సోషల్‌ మీడియాపై రణభేరి! | Sakshi Editorial On Social Media War | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాపై రణభేరి!

Aug 12 2026 1:28 AM | Updated on Aug 12 2026 1:28 AM

Sakshi Editorial On Social Media War

సామాజిక మాధ్యమాలు వచ్చాక ప్రపంచ పరిణామాలన్నీ వెంటవెంటనే అందరికీ చేరుతున్నాయి. అవి భావవ్యక్తీకరణ విస్తృతిని పెంచి కోట్లాదిమందికి గొంతునిస్తు న్నాయి. ఇన్నాళ్లూ మౌనంగా, నిస్సహాయంగా వీక్షించినవారంతా నిక్కచ్చిగా, నిర్మొహ మాటంగా తమ అభిప్రాయాలు వినిపిస్తున్నారు. కానీ మంచితోపాటే చెడు కూడా ఇందులో కలగలిసివుంది. వాటి కారణంగా అనవసర వదంతులు వ్యాపించి ఎందరో అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మన దేశం వరకే తీసుకుంటే దొంగ లుగా ముద్రపడి కొన్నిచోట్ల, గోవుల్ని తరలిస్తున్నారని ఆరోపణలొచ్చి మరికొన్నిచోట్ల ఉన్మాద గుంపులు దాడులు చేసి హతమార్చిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. టీనేజర్లు, పిల్లల మనసుల్లో ఈ వేదికల దుష్ప్రభావం కూడా నానాటికీ పెరుగుతోంది. మానసిక ఒత్తిళ్లకూ, రుగ్మతలకూ అవి కారణమవుతున్నాయి. 

అమెరికా అప్పీళ్ల కోర్టులో మెటా, ఆల్ఫాబెట్, స్నాప్‌చాట్, టిక్‌టాక్‌ తదితర సంస్థలపై సోమవారం 3,000కు పైగా పిటిషన్లు దాఖలు కావటాన్ని ఈ నేపథ్యంలో చూడాలి. ‘పబ్లిక్‌ న్యూసెన్స్‌’ కింద దాదాపు 40 రాష్ట్రాలతోపాటు మున్సిపాలిటీలు, పాఠశాలలు, వ్యక్తులు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. వాస్తవానికి మొన్న మార్చిలోనే లాస్‌ ఏంజెలెస్‌కి చెందిన న్యాయస్థానం సామాజిక మాధ్యమ వేదికల్ని యువతకు హానికరమైన రీతిలో రూపొందించటాన్ని తప్పుబట్టింది. చిన్న వయసులో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లు తనను బానిసగా మార్చాయనీ, ఇందువల్ల తీవ్రంగా నష్టపోయాననీ ఆరోపిస్తూ కోర్టుకెక్కిన 20 యేళ్ల యువతికి 60 లక్షల డాలర్ల పరిహారం చెల్లించాలని ఆ న్యాయస్థానం తీర్పునిచ్చింది. న్యూమెక్సికోలో సైతం మెటాపై ఈ తరహా తీర్పే వెలువడింది. వేదికకు సంబంధించిన భద్రత విషయంలో వినియోగదారుల్ని అది తప్పుదోవ పట్టించిందని న్యాయస్థానం నిర్ధారించింది. 37.5 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించాలని సంస్థను ఆదేశించింది. 

చాన్నాళ్లక్రితమే టీనేజర్లపైనా, పిల్లలపైనా సామాజిక మాధ్యమాల దుష్ప్రభావం ఎలా ఉన్నదో ప్రభుత్వాలు గుర్తించాయి. ఆస్ట్రేలియా పదహారేళ్లలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల ప్రవేశాన్ని నిషేధించింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకునే బాధ్యతను టెక్‌ సంస్థలపైనే పెట్టింది. దీన్ని పాటించనట్టయితే దాదాపు 5 కోట్ల ఆస్ట్రేలియా డాలర్లు జరిమానా చెల్లించాలని చట్టం నిర్దేశించింది. బ్రిటన్, ఫ్రాన్స్‌ సైతం ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) హానికర మైన పోస్టుల్ని తొలగించటంలో జాప్యం జరిగితే గ్లోబల్‌ టర్నోవర్‌లో 6 శాతం మొత్తాన్ని జరిమానా విధించే చట్టం తీసుకొచ్చింది.

తెలిసో తెలియకో ఏదైనా వీడియో చూస్తే ఆ వెనువెంటనే అటువంటివే కుప్పలు తెప్పలుగా వచ్చిపడేలా ఆ మాధ్యమాలు అల్గారిథమ్‌లు రూపొందిస్తున్నాయి. తెలిసీ తెలియని వయసులో ఉన్న పిల్లల్ని వ్యామోహాల బారిన పడేస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలొచ్చినప్పుడల్లా ఈ మాధ్యమాలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాము కేవలం ఒక వేదిక మాత్రమే కల్పిస్తున్నామనీ, అందులో వేరెవరో ఉంచే కంటెంట్‌కు తామెలా బాధ్యులమనీ ప్రశ్నిస్తున్నాయి. ఏటా వేలాదికోట్ల డాలర్ల లాభాలు ఆర్జించే ఉద్దేశంతోనే ఈ సంస్థలు జుగుప్సాకర, హింసాత్మక అంశాలున్న వీడియోల్ని చూసీ చూడనట్టు వదిలేస్తున్నాయి. 

సామాజిక మాధ్యమాలు భావప్రకటనా స్వేచ్ఛకు అనువైనవి. కానీ అవి దుర్వినియోగమైన పక్షంలో కఠినచర్యలుండాలి. మన దేశం ఈ విషయంలో వెనకబడే ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, పాలకుల్ని కించపరిచేవిధంగానో పోస్టులున్నప్పుడే తక్షణ స్పందన కనిపిస్తోంది. తెలంగాణలో ఆన్‌లైన్‌ చానెళ్లు నిర్వహిస్తున్న మహిళా పాత్రికేయులపై అత్యంత జుగుప్సాకరంగా పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు లేవు. ఆంధ్రప్రదేశ్‌లో పత్రికల్లో వచ్చిన కథనాలను పోస్టుచేసినందుకే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల్ని అరెస్టుచేస్తున్న ప్రభుత్వం... ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డినీ, ఇతర నేతలనూ కించపరుస్తూ పోస్టులు పెట్టే టీడీపీ నేతలనూ, కార్యకర్తలనూ చూసీచూడనట్టు వదిలేస్తోంది. అందుకే అమెరికాలో మాదిరి మన దేశంలో కూడా మాధ్యమాల, ప్రభుత్వాల జవాబుదారీతనాన్ని పెంచే చట్టాన్ని తీసుకురావాలి. అప్పుడు మాత్రమే ఇటువంటి పెడధోరణులు ఆగుతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement