు. శనివారం ఆయన పెడన నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి బూరగడ్డ వేదవ్యాస్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్న నాయకత్వంలో బందరు లోక్‌సభను అభివృద్ధి పథంలోకి తెస్తామన్నారు. పెడన నియోజకవర్గంలో అధిక శాతం చేనేత కార్మికులున్నారని, వారి కోసం టెక్స్టైల్ పార్కు నిర్మాణానికి నిధుల కొరత లేకుండా చూస్తామని చెప్పారు. ఆర్థిక సమస్యలు లేకుండా చూస్తామన్నారు. కలంకారీ కార్మికుల కోసం కామన్ ఫెసిలిటీ సెంటర్, ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులు ఇప్పించి ఆర్థిక పురోభివృద్ధి కల్పిస్తామన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో బందరుకు పోర్టు నిర్మాణమే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పారు. 214-ఎ జాతీయ రహదారి విస్తరణ పనులు, మచిలీపట్నం-విజయవాడ రహదారి నిర్మాణాలు త్వరితిగతిన పూర్తయ్యేలా కృషిచేస్తామన్నారు. రొయ్యలు, చేపల చెరువుల రైతుల సౌకర్యార్థం పెడన నియోజకవర్గంలో ఆక్వా రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. మత్స్య కార్మికులకు చేపలు ఆరబెట్టేందుకు ప్లాట్ ఫాంలు, సొసైటీల ద్వారా రుణాలు, సబ్సీడీపై బోట్లు ఇప్పించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. మత్స్యకార మహిళలకు రుణ సౌకర్యం, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు చేపడతామన్నారు. డెల్టా ఆధునికీకరణ పూర్తి చేసి డెల్టా రైతులకు రెండు పంటలకు సాగునీరందించి రైతన్న కోసం రాజన్న రాజ్యం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల అమలు జగన్‌తోనే సాధ్యం : వేదవ్యాస్ పెడన అసెంబ్లీ అభ్యర్థి వేదవ్యాస్ మాట్లాడుతూ వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికీ అందాలంటే జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి తీరాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రచార కమిటీ కన్వీనర్ మావులేటి వెంకట్రాజు, మార్కెట్ యార్డు చైర్మన్ జక్కా అర్జున భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలో చేరిన నల్లమోతు పెడన రూరల్ : బంటుమిల్లి సమితి మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ పెడన నియోజకవర్గ సీనియర్ నాయకుడు నల్లమోతు కోటి సూర్యప్రకాశరావు శనివారం వేదవ్యాస్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. మండల పరిధిలోని గురివిందగుంటలో సారథి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనతో పాటు గ్రామ మాజీ సర్పంచ్ వడ్లాది శ్రీనివాసరావు, మండలానికి చెందిన మరో 500 మంది తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. నల్లమోతు మాట్లాడుతూ వైఎస్సార్‌పై అభిమానంతో వైఎస్సార్సీపీలో చేరినట్లు చెప్పారు. ఆయన పరిపాలన ఓ సువర్ణాధ్యాయమని, వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయగల సత్తా పార్టీ అధినేత జగన్‌కు మాత్రమే ఉందని తెలిపారు.


