ఉజ్జయిని: నేడు శ్రావణ మాస సోమవారం కావడంతో ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. సంవత్సరానికి ఒకేసారి తెరుచుకునే నాగచంద్రేశ్వర ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోని హర సిద్ధి ఆలయం ఎదుట ఉన్న బారికేడింగ్ ప్రాంతంలో ఒక్కసారిగా జనసమ్మర్ధం పెరిగింది. భక్తుల ఒత్తిడి విపరీతంగా పెరగడంతో అక్కడ స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు భక్తులు అస్వస్థతకు గురయ్యారు. కొందరు భక్తులు కిందపడిపోవడంతో పాటు స్పృహ కోల్పోయినట్లు సమాచారం.
వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, కుటుంబ సభ్యులు బాధితులను జనసమ్మర్దం నుండి బయటకు తీసుకువచ్చారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో సుమారు 13 మంది భక్తులు గాయపడినట్లు తెలుస్తోంది. మహాకాళుడితో పాటు నాగచంద్రేశ్వర స్వామి ప్రత్యేక దర్శనాల కోసం ఉదయం నుంచే ఆలయ పరిసరాల్లో విపరీతమైన భక్తుల రద్దీ నెలకొంది. ఇప్పటివరకు సుమారు 5.50 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.


