అక్రమ మైనింగ్‌ సూత్రధారులను వదిలేస్తున్నారు | Andhra Pradesh High Court Orders Action Against Illegal Mining | Sakshi
Sakshi News home page

అక్రమ మైనింగ్‌ సూత్రధారులను వదిలేస్తున్నారు

Oct 2 2026 5:52 AM | Updated on Oct 2 2026 5:52 AM

Andhra Pradesh High Court Orders Action Against Illegal Mining

డ్రైవర్లు, సూపర్‌వైజర్లపైనే కేసులు పెడుతున్నారు

చంద్రబాబు ప్రభుత్వ పనితీరును ఎండగట్టిన హైకోర్టు

సర్కార్‌ తీరుతోనే నిరాటంకంగా అక్రమ మైనింగ్‌

కనీస స్థాయిలో పర్యవేక్షణ లేదు

కఠిన చర్యల్లేవు.. అడ్డుకునే ప్రయత్నాల్లేవు

శాఖల మధ్య సమన్వయం లేదు

బాధ్యతను ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్నారు

అక్రమ మైనింగ్‌ను నిరోధించాల్సిందే 

దీనికి మార్గదర్శకాలు రూపొందించండి

తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్‌ వేయండి

ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అక్రమ మైనింగ్‌ను నిరాటంకంగా అనుమతిస్తున్నట్లు ఉందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అందుకే అక్రమ మైనింగ్‌కు అడ్డేలేకుండా పోతోందని మండిపడింది. కనీస స్థాయిలో పర్యవేక్షణ చేయడం లేదంది. అక్రమ మైనింగ్‌ తద్వారా తవ్వితీసిన వాటిని రవాణా చేస్తున్న వాహనాల డ్రైవర్లను, సూపర్‌వైజర్లపై కేసులు పెడుతూ, సూత్రధారులను మాత్రం వదిలేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. శాఖల మధ్య సమన్వయం కూడా ఉండటం లేదని స్పష్టం చేసింది.

అధికారులు తమ బాధ్యతను ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్నారని, దీంతో అడ్డులేకుండా అక్రమ మైనింగ్‌ సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ మైనింగ్‌దారులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం, వారిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేయకపోవడం వల్లే అక్రమ మైనింగ్‌ యథేచ్ఛగా కొనసాగుతోందని తేల్చి 
చెప్పింది. దీంతో అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్లు వరదలా దాఖలవుతున్నాయంది.

అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ఇందుకు కార్యాచరణను సిద్ధం చేయాలంది. సమగ్ర అఫిడవిట్‌ దాఖలుకు ఆదేశాలిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

ధర్మాసనం ముందు శాటిలైట్‌ ఫొటోలు
బాపట్ల జిల్లా, చీరాల మండలం, కవురివారిపాలెం గ్రామ పరిధిలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని, దీని వెనుక పెద్ద తలకాయలున్నాయని, దీంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఆమంచి తరఫున న్యాయవాది ఎన్‌.రవిప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ, ఇసుక అక్రమ మైనింగ్‌ జరిగిన తీరుపై శాటిలైట్‌ ఫొటోలను ధర్మాసనం ముందుంచారు.

2022లో ఎలాంటి తవ్వకాలు జరగని ప్రాంతాన్ని, ఇప్పుడు భారీ ఇసుక తవ్వకాలవల్ల అతిపెద్ద గుంతలు ఏర్పడిన ప్రాంతాన్ని పోల్చి ధర్మాసనానికి వివరించారు. 2024 చివరిలో మొదలైన ఇసుక అక్రమ మైనింగ్‌ 2026లో పరాకాష్టకు చేరుకుందని తెలిపారు. రాత్రింబవళ్లు భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తున్నారని, రోజూ 200 లారీల్లో తవ్వితీసిన ఇసుకను తరలిస్తున్నారని ఆయన వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ‘ఎలాంటి అక్రమ మైనింగ్‌ జరగలేదని గత విచారణ సమయంలో చెప్పారుగా..’ అని ప్రభుత్వ న్యాయవాది (మైన్స్‌) సాయివిహారిని ప్రశ్నించింది. 

హెల్ప్‌లైన్‌ ఉండి ప్రయోజనం ఏమిటి?
అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు చేసేందుకు హెల్ప్‌లైన్‌ ఏర్పాటుచేయండి అని ధర్మాసనం చెబుతుండగా, ఇప్పటికే ఉందని ప్రభుత్వ న్యాయవాది (మైన్స్‌) సాయివిహారి చెప్పారు. దీంతో ‘హెల్ప్‌లైన్‌ ఉండి ప్రయోజనం ఏముంది. ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో ఎన్నింటికి స్పందించారు?’ అని ధర్మాసనం నిలదీసింది.

వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేస్తే ఉపేక్షించం
అక్రమ మైనింగ్‌ను నిలువరించేందుకు మార్గదర్శకాలు రూపొందించి, కఠిన విధానాలను అమల్లోకి తీసుకురావాలి. అక్రమ మైనింగ్‌ ఎక్కడ జరిగినా కూడా అందుకు అధికారులను బాధ్యులుగా చేస్తూ మార్గదర్శకాలు తేవాలి.  అక్రమ మైనింగ్‌పై అన్నీ విభాగాల అధికారులు కూర్చొని, సమన్వయంతో పూర్తిస్థాయి అఫిడవిట్‌ను మా ముందుంచండి. అందరూ కలిసి ఒక అఫిడవిట్‌ కాకుండా, వేర్వేరుగా అఫిఢవిట్లు దాఖలు చేస్తే ఉపేక్షించేది లేదు. – సీజే ధర్మాసనం

పోలీసుల నిఘా ఉన్నా.. సూత్రధారులు దొరకడం లేదా?
ఇసుక అక్రమ తవ్వకాలను నిరోధించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారని పోలీసులను ఈ విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. రాత్రి వేళల్లో నిఘా పెంచామని, పికెట్‌లు నిర్వహిస్తున్నామని హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది అడుసుమల్లి జయంతి తెలిపారు. దీనిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘పోలీసులు పనిచేస్తుంటే, అక్రమ మైనింగ్‌ సూత్రధారులు దొరకాలి కదా?’  అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. కఠిన చర్యలు లేకపోవడంవల్లే ఇదంతా జరుగుతోందని తెలిపింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement