పోలీసుల నుంచి రక్షణ కల్పించండి | Pastor Sampath Kumar lodges complaint with Home Minister and DGP against Rayachoti police | Sakshi
Sakshi News home page

పోలీసుల నుంచి రక్షణ కల్పించండి

Oct 2 2026 5:15 AM | Updated on Oct 2 2026 5:15 AM

Pastor Sampath Kumar lodges complaint with Home Minister and DGP against Rayachoti police

రాయచోటి పోలీసులపై హోంమంత్రి, డీజీపీలకు పాస్టర్‌ సంపత్‌కుమార్‌ ఫిర్యాదు 

కంప్లైంట్‌ చేశానని ఖాకీలు కక్ష సాధిస్తున్నారంటూ ఆరోపణ 

తనపై ఐదు అక్రమ కేసులు పెట్టారంటూ కోర్టు తలుపు తట్టిన వైనం 

పోలీసుల కక్ష సాధింపులు ఆపకపోవడంతో అజ్ఞాతంలోకి పాస్టర్‌ సంపత్‌ కుమార్‌ 

సాక్షి, అమరావతి: విజయవాడ కాపు యువకుడు గాదే సాయికృష్ణను లాకప్‌ డెత్‌ చేసినట్టే తననూ పోలీసులు అంతమొందించాలని చూస్తున్నారని, వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం గుర్రంవాండ్లపల్లెకు చెందిన చర్చి పాస్టర్‌ బి.సంపత్‌కుమార్‌ ఆందోళనవ్యక్తం చేశారు. ఇదే విషయమై ఇటీవల డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాకు ఫిర్యాదు చేసిన సంపత్‌కుమార్‌ తాజాగా హోంమంత్రి వంగలపూడి అనితకు ఫిర్యాదు చేసినా ఫలితంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిపై కంప్లైంట్‌ చేశానని రాయచోటి పోలీసులు కక్ష సాధింపు చర్యలు ఆపకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు ‘సాక్షి’కి గురువారం ఫోన్‌లో మొరపెట్టుకున్నారు.

రాయచోటి సీఐ వెంకటాచలపతి అవినీతిపై 2025 ఏప్రిల్‌ 28న కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశానని సంపత్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మీడియాలో ప్రసారం కావడంతో తనపై పోలీసులు కక్ష పెంచుకున్నారని, అప్పటి నుంచి తనపై వరుసగా ఐదు కేసులు పెట్టారని హోంమంత్రి, డీజీపీలకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. తనపై పెట్టిన ఒక కేసులో అక్రమంగా అరెస్టు చేశారని, 90రోజులపాటు రిమాండ్‌లో ఉండి బెయిల్‌పై విడుదలయ్యానని తెలిపారు. 

అయినప్పటికీ తనపై పోలీసుల కక్ష సాధింపులు ఆపకపోవడంతో హైకోర్టును ఆశ్రయించానని వివరించారు. గత నెల 26 తెల్లవారుజామున 3.30గంటలకు మగ పోలీసులు తన ఇంటికి వచ్చి సోదాలు చేశారని, ఆ సమయంలో తాను లేకపోవడంతో వృద్ధురాలైన తన తల్లి శాంతమ్మ, భార్యను భయాందోళనలకు గురిచేశారని ఆరోపించారు. హోంమంత్రి, డీజీపీ స్పందించి తనపై నమోదైన కేసులన్నింటిపైనా రాయచోటి పోలీసులకు సంబంధం లేని ఇతర జిల్లా పోలీస్‌ అధికారితో స్వతంత్ర విచారణ జరిపించాలని, పోలీసుల నుంచి తనకు రక్షణ కల్పించాలని సంపత్‌కుమార్‌ కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement