ఐయ్యారే.. రూ.20,898 కోట్లు ఎగ్గొట్టారే! | Chandrababu Fake Promises on PRC: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఐయ్యారే.. రూ.20,898 కోట్లు ఎగ్గొట్టారే!

Oct 2 2026 5:36 AM | Updated on Oct 2 2026 5:36 AM

Chandrababu Fake Promises on PRC: Andhra Pradesh

అధికారంలోకి రాగానే ఐఆర్‌ ఇస్తానని చెప్పి ఎగనామం

27 నెలలుగా ఐఆర్‌ ఇవ్వకపోవడంతో ఉద్యోగులకు రూ.20,898 కోట్లు గండి

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2019 జూలై 1 నుంచి 27 శాతం ఐఆర్‌ అమలు

నెలకు రూ.774 కోట్లు చొప్పున 2019 ఆగస్టు వేతనంతో చెల్లింపు

చెప్పిన మాట మేరకు తొలి కేబినెట్‌లోనే మంజూరు చేసిన గత సీఎం వైఎస్‌ జగన్‌

అధికారంలోకి రాగానే ఐఆర్‌ ప్రకటిస్తామని మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ

27 నెలల కాలయాపన తరువాత పీఆర్సీ కమిషన్‌ నియామకం

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చంద్రబాబు ప్రభుత్వం భారీ వెన్నుపోటు పొడిచింది.  2024 ఎన్నికల మేనిఫేస్టోలో ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్‌ (మధ్యంతర భృతి) ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీని గాలికొదిలేసిన చంద్రబాబు, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన వేతన సవరణ కమిషనర్‌ డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌తో ఆ పదవికి రాజీనామా చేయించారు. ఆ తరువాత వేతన సవరణ కోసం మరో కమిషనర్‌ను నియమించలేదు. తద్వారా 27 నెలలుగా ఉద్యోగులకు ఐఆర్‌ ఇవ్వకుండా వారికి చెందాల్సిన ఆర్థిక ప్రయోజనాలకు చంద్రబాబు గండికొట్టారు. రెండేళ్లకు పైగా కాలయాపన చేసి తాజాగా వేతన సవరణ కమిషనర్‌గా దినేష్‌కుమార్‌ను నియమించారు. 27 నెలలుగా ఐఆర్‌ ప్రకటించకపోవడంతో ఉద్యోగులకు రూ.20,898 కోట్ల ఆర్థిక ప్రయోజనాలకు చంద్రబాబు ప్రభుత్వం గండికొట్టింది.

నెలకు రూ.774 కోట్ల మేర గండి..
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల ఐఆర్‌ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2019 జూలై 1వ తేదీ నుంచి 27 శాతం ఐఆర్‌ అమలు చేస్తూ తొలి కేబినెట్‌ సమావేశంలోనే వైఎస్‌ జగన్‌ హయాంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2019 ఆగస్టు 1వ తేదీ వేతనంతో ఐఆర్‌ చెల్లించారు. అప్పట్లో నెలకు రూ.774 కోట్ల మేర ఐఆర్‌ ఇవ్వడం ద్వారా ఉద్యోగులకు ప్రయోజనం కల్పించారు. 

జగన్‌ మాటిచ్చి నెరవేర్చారు.. చంద్రబాబు మాట మార్చారు
2019 ఎన్నికల ముందు వైఎస్‌ జగన్‌ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే తొలి కేబినెట్‌ సమావేశంలోనే ఆమోదించి అమలు చేశారు. చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇవ్వడమే తప్ప ఇప్పటికీ అమలు చేయలేదు. ఇదే వైఎస్‌ జగన్‌కు చంద్రబాబుకు విశ్వసనీయతలో ఉన్న వ్యత్యాసం. చంద్రబాబు అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం ఇచ్చినట్టు 27 శాతం ఐఆర్‌ ఇచ్చి ఉంటే ఉద్యోగులకు రూ.20,898 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరేది. 27 నెలల తరువాత వేతన సవరణ కమిషనర్‌ను నియమించారు.

కమిషన్‌ నివేదిక ఇచ్చేందుకు మరో ఏడాది గడువు విధించారు. కమిషనర్‌ నివేదిక సమర్పించి.. అమలు చేయడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అంటే ప్రస్తుత వేతన సవరణ కమిషన్‌ నివేదిక సమర్పించేందుకు 2027 అక్టోబర్‌ వరకు గడువు ఉంది. 13వ వేతన సవరణ కమిషన్‌ను 2028లో నియమించాల్సి ఉంటుంది. ప్రస్తుత కమిషన్‌ నివేదిక వచ్చి.. అది అమలయ్యే వరకు ఐఆర్‌ ఇవ్వాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement