రేపల్లె - బందరు రైల్వే లైన్‌పై దృష్టి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే రేపల్లె-మచిలీపట్నం మీదుగా నరసాపురానికి రైల్వేలైన్ నిర్మాణానికి కృషిచేస్తానని ఆ పార్టీ మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి కొలుసు పార్థసారథి చెప్పారు.
- సారథి, వేదవ్యాస్ హామీ
- పెడన నియోజకవర్గంలో ప్రచారం
- టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి 500 మంది చేరిక
పెడన, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే రేపల్లె-మచిలీపట్నం మీదుగా నరసాపురానికి రైల్వేలైన్ నిర్మాణానికి కృషిచేస్తానని ఆ పార్టీ మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి కొలుసు పార్థసారథి చెప్పారు. రైల్వే లైన్ నిర్మాణం జరిగితే పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాలు ఆర్థికంగా, పారిశ్రామికంగా, సామాజికంగా ఎంతో అభివృద్ధి చెందుతాయన్నారు. శనివారం ఆయన పెడన నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి బూరగడ్డ వేదవ్యాస్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్న నాయకత్వంలో బందరు లోక్‌సభను అభివృద్ధి పథంలోకి తెస్తామన్నారు. పెడన నియోజకవర్గంలో అధిక శాతం చేనేత కార్మికులున్నారని, వారి కోసం టెక్స్‌టైల్ పార్కు నిర్మాణానికి నిధుల కొరత లేకుండా చూస్తామని చెప్పారు. ఆర్థిక సమస్యలు లేకుండా చూస్తామన్నారు. కలంకారీ కార్మికుల కోసం కామన్ ఫెసిలిటీ సెంటర్, ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులు ఇప్పించి ఆర్థిక పురోభివృద్ధి కల్పిస్తామన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో బందరుకు పోర్టు నిర్మాణమే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పారు. 214-ఎ జాతీయ రహదారి విస్తరణ పనులు, మచిలీపట్నం-విజయవాడ రహదారి నిర్మాణాలు త్వరితిగతిన పూర్తయ్యేలా కృషిచేస్తామన్నారు. రొయ్యలు, చేపల చెరువుల రైతుల సౌకర్యార్థం పెడన నియోజకవర్గంలో ఆక్వా రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.
మత్స్య కార్మికులకు చేపలు ఆరబెట్టేందుకు ప్లాట్ ఫాంలు, సొసైటీల ద్వారా రుణాలు, సబ్సీడీపై బోట్లు ఇప్పించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. మత్స్యకార మహిళలకు రుణ సౌకర్యం, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు చేపడతామన్నారు. డెల్టా ఆధునికీకరణ పూర్తి చేసి డెల్టా రైతులకు రెండు పంటలకు సాగునీరందించి రైతన్న కోసం రాజన్న రాజ్యం తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
సంక్షేమ పథకాల అమలు జగన్‌తోనే సాధ్యం : వేదవ్యాస్
పెడన అసెంబ్లీ అభ్యర్థి వేదవ్యాస్ మాట్లాడుతూ వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికీ అందాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి తీరాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రచార కమిటీ కన్వీనర్ మావులేటి వెంకట్రాజు, మార్కెట్ యార్డు చైర్మన్ జక్కా అర్జున భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీలో చేరిన నల్లమోతు
పెడన రూరల్ : బంటుమిల్లి సమితి మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ పెడన నియోజకవర్గ సీనియర్ నాయకుడు నల్లమోతు కోటి సూర్యప్రకాశరావు శనివారం వేదవ్యాస్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. మండల పరిధిలోని గురివిందగుంటలో సారథి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనతో పాటు గ్రామ మాజీ సర్పంచ్ వడ్లాది శ్రీనివాసరావు, మండలానికి చెందిన మరో 500 మంది తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. నల్లమోతు మాట్లాడుతూ వైఎస్సార్‌పై అభిమానంతో వైఎస్సార్‌సీపీలో చేరినట్లు చెప్పారు. ఆయన పరిపాలన ఓ సువర్ణాధ్యాయమని, వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయగల సత్తా పార్టీ అధినేత జగన్‌కు మాత్రమే ఉందని తెలిపారు.


