సాక్షి, నెల్లూరు జిల్లా: ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ప్రశ్నించడమే పాపం అన్నట్లు ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలొ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి ఒక సుస్థిర స్థానం ఉంది. తమ సానుభూతిపరులను ఉద్దేశించి నీచంగా మాట్లాడటం సరికాదంటూ విక్రమ్‌రెడ్డి హితవు పలికారు.
ఆనం గెలిచాక మర్రిపాడులో ఇసుక కొండను మాయం చేశారు. ఆత్మకూరులో ఇసుక దందాకు పాల్పడుతున్నారు. మంత్రి ఆనం ధనదాహానికి ఏడుగురు బలయ్యారు. మంత్రి ఆనం చికెన్ వేస్ట్ మాఫియా తయారు చేశారు. అవినీతి, అక్రమాలు, ఇసుక రవాణా, చికెన్ వేస్ట్ దందాలు చేసిన చరిత్ర మాది కాదు. వైఎస్ జగన్‌ని తిట్టి మంత్రి అయిన చరిత్ర హీనుడివి నువ్వు. భూ సేకరణ చేయకుండా నూతన ప్రాజెక్ట్ అంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నాడు. పోలీస్ స్టేషన్‌లో సైతం మాముళ్ళు వసూళ్లు చేసిన నీచపు చరిత్ర నీది’’ అంటూ విక్రమ్‌రెడ్డి దుయ్యబట్టారు.
‘‘మంత్రి ఆనం ఇసుక దందా ద్వారా రూ.3 కోట్లు సంపాదిస్తున్నారు. ఐదేళ్లకోసారి పార్టీ మార్చే ఊసరవెల్లి నైజం మీదే. ఆనం అంటే అవినీతి.. అవినీతి అంటే ఆనం. నాపై ఆరోపణలునిరూపిస్తే రాజీనామా చేస్తా. నా సవాల్ స్వీకరించే దమ్ముందా?’’ అంటూ విక్రమ్‌రెడ్డి సవాల్ విసిరారు.


