అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. ఊపిరాడక పలువురు దుర్మరణం | Several dies as fire tears through apartment in Belgium Antwerp | Sakshi
Sakshi News home page

అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. ఊపిరాడక పలువురు దుర్మరణం

Jul 1 2026 6:15 PM | Updated on Jul 1 2026 6:56 PM

Several dies as fire tears through apartment in Belgium Antwerp

బ్రస్సెల్స్: యూరప్‌ దేశమైన బెల్జియంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 200 మంది నివాసముంటున్న ఒక అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. 

బెల్జియం మీడియా కథనాలు ప్రకారం.. బెల్జియం ఉత్తర ప్రాంతంలోని ప్రముఖ నగరమైన యాంట్‌వెర్స్‌లోని లింకెరూవర్ అనే నివాస ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బుధవారం (జూలై 1) ఉదయం స్థానిక కాలమానం ప్రకారం సుమారు 9:53 గంటలకు అగ్నిప్రమాదంపై ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందింది. 10 అంతస్తుల భవనంలో సుమారు 200 మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. అపార్ట్‌మెంట్ లోని 8వ అంతస్తులో మొదట భయంకరమైన మంటలు ప్రారంభమయ్యాయి. అది క్షణాల్లోనే పై అంతస్తులకు కూడా వ్యాపించింది. ఈ ప్రమాదంలో కనీసం ఐదుగురు మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. ఎంతోమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మంటలు చెలరేగిన వెంటనే బిల్డింగ్ కారిడార్లలో దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. దాంతో మెట్ల గుండా కిందకు రాలేక, లోపలే చిక్కుకుపోయి ఊపిరాడక కొందరు మరణించారు. ప్రాణభయంతో కొందరు నివాసితులు కిటికీలు, బాల్కనీల నుండి బయటకు వచ్చి కాపాడాలంటూ కేకలు వేశారు. తీవ్ర భయాందోళనల మధ్య కొందరు అపార్ట్‌మెంట్‌పై నుండి కిందికి దూకి ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేశారు. మరికొందరు పక్క రూముల బాల్కనీల ద్వారా తప్పించుకున్నారు.

సమాచారం అందిన వెంటనే వేర్వేరు జిల్లాల నుండి భారీగా ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది స్పెషల్ లాడర్స్ సాయంతో బాల్కనీల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా కిందకు దించారు.  క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో స్థానిక ఆసుపత్రులు అలర్ట్ అయ్యాయి. బెల్జియం ప్రభుత్వం అక్కడ 'మెడికల్ ఎమర్జెన్సీ ప్లాన్' యాక్టివేట్ చేసింది. బిల్డింగ్ లోపల ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అని వెతకడానికి ప్రత్యేక రెస్క్యూ టీమ్‌లతో పాటు స్పెషలైజ్డ్ డ్రోన్ యూనిట్లను కూడా రంగంలోకి దించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం చుట్టుపక్కల దట్టమైన పొగ కమ్ముకోవడంతో, స్థానిక ప్రజలెవ్వరూ కిటికీలు, తలుపులు తెరవద్దని, వెంటిలేషన్ సిస్టమ్స్ ఆఫ్ చేయాలని పోలీసులు హెచ్చరించారు.

 బెల్జియం ప్రధాన మంత్రి బార్ట్ డి వెవర్  ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు తన సానుభూతిని ప్రకటించారు. ప్రాణాలకు తెగించి పోరాడుతున్న రెస్క్యూ సిబ్బందిని అభినందించారు. మంటలు ఎలా అంటుకున్నాయనే దానికి సంబంధించిన ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు, అధికారులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement