సాక్షి, శ్రీకాకుళం: అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఏడాదిలో రెండుసార్లు జరిగే అరుదైన ఘట్టంగా భావించే సూర్యకిరణాల స్పర్శ కోసం భారీగా తరలివచ్చిన భక్తులు.. ఈసారి కూడా ఆ అద్భుత దృశ్యాన్ని వీక్షించలేకపోయారు. వరుసగా రెండో రోజు సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకకపోవడంతో భక్తులు నిరాశతో వెనుదిరిగారు.
శ్రీకాకుళంలోని అరసవిల్లి ఆలయం సూర్యభగవానుడి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏడాది కొన్ని ప్రత్యేక రోజుల్లో ఉదయించే సూర్యకిరణాలు నేరుగా ఆలయంలోకి ప్రవేశించి మూలవిరాట్ పాదాలను తాకుతాయి. దక్షిణాయన కాలంలో అక్టోబరు నెలలో తొలి మూడు లేదా నాలుగు రోజులు, అలాగే ఉత్తరాయణంలో మార్చి 9, 10 తేదీల్లో ఉదయించే సూర్యకిరణాలు నేరుగా ఆలయంలోకి ప్రవేశించి సూర్యభగవానుడి విగ్రహాన్ని తాకుతాయని చెబుతారు.
ఆ దృశ్యం సుమారు ఆరు నిమిషాల పాటు కొనసాగి.. ఆనంద పారవశ్యాన్ని కలగజేస్తుంది. ఈ అరుదైన ఘట్టాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. వీక్షించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈసారి కూడా సూర్యకిరణాల స్పర్శను చూసేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ప్రత్యేక ఏర్పాట్ల మధ్య స్వామివారి దర్శనం కోసం ఎదురుచూశారు. అయితే అనుకున్న సమయానికి సూర్యకిరణాలు ఆలయంలోకి ప్రవేశించకపోవడంతో భక్తులకు నిరాశ తప్పలేదు. నిన్న కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గంటల తరబడి వేచి చూసిన భక్తులు సూర్యకిరణాల అద్భుత దృశ్యం కనిపించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
అయితే ఆలయ అధికారులు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ప్రకృతి పరిస్థితుల కారణంగా సూర్యకిరణాల స్పర్శ కనిపించలేదు. రేపు, ఎల్లుండి కూడా అవకాశం ఉండడంతో.. భక్తుల రద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
అరసవిల్లి సూర్యభగవానుడి ఆలయం అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. స్థల పురాణం ప్రకారం.. ఓ సందర్భంలో ఇంద్రుడు తన సర్వశక్తులను కోల్పోయి అశక్తుడై కింద పడిపోయాడు. ఆ సమయంలో సూర్యనారాయణుడిని ప్రార్థించగా.. స్వామివారు ప్రత్యక్షమై, తాను పడిన ప్రదేశాన్ని వజ్రాయుధంతో తవ్వాలని సూచించినట్లు చెబుతారు. ఇంద్రుడు అలా చేయగా.. అక్కడ నుంచి సూర్యభగవానుడు, ఉష, ఛాయ, పద్మిని దేవతల విగ్రహాలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం ఇంద్రుడు అక్కడ ఆలయాన్ని నిర్మించి, ఆ విగ్రహాలను ప్రతిష్ఠించాడని పురాణ కథనం. అయితే పద్మపురాణం ప్రకారం.. ఈ ఆలయంలోని సూర్యనారాయణ స్వామి విగ్రహాన్ని కశ్యప మహర్షి ప్రతిష్ఠించినట్లు ప్రస్తావన ఉంది. లోకానికి వెలుగును అందించే, సకల జీవరాశికి ఆరోగ్యం, శక్తి, నవచైతన్యం ప్రసాదించే సూర్యభగవానుడికి ఇక్కడ నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులు ఆనందం, హర్షంతో తిరిగి వెళ్లేవారని.. అందుకే ఈ ప్రాంతాన్ని తొలుత ‘హర్షవల్లి’గా పిలిచేవారని, కాలక్రమేణా అదే పేరు ‘అరసవిల్లి’గా మారిందని చెబుతారు.
ఇదీ చదవండి: అయ్యారే.. అన్ని వేల కోట్లుఘె ఎగ్గొట్టారే!


