భయానక సంకేతం.. ఎండిపోతున్న డాన్యూబ్‌ నది | Severe Drought Exposes Historic Shipwrecks Along The Danube River | Sakshi
Sakshi News home page

భయానక సంకేతం.. ఎండిపోతున్న డాన్యూబ్‌ నది

Jul 30 2026 1:18 PM | Updated on Jul 30 2026 1:38 PM

Severe Drought Exposes Historic Shipwrecks Along The Danube River

వాతావరణ మార్పుల ప్రభావంతో ఐరోపాలోని డాన్యూబ్ నదిలో నీటి మట్టం రికార్డు స్థాయిలో తగ్గిపోవడంతో.. దశాబ్దాలుగా నీటిలో మునిగిపోయిన చారిత్రక ఓడల శిథిలాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. సెర్బియా, క్రొయేషియా ప్రాంతాల్లో ఈ అరుదైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఐరోపాలోని జర్మనీ నుంచి బ్లాక్‌సీ వరకు 10 దేశాల మీదగా ఈ నది ప్రవహిస్తుంది. ఓ పక్క కార్చిచ్చులు.. యూరప్‌ను వణికిస్తున్నాయి. 

ఐరోపాలోని అతిపెద్ద నదుల్లో ఒకటైనా డాన్యూబ్.. గతంలో (2018)లో బుడాపెస్ట్‌లో 33 సెంటీ మీటర్లకు పడిపోగా.. ఇప్పుడు 9 అంగుళాలకు పడిపోయింది. క్రొయేషియాలో 1937లో బొగ్గును రవాణా చేస్తూ మునిగిపోయిన ఒక సరుకు నౌక తిరిగి కనిపించగా.. సెర్బియాలో 1944లో యుద్ధ సమయంలో మునిగిపోయిన జర్మన్ యుద్ధ నౌకలు కూడా వెలుగులోకి వచ్చాయి.

రికార్డు స్థాయి వేడి.. ఐరోపాను అతలాకుతలం చేస్తోంది. మే చివరి నుంచి యూరప్‌ అంతటా తీవ్రమైన వేడి గాలులు (హీట్‌వేవ్స్‌) కొనసాగుతున్నాయి. ఐక్యరాజ్యసమితి వెస్టర్న్ యూరప్ ప్రాంతీయ సమాచార కేంద్రం ప్రకారం.. 2026 జూన్‌లో యూరప్‌లో నమోదైన సగటు ఉష్ణోగ్రత ఆ నెలకు చరిత్రలో రెండో అత్యధిక స్థాయిగా నమోదైంది. పశ్చిమ యూరప్ అత్యంత తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటోంది.

స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలోని ఫాబ్రా అబ్జర్వేటరీలో 104.9°F (సుమారు 40.5°C) ఉష్ణోగ్రత నమోదైంది. ఇది అక్కడ శతాబ్దానికి పైగా నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతగా నిలిచింది. ఈ వేడి కారణంగా స్పెయిన్, పోర్చుగల్, దక్షిణ ఫ్రాన్స్ ప్రాంతాల్లో భారీ అటవీ అగ్నిప్రమాదాలు సంభవిస్తుండగా, తూర్పు యూరప్‌లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి.

సెర్బియాలోని నోవి సాడ్ నగరం వద్ద డాన్యూబ్ నది నీటి మట్టం జూన్ 18న సుమారు 5.9 అడుగులు ఉండగా.. జూలై 20 నాటికి అది 1.45 అడుగులకు పడిపోయింది. ఈ భారీ తగ్గుదలతో ఎన్నో దశాబ్దాలుగా నీటిలో దాగి ఉన్న ఓడలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం బయటపడిన ఓడల్లో ప్రధానమైనది 1937లో బొగ్గు తీసుకెళ్తూ మునిగిపోయిన హంగేరియన్ సరుకు నౌక ‘ఫుల్టన్’.

హంగేరీ మీడియా కథనాల ప్రకారం.. మరో రెండు రెండో ప్రపంచ యుద్ధ కాలానికి చెందిన నౌకలు కూడా బయటపడ్డాయి. వాటిలో ఒకటి మొహాచ్.. పట్టణ సమీపంలో మరొకటి నాగిబాయ్చ్ గ్రామం వద్ద గుర్తించారు. అదనంగా, మొహాచ్ సమీపంలోని ఎండిపోయిన నది ఒడ్డున ఇసుకలో ఇరుక్కుపోయి వదిలివేయబడిన మూడు సరుకు బార్జ్‌లు కూడా బయటపడ్డాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement