సాక్షి, తూర్పుగోదావరి: రాజమహేంద్రవరం ప్రసాదిత్యమాల్ వద్ద కారుతో ఢీకొట్టిన సంఘటనలో మృతి చెందిన వైద్య విద్యార్థిని కనికే ప్రియాంక కేసులో అనుమానాలు వీడడం లేదు. ఇప్పటి వరకు మాల్‌లో ప్రియాంకపై వాహనంతో జరిగిన దాడికి సంబంధించి మాత్రమే సీసీ ఫుటేజ్ బయటికి వచ్చింది. నిందితులు మాల్‌లోకి వచ్చిన ఫుటేజ్ గాని, ప్రియాంక మాల్‌లోకి ఎప్పుడు వచ్చిందన్న ఫుటేజ్ గాని పోలీసులు బయట పెట్టలేదు.
మాల్లో ఏం జరిగిందన్న విషయంపై సందేహాలు తొలగలేదు. ప్రసాదిత్యా మాల్‌లో నిందితులతో మాల్ సిబ్బందికి జరిగిన గొడవ పుటేజ్ బయటకు ఎందుకు రాలేదన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్ ప్రియాంక పోస్ట్‌మార్టం రిపోర్ట్, కెమికల్ ఎనాలసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అల్టర్ చేసే అవకాశం ఉంది.
కాగా, ప్రియాంక మృతదేహానికి సోమవారం రాజమహేంద్రవరం డీఎస్పీ సుభాష్ బృందం పోస్టుమార్టం నిర్వహించారు. ప్రియాంక కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు పోస్టుమార్టం నిర్వహించేందుకు క్రైం డీఎస్పీ సుభాష్, ప్రకాశ్‌నగర్ సీఐ బాజీలాల్, ఎస్సై సతీష్, ఇద్దరు కానిస్టేబుళ్ల బృందం ఆదివారం రాత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
మర్నాడు పోస్టుమార్టం పక్రియ పూర్తి చేసి ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం ప్రియాంక మృతదేహాన్ని భారీ ఊరేగింపుతో స్వగ్రామమైన గద్వాల్ జిల్లా అయిజ మండలంలోని ఎక్లాస్‌పురానికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు.



