పౌర స్వేచ్ఛలో తేడాలెందుకు? | Sakshi Guest Column On Civil liberties | Sakshi
Sakshi News home page

పౌర స్వేచ్ఛలో తేడాలెందుకు?

Aug 4 2026 12:05 AM | Updated on Aug 4 2026 12:05 AM

Sakshi Guest Column On Civil liberties

అభిప్రాయం

ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక దేశాల మధ్య పౌర స్వేచ్ఛలకు సంబంధించి ముఖ్యమైన తేడా ఒకటుంది. ఆ తేడా ప్రభావాలు అనేక విధాలుగా కనిపిస్తున్నాయి. గతంలో, వర్తమానంలోనే కాదు, మునుముందు కూడా కనిపించగల అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కనుక ఆ తేడాను, అందుకు కారణాలను అర్థం చేసుకునేందుకు ఒక ప్రాథమికమైన ప్రయత్నం అవసరం. ప్రతి దేశానికి అంతర్గత విధానాలు సరేసరి కాగా, విదేశాంగ విధానం ఒకటి ఉంటుంది. అది దేశ ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందుతుందనేది తెలిసిందే. అట్లా అనుగుణం అని తాము భావించే విధంగా విదేశాంగ విధానాన్ని ప్రభుత్వాలు రూపొందిస్తాయి. అనగా ఆ సమయంలో అధికారంలో ఉండే పార్టీలు. ఆ విధానాలలో కొన్ని స్థిరంగా ఉంటాయి. కొన్ని పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. కానీ సదరు విధానం, లేదా విధానాలు దేశ ప్రయోజనాలకు అనుగుణమైనవి కావనీ, నష్టం కూడా కలిగించవచ్చుననీ ప్రతిపక్షాలో, మీడియానో, మేధావులో భావించినట్లయితే, ఆ విధానాలను నిష్కర్షగా విమర్శించే పౌర స్వేచ్ఛలు ఎంతవరకు ఉంటున్నాయి? ఆ స్వేచ్ఛలలో తేడాలెందుకు?

నచ్చనిది ముఖం మీదే...
ఈ ప్రశ్న విదేశాంగ విధానాల గురించి ఇతరత్రా రావటం సరేసరి కాగా, యుద్ధ సందర్భాలలో మరింత తీవ్రంగా తలెత్తుతుంది. యుద్ధమన్నది మహా సున్నితమైన విషయం, భావోద్వేగాలతో కూడా ముడిపడి ఉండేది గనుక. అటువంటి సందర్భాలలో ప్రభుత్వాలు ఒక విధానాన్ని అనుసరిస్తున్నపుడు, ఆ విధానం దేశ ప్రజలకు అవసరమని చెప్తున్నపుడు, ఆ యుద్ధం వల్ల అటువంటి ప్రయోజనాలేవీ లేవని భావించేవారు విభేదించి మాట్టాడవచ్చునా? ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో, రాజ్యాంగ భావ ప్రకటనా స్వేచ్ఛను, లేదా పౌర స్వేచ్ఛను ఇస్తున్నపుడు, అటువంటి అవకాశం కాగితం పైన ఉన్నా ఆచరణలో ఎంతవరకు లభిస్తున్నది? 

ఇపుడు నిర్దిష్టమైన ఉదాహరణలను చెప్పుకుంటే విషయం ఇంకా బోధపడుతుంది. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్‌ కలిసి ఇరాన్‌పై పాలస్తీనాపై యుద్ధాలు సాగిస్తున్నాయి. అవి ఆ రెండు దేశాల ప్రయెజనాలకు అవసరమని చెప్తున్నాయి. కానీ ఆ వాదనతో విభేదించే అమెరికన్, ఇజ్రాయెల్‌ పౌర సమాజాలు, మీడియా, మేధావి వర్గాలు, రిటైరయిన సైన్యాధికారులు పెద్ద సంఖ్యలోనే తమ ప్రభుత్వ విధానాలను కేవలం నర్మగర్భంగా గాక, ప్రత్యక్షంగా, తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎప్పటికప్పుడు జరిగే ప్రజాభిప్రాయ సేకరణలలో ప్రభుత్వ విధానాలకు ఆమోదం నానాటికి తగ్గిపోతున్నది. అమెరికా, ఇజ్రాయెల్‌ రెండు దేశాలలోనూ పౌర స్వేచ్ఛలు ఈ విధంగా ప్రజాస్వామికంగా, నిర్భయమైన రీతిలో వ్యక్తమవుతున్నాయి. ఆ విధానాలు దేశ ప్రయోజనాలకు ఏ విధంగా భంగకరమో వారు వివరించి చెప్తున్నారు. ఇంకా అనాలంటే చెప్పగలుగుతున్నారు. వాస్తవానికి అమెరికా, యూరప్‌లలో ఈ ప్రజాస్వామిక స్వేచ్ఛలు మొదటి నుంచి ఉన్నాయి. మనవరకు చూస్తే వియత్నాం యుద్ధకాలం నుంచే కనిపిస్తున్నాయి. 

దేశద్రోహం పేరిట...
ఇటువంటి పౌర స్వేచ్ఛలు భారతదేశం మొదలైన ప్రజాస్వామిక వ్యవస్థలలో ఉన్నాయా? ఉంటే ఎంతవరకు? ఇది ఇండియాకే కాదు, ఇటువంటి వర్ధమాన దేశాలు అన్నింటికి సంబంధించినది. ప్రస్తుత మధ్య ఆసియా యుద్ధాలనే చూద్దాము. అక్కడ ఇరాన్‌–ఇజ్రాయెల్‌–అమెరికా, గల్ఫ్‌ రాజ్యాల కోణం ఒకటున్నది. అది గాక ఇజ్రాయెల్‌– పాలస్తీనా– అమెరికా కోణం మరొకటి. రెండూ దుర్మార్గమైన యుద్ధాలే అయినా, మొదటి దానికి సంబంధించి భారత ప్రభుత్వం గల్ఫ్‌ నుంచి ఇంధనం, ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పని చేస్తున్న భారతీయుల సంక్షేమం అనే అంశాలను పేర్కొంటున్నందున ఆ మేరకు అర్థం చేసుకోవచ్చు. కానీ రెండవది?

ఇజ్రాయెల్‌తో సంబంధాల సాధారణీకరణ గతంలోనే జరిగినా, ఇపుడు గాజా హత్యాకాండతో సమస్య తీవ్ర రూపం తీసుకుంది. అటువంటపుడు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆ దారుణాన్ని ఖండించకపోవటమే గాక, ఇక్కడి నుంచి ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరాలను సైతం అనుమతిస్తున్నది. ఐక్యరాజ్య సమితిలో ద్వంద్వ ధోరణి చూపుతున్నది. ఇందుకు గల కారణాలలో ఇజ్రాయెల్‌ ప్రభుత్వపు ఇస్లాం వ్యతిరేకతతో ప్రస్తుత భారత ప్రభుత్వానికి గల ఏకీభావం కూడా ఒకటనే అభిప్రాయం ఉంది. ఇజ్రాయెల్‌లోని అరబ్బులను అక్కడి ప్రభుత్వం హతమార్చకుండానే ఒక పద్ధతి ప్రకారం ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చుతున్నట్లు, దానితో ప్రేరణ చెందిన ఇక్కడి ప్రభుత్వం కూడా అదే మార్గంలో ఉందనే సందేహాలున్నాయి. 

ప్రశ్న ఏమంటే, ఇటువంటి అంచనాలను, విమర్శలను వ్యక్తీకరించేందుకు భారత దేశంలో గల పౌర స్వేచ్ఛ ఎంత? ఇది ఒక వర్తమానపు ఉదాహరణ మాత్రమే. గతంలోకి వెళితే అనేకం ఉన్నాయి. ఉదారవాద ప్రజాస్వామిక పార్టీ అనుకునే కాంగ్రెస్‌ పరిపాలనలో కూడా, అదేవిధంగా, పైన అనుకున్నట్లు ఇది ఇండియాలోనే గాక, వర్ధమాన దేశాలన్నిటా కనిపిస్తున్న పరిస్థితి. అందువల్ల ఈ చర్చ భారత దేశానికి పరిమితమైనది కాదు. స్థూలంగా చెప్పుకోవాలంటే, పౌర స్వేచ్ఛలలో ఇటువంటి తేడాలు అభివృద్ధి చెందిన దేశాలలో ఒక విధంగా, వర్ధమాన దేశాలలో మరొక విధంగా కనిపిస్తున్నాయి. వర్ధమాన దేశాలలో ఆ స్వేచ్ఛలు లేకపోవటమే గాక వాటిని దేశ ద్రోహం పేరిట, మత ద్రోహం పేరిట, మరో పేరిట అణిచివేయటం కూడా జరిగితే?

స్థిరపడని విలువలు
ఇవన్నీ చెప్పుకున్న తర్వాత, ప్రపంచంలోని ప్రజాస్వామిక వ్యవస్థలను అభివృద్ధి చెందినవి, వర్ధమాన స్థితిలో ఉన్నవి అని స్థూలంగా విభజించి చూసినపుడు, రెండింటి మధ్య ఈ తేడాలెందుకనే మౌలికమైన ప్రశ్న గురించి చర్చించటం అవసరం. ఇంత లోతైన విషయం తేలికగా అర్థమయ్యేది కాదు. కానీ ఒక ప్రాథమిక ప్రయత్నమంటూ జరగాలి. ఆ విధంగా చూసినపుడు తోస్తున్నవి కొన్నున్నాయి. మనం అభివృద్ధి చెందిన దేశాలంటున్నవి పెట్టుబడిదారీ విధానంలో ఎదిగి వచ్చినవి. ఆ క్రమంలో పౌరులకు తమ హక్కులు, స్వేచ్ఛలు, వాటిని కాపాడుకోవడం అన్నది, వారి వ్యక్తిత్వాలు, వ్యక్తిగత గుర్తింపులు రూపుదిద్దుకునే క్రమంలో ఒక సంప్రదాయంగా మారింది. ఇవన్నీ వారి ప్రజాస్వామ్యంలో భాగమయ్యాయి. వాటిని వారు బలంగా కాపాడుకుంటారు. ఇందుకు పునాదులు రినైజాన్స్‌–పునరుజ్జీవనోద్యమం (14–17 శతాబ్దాలు), ఫ్రెంచ్‌ విప్లవం (18వ శతాబ్దం), ఇంగ్లండ్‌లో పారిశ్రామిక విప్లవం (18వ శతాబ్దం నుంచి)లో పడ్డాయి. అప్పటి నుంచి ప్రజాస్వామ్యాలు, వ్యక్తి స్వేచ్ఛలు, పౌర స్వేచ్ఛలు వ్యవస్థీకృత రూపం తీసుకుని బలపడ్డాయి. అక్కడి పార్టీలు, ప్రభుత్వాలు, వాటి విధానాలు ఎట్లున్నా ఈ వ్యవస్థలు, స్వేచ్ఛలు మారలేదు. అదే నేటికీ కనిపిస్తున్నది. 

ఇందుకు భిన్నంగా, వర్ధమాన దేశాలనేవి చిరకాల ఫ్యూడల్‌ దశలు, రాచరికాలు, వలస పాలనల నుంచి బయటకు రావటం మొదలై ఇంకా వంద సంవత్సరాలు కూడా కాలేదు. యూరప్‌ తరహా విప్లవాలు రాలేదు. విలువలు ఇంకా నిజమైన అర్థంలో రూపుదిద్దుకోలేదు. పౌరుల వ్యక్తిత్వాలు, పౌర స్వేచ్ఛలు ఇంకా బలపడి వ్యవస్థీకృత రూపం తీసుకోలేదు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలనే చట్ట సభలు, పాలనా యంత్రాంగం, న్యాయస్థానాలు కూడా ఇంకా తమ స్ఫూర్తికి అనుగుణంగా స్థిరపడి బలపడవలసే ఉంది. అందువల్ల ఈ ఎదుగుదల వ్యత్యాసాలే మొదట చెప్పుకున్న వ్యత్యాసాలకు కూడా కారణమవుతున్నాయనిపిస్తున్నది.

టంకశాల అశోక్‌
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement