బాంబుల మోతల్లో అక్షర జ్వాల... | Gaza 18-year-old Saba Rabah has achieved the highest score in Palestine secondary school | Sakshi
Sakshi News home page

బాంబుల మోతల్లో అక్షర జ్వాల...

Jul 30 2026 6:20 AM | Updated on Jul 30 2026 6:20 AM

Gaza 18-year-old Saba Rabah has achieved the highest score in Palestine secondary school

సంకల్పం

చుట్టూ బాంబుల మోతలు...
కళ్ల ముందే కూలిపోతున్న భవనాలు... 
మృత్యువు పొంచిన భయానక వాతావరణం. 
బతకడమే ఒక యుద్ధం. 
అలాంటిచోట చదివి పరీక్ష రాయడం?
కానీ, 18 ఏళ్ల పాలస్తీనా యువతి సబా
గాజా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 
ఇంటర్‌ (తౌజీహీ) పరీక్షల సైన్స్ స్ట్రీమ్‌లో 
ఏకంగా 99.9 శాతం మార్కులు సాధించి 
దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. 
కన్నీటి లోయలో అక్షరాల జెండా పాతిన 
ఆ అసాధారణ విద్యార్థిని కథనం ఇది.

పాలస్తీనా జాతీయ హైస్కూల్‌ పరీక్షలు ‘తవ్జీహీ’ (ఇంటర్‌) రిజల్ట్స్‌ జూలై 24న వెలువడ్డాయి. గాజాలో ఒక పెద్ద విస్మయం. సబా నివసిస్తున్న శరణార్థి శిబిరంలో పెద్ద కోలాహలం. సబాకు వచ్చిన మార్కులు అలాంటివి. సైన్స్ స్ట్రీమ్‌లో మొత్తం 25,800 మంది రాశారు. సబా టాపర్‌!
  
సెంట్రల్‌ గాజాలోని ‘అల్‌–మఘాజీ’ శరణార్థి శిబిరంలో నివసిస్తున్న సబా రబా జీవితం నిరంతర పోరాటం. 2023 అక్టోబర్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఆమె కుటుంబం ఐదుసార్లు నిరాశ్రయమైంది. సొంత ఇల్లు బాంబుల దాడిలో పూర్తిగా ధ్వంసమైంది. అంతటి తీవ్ర విషాదంలో కూడా చెక్కు చెదరకుండా కుటుంబానికి కొండంత అండగా నిలిచిన తండ్రి... స్కూల్‌ టీచర్‌ ఫయాద్‌ రబా...  జూన్‌ 2024లో వైమానిక దాడిలో కన్నుమూశాడు. తండ్రి మరణంతో సబా ప్రపంచం చీకటైపోయింది. సబాకు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఉన్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి వీరంతా ప్రాణాలు చేతపట్టుకుని తిరుగుతున్నారు. దాంతో తల్లి ఫెరియాల్‌ రబా పిల్లలకు అంతా తానే అయ్యి ‘పాలస్తీనా శరణార్థుల సహాయ సంస్థ’ (్ఖNఖగిఅ)  అందించే రేషన్, తాత్కాలిక టెంట్‌తోనే కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఇలాంటి స్థితిలో సబా ఈ మార్కులు తెచ్చింది.
  
డాక్టర్‌ కావాలనేది సబా సంకల్పం. అందుకే బైపిసి తీసుకుంది. కాని యుద్ధం వల్ల గాజాలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి నెలలు గడుస్తోంది. ఇంటర్నెట్‌ లేదు, కనీసం చదువుకోవడానికి ప్రశాంతమైన గది లేదు.  ఉన్న పుస్తకాల్లో సగం బాంబు దాడుల బూడిదలో కలిసిపోయాయి. అయినప్పటికీ తండ్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని, తను కన్న డాక్టర్‌ కలలను సబా వదులుకోలేదు. పరీక్షలకు కొన్ని రోజుల ముందు కూడా ఆమె ఉంటున్న తాత్కాలిక నివాసానికి ఎదురుగా ఉన్న ఇల్లు బాంబు దాడికి గురైంది. దీంతో ప్రాణాలు చేతపట్టుకుని మళ్లీ వలస వెళ్లాల్సి వచ్చింది. ‘కానీ నా లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడూ వదులుకోలేదు’ అని సబా కన్నీళ్లతో గుర్తు చేసుకుంది. రాత్రి వేళల్లో కేవలం మొబైల్‌ ఫోన్‌ వెలుతురులో, బాంబుల శబ్దాల మధ్యే ఏకాగ్రతతో చదివింది. పరీక్షా కేంద్రాలకు వెళ్లే మార్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకపోయినా ప్రాణాలను పణంగా పెట్టి పరీక్షలకు హాజరై ఈ అద్భుత విజయాన్ని అందుకుంది.
  
అయితే సబా గెలుపు ఇంకా ముగింపుకు చేరలేదు. గాజా స్ట్రిప్‌లో ప్రతిష్టాత్మకమైన మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. వాటిలో ఆమెకు సీటు వచ్చేది. కానీ ప్రస్తుత యుద్ధం కారణంగా గాజాలోని విద్యా వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. మెడికల్‌ కాలేజీల భవనాలు, ల్యాబ్‌లు దారుణంగా దెబ్బతిన్నాయి. అందువల్ల ప్రస్తుతం గాజా లోపల ఉండి పూర్తిస్థాయి ప్రాక్టికల్‌ మెడిసిన్‌ చదవడం ఆమెకు దాదాపు అసాధ్యం. దేశంలోనే ఫస్ట్‌ ర్యాంక్‌ (99.9%) సాధించిన సబాకు ఏ అంతర్జాతీయ యూనివర్సిటీ అయినా రెడ్‌ కార్పెట్‌ వేస్తుంది. ఇలాంటి పిల్లలు ఈజిప్ట్, టర్కీ, కతార్‌లకు వెళ్లి చదువుకుంటారు. కానీ ఫుల్‌ స్కాలర్‌షిప్‌ కావాలి. అదీగాక యుద్ధ వాతావరణం మధ్య గాజా సరిహద్దులు దాటి సురక్షితంగా బయటకు వెళ్లడం పెద్ద సవాలు. అంటే అంతర్జాతీయ సంస్థలు చొరవ తీసుకుంటే తప్ప ఈ అక్షర సరస్వతి మెడికల్‌ కాలేజ్‌ మెట్లు ఎక్కడం కష్టం. వినాశనంలో కూడా విద్యామార్గంలో విజయం సాధించి చరిత్ర సృష్టించిన సబా రబా తన సంకల్పబలంతో తప్పక గమ్యానికి చేరుతుందని ఆశిద్దాం. 
 

పరీక్షల ఫలితాలు రాగానే అల్‌–మఘాజీ క్యాంపులో బాంబుల శబ్దాల స్థానంలో ఒకేసారి చప్పట్లు, డ్రమ్స్‌ మార్మోగాయి. పొరుగువారంతా వచ్చి సబాను ఎత్తుకుని వేడుకలు చేసుకున్నారు. సబా తన గ్రాడ్యుయేషన్‌ గౌన్‌ ధరించి, తండ్రి ఆత్మకు ఈ విజయాన్ని అంకితం ఇస్తూ కన్నీరు పెట్టుకుంది. ‘నా తండ్రి నన్ను ఎప్పుడూ డాక్టర్‌గా చూడాలనుకునేవారు. ఎలాగైనా మెడికల్‌ స్కూల్‌లో  చేరి, నా తండ్రి కలను నిజం చేస్తాను.  గాజా ప్రజలకు సేవ చేస్తాను’ అని సబా సగర్వంగా ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement