నివేదిక సమర్పించేందుకు ఏడాది గడువు
ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నియమించిన కమిషనర్‌తో రాజీనామా
కొత్త కమిషనర్ నియామకానికి 27 నెలల సుదీర్ఘ సమయం
సాక్షి, అమరావతి: అధికారం చేపట్టిన 27 నెలలు తరువాత 12వ వేతన సవరణ కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్‌కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. వేతన సవరణ కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి ఒక సంవత్సరంలోపు ఈ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిజానికి.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 12వ వేతన సవరణ కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ మన్మోహన్‌సింగ్‌ను 2023లోనే నియమించింది.
అయితే, 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనతో రాజీనామా చేయించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 27 నెలలపాటు కమిషనర్‌ను నియమించకుండా చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేసింది. ఇదిలా ఉంటే.. ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులను స్వీకరించడం, వాటిని పరిశీలించడం, సమాచారాన్ని సేకరించడం వంటి అంశాలకు సంబంధించి వేతన సవరణ కమిషన్ తన సొంత విధానాన్ని రూపొందించుకుంటుందని ఉత్తర్వుల్లో తెలిపారు. సచివాలయ విభాగాలు, శాఖాధిపతులు, వేతన సవరణ కమిషన్ కోరినప్పుడు అవసరమైన సమాచారాన్ని అందించడంతో పాటు కమిషన్‌కు అవసరమైన సహకారాన్ని, సహాయాన్ని అందించాలని అందులో పేర్కొన్నారు. దినేష్‌కుమార్ నియామకానికి సంబంధించిన నిబంధనలు, షరతులు విడిగా జారీచేయనున్నట్లు తెలిపారు.


