జస్ట్‌ 25 సెకన్లలో కిడ్నాప్‌! | Ujjain Kidnapping Twist, Woman Allegedly Abducted, Later Claims She Left Voluntarily And Married The Man, Watch Video Inside | Sakshi
Sakshi News home page

జస్ట్‌ 25 సెకన్లలో కిడ్నాప్‌!

Oct 1 2026 12:33 PM | Updated on Oct 1 2026 1:28 PM

Ujjain Kidnapping Twist: 19 Year Old Says She Left Voluntarily Married Man

ఇంటి బయట కూర్చున్న యువతిని.. సడన్‌గా దూసుకొచ్చిన ఓ వ్యక్తి బలవంతంగా ఎత్తుకెళ్లాడు. కారులో ఎక్కించేందుకు ప్రయత్నించగా.. సమయ స్ఫూర్తిని ప్రదర్శించి కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, కిడ్నాపర్‌ బలం ముందు వాళ్లు నిలవలేకపోయారు. కేవలం 25 సెకన్లలో జరిగిన ఈ కిడ్నాప్‌ కేసులో.. ఇప్పుడు మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది.

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని లాల్‌బాయి–ఫూల్‌బాయి ప్రాంతంలో మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఓ యువతి అపహరణకు గురైంది. ఇంటి బయట ఉన్న యువతి వద్దకు నంబర్‌ ప్లేట్‌ లేని కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో ఒకరు కారు దిగి యువతి వద్దకు వెళ్లాడు. ఆమెను కారులోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా కుటుంబసభ్యులు, పొరుగువారు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

కొందరు యువతిని వెనక్కి లాగేందుకు కూడా ప్రయత్నించినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది. అయినప్పటికీ యువతిని కారులోకి తీసుకెళ్లి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్‌ కేసు నమోదైంది.

రాత్రంతా గాలింపు.. ట్విస్ట్‌
ఈ ఘటనపై పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. యువతిని తీసుకెళ్లిన వ్యక్తుల్లో ఒకరిని ఉజ్జయినిలోని ఉర్దుపురాకు చెందిన ధ్రువ్‌ కుమావత్‌గా గుర్తించారు. అతడి కోసం, మరో వ్యక్తి కోసం పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే యువతి కుటుంబానికి ఓ వీడియో వచ్చింది.

అందులో.. ఆశ్చర్యకరంగా యువతి ధ్రువ్‌తో కలిసి కనిపించింది. తామిద్దరం పెద్దవాళ్లమని(మేజర్లు), తమ ఇష్టప్రకారమే ఇంటి నుంచి వెళ్లిపోయామని, పెళ్లి కూడా చేసుకున్నామని ఆ వీడియోలో వారు తెలిపారు.

బలవంతం చేయలేదు..
మరో వీడియోలో యువతి మరింత స్పష్టంగా స్పందించింది. తనను ఎవరూ బలవంతంగా తీసుకెళ్లలేదని చెప్పింది. తాను కారులోకి ఎక్కుతున్న సమయంలో తన సోదరి చేయి పట్టుకుందని, ఆ తర్వాతే ఈ ఘటన కిడ్నాప్‌లా కనిపించిందని పేర్కొంది. తామిద్దరం స్వచ్ఛందంగానే వెళ్లిపోయామని తెలిపింది. అంతేకాదు.. తమపై కుటుంబసభ్యులు ఒత్తిడి చేయవద్దని, రెండు మూడు రోజుల్లో పోలీసుల ఎదుట హాజరవుతామని యువతి, ఆమెతో ఉన్న వ్యక్తి వీడియోలో కోరారు. అయితే ఈ వీడియోలు వెలుగులోకి వచ్చినప్పటికీ పోలీసులు కిడ్నాప్‌ కేసు దర్యాప్తును ఆపలేదు. 

 VIDEO CREDITS: INIDIATODAY Twitter(X)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement