ప్రారంభమై పదేళ్లు గడిచాక యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా సాగే డిజిటల్ లావాదేవీలకు వడ్డింపు మొదలుకాబోతోంది. లోక్‌సభలో గురువారం గందర గోళం నెలకొన్నప్పుడు, ఎలాంటి చర్చా లేకుండా ఇందుకు సంబంధించిన బిల్లుఆమోదం పొందిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. తక్షణమే వర్తించకపోయినా భవిష్యత్తులో ఎప్పుడైనా యూపీఐ లావాదేవీలపై రుసుము వసూలు చేసేందుకు ఈ బిల్లు అధికారమిస్తోంది. ఫీజంటూ వసూలు చేస్తే రూ. 2,000కు మించిన లావాదేవీలపై, అది కూడా వార్షిక టర్నోవర్ కోటిన్నర మించే వ్యాపారులకే వర్తిస్తుందని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.
విధించబోయే ఫీజు కూడా ఒక్కో లావాదేవీకి 0.25 శాతం లేదా 0.5 శాతం ఉండొచ్చన్నది మరో మాట. సాధారణ యూపీఐ వినియోగదారులు సాగించే లావాదేవీలన్నీ ఎప్పటిలా యధాతథంగా ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని విశ్వసించలేం. ఆదాయం పెంచుకునేందుకు అవకాశం ఉన్నప్పుడు ఆ చట్టానికి ముందూ మునుపూ సవరణలు రాబోవని చెప్పలేం. ఆ సంగతలావుంచి తమపై రుద్దే ఈ చార్జీల్ని వ్యాపారులు వినియోగదారుకే బదిలీ చేస్తారు. ఆ అవకాశం లేకుండా తగిన నియంత్రణలు విధిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వగలదా?
దేశంలో ఆర్థిక సంస్కరణల ఆగమనంతోపాటే పాలకులు కొత్త రాగం అందు కున్నారు. ప్రభుత్వాలు పాలించాలి తప్ప వ్యాపారం చేయడమేమిటన్నదే దాని సారాంశం. ఆ వంకన లక్షలాదిమంది సిబ్బంది పనిచేసే దిగ్గజ పబ్లిక్ రంగ సంస్థలు అనేకం కనుమరుగయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు గర్వకారణంగా నిలిచి, ఆసియాలోనే అతిపెద్దదైన నిజాం షుగర్స్ కాస్తా ఆనాటి సీఎం చంద్రబాబు పుణ్యమా అని మూతబడింది. కోట్లాది రూపాయల విలువైన దాని ఆస్తుల్ని కారుచవగ్గా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. నిజాం షుగర్స్ మాదిరిగా మరెన్నో పబ్లిక్ రంగసంస్థలకు తాళాలుపడ్డాయి. వ్యాపారమంటే వదులుకున్నాయిగానీ... ప్రభుత్వాలకు వ్యాపార దృక్పథం పోలేదని యూపీఐ లావాదేవీలపై ఫీజు వసూలు ఆలోచన నిరూపిస్తోంది. యూపీఐ, రూపే వంటివి ఉచిత సేవలు అందించటంవల్ల తమవీసా, మాస్టర్‌కార్డ్ వగైరా ప్లాట్‌ఫాంలు ఎదగటంలేదన్న అమెరికా ఆక్రోశమే తాజా నిర్ణయానికి కారణమని కొందరి ఆరోపణ.
బ్రెజిల్‌పై సైతం అమెరికా ఈ మాదిరి ఒత్తిడే తెచ్చినా అది అంగీకరించలేదని కూడా చెబుతున్నారు. వాటి నిజానిజాల సంగతలావుంచి, ప్రభుత్వం చెప్పే కారణాలు మాత్రం ఎప్పటినుంచో వింటున్నవే. యూపీఐ వ్యవస్థ నిర్వహణ తడిసిమోపెడు భారమవుతున్నదని బ్యాంకులూ, పేమెంట్ ప్రాసెసర్లూ గగ్గోలు పెడుతుండటంవల్ల ఇది తప్పడం లేదట! లావాదేవీల నిర్వహణ భారంలోకొంతమేర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. దాంతోపాటు ఈ లావాదేవీలు పెరిగాకబ్యాంకులు తమ సిబ్బందిని తగ్గించుకోలేదా? ఆమేరకు వాటి ఖర్చు తగ్గలేదా? అదీగాక గత దశాబ్దకాలంలో బ్యాంకింగ్ సేవల చార్జీలు, కనీస మొత్తం ఖాతాలో లేదన్న కారణంతో వసూలు చేసే పెనాల్టీ, పరిమితికి మించిన లావాదేవీలపై చార్జీలు, ఎస్‌ఎంఎస్‌సందేశాలకని, డెబిట్ కార్డు నిర్వహణ వ్యయమని బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఇవన్నీ చాలకనా ఈ కొత్త ఆలోచనలు!
ఈ పదేళ్లలో డిజిటల్ లావాదేవీలు అపారంగా పెరిగాయి. అయినా ఈ పెరుగుదల తగినంతగా లేదని ఆర్థిక నిపుణులంటున్నారు. గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే వగైరాలు వినియోగిస్తున్నవారు వాటిని బ్యాంకింగ్ సేవలుగా చూడటం లేదు... ఆ యాప్‌లను పర్స్‌గా పరిగణించి లావాదేవీలు జరుపుకొంటున్నారు. అలవాటు చేసినట్టే చేసి,దాన్నుంచి కూడా ఆదాయం పొందాలనుకోవటం సరికాదు. ప్రస్తుతం దేశంలో డిజిటల్ లావాదేవీల వినియోగదారుల సంఖ్య 50 కోట్లని చెబుతున్నారు.
అయితే ఒక వినియోగదారు సగటున చేసే లావాదేవీలు చూస్తే ప్రపంచ స్థాయికన్నా తక్కువే. అలాగే లావాదేవీల్లో 86 శాతం రూ.500, అంతకన్నా తక్కువ మొత్తాలేనని అంటారు. మొదట్లో ఉన్నంత వృద్ధి ఇటీవలి సంవత్సరాల్లో కనబడటం లేదని కూడా అంటున్నారు. ఇదంతా ఏం చెబుతోంది? ఎంతో వెసులుబాటుగా, ఉపయోగకరంగా ఉన్న ఈ లావాదేవీలు మరింత విస్తరించాల్సిన తరుణంలో వాటిని నిరుత్సాహపరిచేలా, జనం మళ్లీ నగదు వైపు మొగ్గేలా చేయటం వింతకాదా? ప్రభుత్వం ఆలోచించాలి.


