ఏపీలో సమ్మె సైరన్‌ మోగించిన జూనియర్‌ డాక్టర్లు | Junior Doctors Strike At Visakhapatnam King George Hospital | Sakshi
Sakshi News home page

ఏపీలో సమ్మె సైరన్‌ మోగించిన జూనియర్‌ డాక్టర్లు

Aug 11 2026 11:38 AM | Updated on Aug 11 2026 11:41 AM

Junior Doctors Strike At Visakhapatnam King George Hospital

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో జూనియర్‌ డాక్టర్లు సమ్మె సైరన్‌ మోగించారు. అత్యవసర సేవలు మినహా విధులను జూనియర్‌ డాక్టర్లు బహిష్కరించారు. దీంతో కింగ్ జార్జ్ ఆసుపత్రిలో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. సూపరింటెండెంట్ కార్యాలయం వద్దకు చేరుకున్న జూనియర్ డాక్టర్లు.. స్టైఫండ్ పెంచకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కాగా, ప్రభుత్వ ఆస్పత్రులను నమ్ముకున్న పేద రోగులకు ‘సమ్మె’ కష్టాలు మొదలయ్యాయి. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జూనియర్‌ డాక్టర్లు (జూడాలు) మంగళవారం నుంచి నిరవధిక సమ్మెబాట పట్టారు. సోమవారం అమరావతి వైద్య ఆరోగ్యశాఖ వైద్య విద్యా డైరెక్టర్‌(డీఎంఈ), ఇతర అధికారులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో నిరవధిక సమ్మెలోకి దిగుతున్నట్లు జూడాలు ప్రకటించారు. దీంతో కేజీహెచ్‌తో పాటు ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు విఘాతం కలుగుతుంది.

సమ్మెలో భాగంగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓపీ సేవలను జూనియర్‌ డాక్టర్లు పూర్తిగా నిలిపివేస్తున్నారు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే హాజరవుతామని వెల్లడించారు. ఆస్పత్రుల్లో రోజూ వార్డుల నిర్వహణ, శస్త్రచికిత్సలు, పరీక్షలు చేయడంలో పీజీ డాక్టర్లు, హౌస్‌సర్జన్లదే కీలక పాత్ర. వీరంతా విధులకు దూరం కావడంతో దూర ప్రాంతాల నుంచి ఆస్పత్రులకు వచ్చే వేలాది మంది పేద రోగులు, వృద్ధులు, గర్భిణులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఈ ఏడాది జనవరి నుంచి రావాల్సిన స్టైపెండ్‌ పెంపును వెంటనే విడుదల చేయాలని, చెల్లింపులను క్రమబద్దీకరించాలని జూనియర్‌ డాక్టర్ల సంఘం నాయకుడు డాక్టర్‌ శిరాజ్‌ డిమాండ్‌ చేశారు. డీఎంఈతో చర్చలు విఫలమవడంతోనే సమ్మెకు దిగామన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి హామీలను అమలు చేయాలని, లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఏపీజేయూడీఏ నేతలు హెచ్చరించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement