థాయిలాండ్‌ పర్యటన పేరుతో మోసం | Three Indian tourists were allegedly trapped in a fake Thailand tour deal | Sakshi
Sakshi News home page

థాయిలాండ్‌ పర్యటన పేరుతో మోసం

Jul 30 2026 6:07 AM | Updated on Jul 30 2026 6:06 AM

Three Indian tourists were allegedly trapped in a fake Thailand tour deal

కిడ్నాప్‌కు గురైన ముగ్గురు భారతీయులు

పీడకలగా మారిన విహారయాత్ర

బ్యాంకాక్‌: తక్కువ ఖర్చుతో కూడిన పర్యటన ఆశ చూపి కొన్ని అంతర్జాతీయ ముఠాలు పర్యాటకులను మోసం చేస్తున్నాయి. తాజాగా, చౌకగా థాయిలాండ్‌ పర్యటించొచ్చనుకున్న ముగ్గురు భారతీయులకు   విహారయాత్ర కాస్త పీడకలగా మారింది. కిడ్నాప్‌కు గురైన ముగ్గురు వారం రోజుల పాటు నరకం చూశారు. 

భారత్, పాకిస్తానీలతో కూడిన ఒక ముఠా టూర్‌ ప్యాకేజీతో వారిని థాయిలాండ్‌కు రప్పించింది. వారిని చిత్రహింసలకు గురి చేసి కుటుంబాల నుంచి డబ్బు డిమాండ్‌ చేసింది. ఎట్టకేలకు థాయ్‌ పోలీసులు వారిని దాచిన ప్రదేశాన్ని గుర్తించి, ముగ్గురు భారతీయులను కాపాడారు. ఐదుగురు భారతీయ కిడ్నాపర్లను అరెస్టు చేశారు. ఈ వివరాలను థాయిలాండ్‌ దినపత్రిక ‘బ్యాంకాక్‌ పోస్ట్‌’ ప్రచురించింది.
 
ఈ ముఠా, తక్కువ ఖర్చుతో ఏడు రోజుల టూర్‌ ప్యాకేజీని ఆశ చూపి ముగ్గురు యువకులను థాయ్‌లాండ్‌కు రప్పించింది. టూర్‌ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు దాదాపు రూ.2లక్షలు చెల్లించారు. జులై 21న బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయంలో దిగారు. పట్టాయాకు వెళ్లిన ఒక భారతీయ వ్యక్తి వారిని మోటార్‌సైకిల్‌పై ఒక అద్దె ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ నలుగురు పాకిస్తానీలు, మరో భారతీయుడు వారిని అదుపులోకి తీసుకున్నారు. 

వారం రోజుల పాటు బందీలుగా ప్రతిరోజూ చిత్రహింసలకు గురిచేశారు. తలకిందులుగా వేలాడదీశారు. చీలమండలపై కొట్టారు. తిండిపెట్టలేదు. కనీస సౌకర్యాలు లేవు. డబ్బుకోసం భారత్‌లోని వారికి కుటుంబాలకు ఫోన్‌ చేయాలని బలవంతం చేశారు. ఫోన్‌ చేయడానికి యూఏఈలో రిజిస్టర్‌ అయిన నంబర్‌ను ఉపయోగించారు. తీవ్ర రక్తస్రావం అయినట్లు వీడియో కాల్స్‌లో కనిపించడానికి ఒకరికి ఎర్ర రంగు పూశారు. 

భారత్‌లోని కుటుంబ సభ్యులు సహాయం కోసం థాయ్‌ పోలీసులను సంప్రదించారు. దీంతో థాయ్‌లాండ్‌ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. పోలీసులు చేరుకోవడానికి కొద్దిసేపటి ముందే అనుమానిత కిడ్నాపర్లు ఆ ఇంటినుంచి మోటార్‌సైకిళ్లపై తప్పించుకున్నారు. థాయ్‌లాండ్‌ నుంచి పారిపోవడానికి సిద్ధమైన ఐదుగురు కిడ్నాపర్లను పోలీసులు మంగళవారం విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అరెస్టయిన వారందరూ భారతీయులుగా కాగా, ఈ నేరంలో పాల్గొన్న పాకిస్తానీలను ఇంకా పట్టుకోవాల్సి ఉంది.

అయితే, నెల రోజుల కిందట ఒక యాప్‌ ద్వారా దుబాయ్‌లో నివసిస్తున్న ఓ పాకిస్తానీ ఈ ముగ్గురిని కిడ్నాప్‌ చేయమని తమకు సూచించినట్లు వారు దర్యాప్తు అధికారులకు తెలిపారు. కిడ్నాప్‌ తర్వాత, కొంతనగదు, థాయ్‌లాండ్‌ నుంచి పారిపోవడానికి విమాన టిక్కెట్లు ఇస్తానని తమకు వాగ్దానం చేశాడని పోలీసులకు  నిందితులు వెల్లడించారు. ఇటీవల భారత్‌ నుంచి పర్యాటకులు తగ్గిన నేపథ్యంలో, దానిని పునరుద్ధరించే లక్ష్యంతో థాయిలాండ్‌ భారతీయ పాస్‌పోర్ట్‌ హోల్డర్లకు వీసా రహిత ప్రవేశాన్ని పునరుద్ధరించింది. ఈ చర్యలు తీసుకున్న కొద్ది రోజులకే ఈ సంఘటన జరిగింది. కొన్ని అంతర్జాతీయ ముఠాలు తక్కువ ఖర్చుతో కూడిన పర్యటనల ఆశ చూపి పర్యాటకులను బందీలుగా మార్చుకుంటున్నాయని, చౌక ప్యాకేజీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement