యూరప్‌ను వలస భూతం ఇంకా వెన్నాడుతూనే ఉంది. ఆ బెడద గురించి అత్యవసరంగా చర్చించేందుకు యూరోపియన్ యూనియన్(ఈయూ) మంగళవారం సమావేశం కాబోతోంది. గతవారం స్పెయిన్ అధీనంలోని స్యూటా నగరానికి ఒక్కసారిగా పొరుగునున్న మొరాకో నుంచి శరణార్థులు వెల్లువెత్తడంతో ఆ దేశం దిక్కుతోచని స్థితికి చేరింది. 60,000 మంది వచ్చిపడితే అదుపు చేయటమెలాగో స్పెయిన్‌కు అర్థం కాలేదు. స్పెయిన్ దళాల కాల్పుల్లో 72 మంది శరణార్థులు మరణించారు. ప్రస్తుతానికి ఇది ఉపశమించిందని స్పెయిన్ చెబుతున్నా స్వదేశంలోని మితవాదపక్షంతోపాటు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి చెందిన అతి మితవాద పక్షం స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ను తప్పుబడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం స్పెయిన్‌ని నిందిస్తున్నారు.
వలసలపై ఆఫ్రికా ఖండ దేశాలను తప్పుబట్టి ప్రయోజనం లేదు. అక్కడి ఆర్థిక వ్యవస్థలు అంతంతమాత్రం కావటం వాస్తవం. యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవటమూ నిజమే. శతాబ్దాల తరబడి అక్కడి సంపదనంతా కొల్లగొట్టిన యూరప్ దేశాలే ఈ దుఃస్థితికి కారణం. అందుకు సిగ్గుపడకపోగా... తాము కష్టపడి సంపద పోగేస్తుంటే ఈ వలసలు తలనొప్పిగా మారాయని వాపోతున్నాయి. కానీ శరణార్థులవి పొట్టకూటి తిప్పలు మాత్రమే. వారు యూరప్ దేశాల్ని దోచుకుతినడానికి రావడంలేదు. నిరుడంతా జెన్ జీ ఉద్యమం మొరాకోను ఊపిరాడనీయకుండా చేసింది. అక్కడ నిరుద్యోగం మాత్రమే సమస్య కాదు. రెక్కలు ముక్కలు చేసుకుంటున్నవారికి సైతం 12 గంటలు శ్రమించినా దక్కేది స్వల్పం. పెరుగుతున్న ధరలకూ, వచ్చే వేతనానికీ మధ్య అగాథాన్ని పూడ్చలేక అర్ధాకలితో బతకడం అక్కడివారికి నిత్య నరకం.
అసలు ఆఫ్రికా ఖండంలోని స్యూటా, మెలిల్లా నగరాలతో మధ్యధరా సముద్రం ఆవలనున్న స్పెయిన్‌కు ఏం సంబంధం? అవి భౌగోళికంగా మొరాకోకు చేర్చివుంటాయి. స్పెయిన్ భూభాగంనుంచి జిబ్రాల్టర్ జలసంధి గుండా వెళ్తే స్యూటా 14 కిలోమీటర్ల దూరం. మెలిల్లా నగరమైతే ఏకంగా 150 కిలోమీటర్ల ఆవల ఉంటుంది. ఎప్పుడో 1497లో మెలిల్లానూ, 1668లో స్యూటానూ స్పెయిన్ ఆక్రమించుకుంది. 1956లో మొరాకో స్వాతంత్య్రం పొందినప్పుడు న్యాయంగా అయితే ఆ రెండింటినీ స్పెయిన్ అప్పగించితీరాలి. కానీ ఆధునిక మొరాకో ఏర్పడటానికి వందల సంవత్సరాలక్రితం తమ చేతికొచ్చాయి గనుక, దీన్ని ఆక్రమణగా చూడొద్దని స్పెయిన్ తర్కానికి దిగింది.
ఐక్యరాజ్యసమితి 2014లో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ వలస సంస్థ (ఐఓఎం) కనబడకుండాపోయిన శరణార్థుల డేటా సేకరిస్తోంది. మధ్యధరా సముద్రం దాటూతూ ఇంతవరకూ 33,220 మంది అదృశ్యమయ్యారని ఆ డేటా చెబుతోంది. కానీ ఇది సమగ్రం కాదని ఆ సంస్థే అంటోంది. వాస్తవానికి మధ్యధరా సముద్ర దక్షిణ తీరానికి చేరేముందు అత్యంత కంటకప్రాయమైన సహారా ఎడారిలోనే అనేకులు తనువులు చాలిస్తారు. సముద్రాన్ని దాటే క్రమంలో సంభవించే మరణాలతో పోలిస్తే ఆ సంఖ్య చాలా ఎక్కువని ఐఓఎం అంటున్నది. కాలినడకన మూడు రోజులు పట్టే ఆ మార్గంలో మృత్యు ఇసుక తుపాన్లు విరుచుకుపడకపోతే, స్మగ్లర్లు కాల్చిచంపకపోతే మధ్యధరా తీరానికి శరణార్థులు చేరుకోగలుగుతారు. ఆ తర్వాత సైతం రాకాసి అలలనుంచీ, సరిహద్దు దళాలనుంచీ ప్రాణగండమే.
ఒక డేటా ప్రకారం 2024 నాటికి శరణార్థులు 30 కోట్ల 40 లక్షలు. వీరందరికీ ఒక దేశాన్ని సృష్టిస్తే అది భారత్, చైనా, అమెరికాల తర్వాత అతి పెద్ద జనాభాగల దేశమవుతుంది. ప్రపంచబ్యాంకు లెక్కలు తిరగేస్తే వీరు తమ కుటుంబాలకు పంపే సొమ్ము 2024 నాటికి 90,500 కోట్ల డాలర్లు! 2014లో అమెరికా, చైనా, జపాన్‌ల ఉమ్మడి విదేశీ పెట్టుబడులకన్నా అధికం. కనుక శరణార్థుల్ని శత్రువులుగా... ‘దరిద్రగొట్టు’ ఆఫ్రికా దేశాలవల్ల కలిగే అనర్థంగా ఈయూ పరిగణించటం మానుకోవాలి. నిత్యం మృత్యుగీతం వినిపించే ఉక్రెయిన్ యుద్ధం కోసం పారబోసే కోట్లాది డాలర్లలో కొంత శాతమైనా ఆఫ్రికా దేశాల ఆర్థిక ప్రగతికి వెచ్చించగలిగితే అవి ఊపిరిపీల్చుకోవటంతో పాటు తమ గత పాపాలు శాపాలై వెంటాడకుండా ఉంటాయని గుర్తించాలి. ఈయూ అత్యవసర సమావేశం చర్చించాల్సింది దీనిపై!


