కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగారు. ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఆన్‌లైన్ ఫామ్–6లో మార్పులు అక్రమంగా జరిగాయంటూ శుక్రవారం తన ఎక్స్‌లో ఆయన ఓ పోస్ట్ చేశారు. ఎవరి ఒత్తిడి మేరకు ఇలా చేశారో చెప్పాలంటూ వరుస ప్రశ్నలు సంధించారాయన.
ఎన్నికల సంఘం (ECI) సూచనల మేరకు టీసీఎస్ (TCS) తన డిజిటల్ పోర్టల్‌లో మార్పులు చేసిందా? ఒకవేళ చేస్తే.. ఆ మార్పులకు టీసీఎస్‌లో ఎవరు ఆమోదం తెలిపారు? వారిపై ఒత్తిడి ఏమైనా ఉందా? అంటూ రాహుల్ గాంధీ ఈసీని వరుస ప్రశ్నలు సంధించారు.
‘‘ఆన్‌లైన్ ఫామ్–6ను అక్రమంగా మార్చారు. ఈ మార్పుపై ఈసీలోని కమిషనర్లే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. టీసీఎస్‌ను ఈ మార్పు చేయాలని ఈసీలో ఎవరు ఆదేశించారు?’’ అని అని ప్రశ్నించారు. ఈ మార్పులకు టీసీఎస్‌లో ఎవరు ఆమోదం తెలిపారో, ఆ నిర్ణయం తీసుకునేలా వారిపై ఒత్తిడి తెచ్చారా? అని అడిగారు.
The online Form 6 was changed illegally - as the EC's own Commissioners have recorded.
Who at the ECI ordered Tata Consultancy Services to make that change?
Who at TCS signed off on it? And were they pressured into doing it?— Rahul Gandhi (@RahulGandhi) October 1, 2026
ఫామ్–6లో ఏం మారిందంటే..
కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫామ్–6ను ఉపయోగిస్తారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) సమయంలోనూ ఇది కీలకమైన ఫామ్. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో తొలగిపోయిన పేర్లను మళ్లీ ఓటర్ల జాబితాలో చేర్చుకోవడానికి కూడా దీనిని ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఈ ఫామ్‌కు అదనంగా ఓ డిక్లరేషన్ జత చేశారు. గతంలో జరిగిన ఎస్‌ఐఆర్ సమయంలో రూపొందించిన ఓటర్ల జాబితాలో దరఖాస్తుదారుడి పేరు ఉందా? లేక వారి తల్లిదండ్రులు లేదా తాత, నానమ్మ/అమ్మమ్మ పేర్లు ఉన్నాయా? అనే వివరాలను ఇందులో కోరారు.
ఇద్దరు ఈసీల అభ్యంతరాలు..
ఈ మార్పుపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ సంచలనాత్మక కథనం ఇచ్చింది. 1960 నాటి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోర్స్ రూల్స్‌లో నిర్దేశించిన ఫామ్‌ను నిబంధనలను సవరించకుండా మార్చే అధికారం ఎన్నికల సంఘానికి లేదని వారు అభిప్రాయపడినట్లు ఆ కథనం పేర్కొంది. ఇలాంటి మార్పులను సూచించే లేదంటే అమలు చేసే అధికారం న్యాయశాఖకు మాత్రమే ఉందని వారు చెప్పినట్లు తెలుస్తోంది.
ఈసీ వివరణ ఏంటి?
అయితే ఫామ్–6ను తాము మార్చలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అసలు చట్టబద్ధమైన ఫామ్–6 యథాతథంగానే ఉందని.. ఎస్‌ఐఆర్ ప్రక్రియ కోసం దానికి కేవలం ‘అనెక్సర్–డి’ అనే అదనపు డిక్లరేషన్‌ను జత చేశామని వివరించింది. మే 27న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ డిక్లరేషన్ జత చేసే అంశానికి సమర్థన లభించిందని కూడా ఈసీ పేర్కొంది. ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన నిర్ణయాలకు ముగ్గురు ఎన్నికల కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదం ఉందని తెలిపింది.
ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో తొలగింపు
ఎస్‌ఐఆర్ పూర్తయిన రాష్ట్రాల్లో ఫామ్–6కు జత చేసిన అదనపు డిక్లరేషన్‌ను సెప్టెంబర్ 30 నుంచి ఈసీఐనెట్(ECINET) పోర్టల్ నుంచి తొలగించాలని ఈసీ నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లో కొత్త ఓటర్లు సాధారణ ఫామ్–6తోనే దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్న 13 రాష్ట్రాల్లో ఈ అదనపు డిక్లరేషన్ అందుబాటులోనే ఉంటుంది. ఎస్‌ఐఆర్ పూర్తయిన రాష్ట్రాల్లో మాత్రమే ఈ అదనపు ఫామ్ అవసరం ఉండదని ఈసీ స్పష్టం చేసింది.
ఆందోళనలకు సిద్ధమవుతున్న విపక్షాలు
ఫామ్–6 వివాదంతోపాటు ఎస్‌ఐఆర్‌పై విపక్షాలు ఎన్నికల సంఘంపై విమర్శలు కొనసాగిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమన్వయ సమావేశంలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఆందోళనలకు నిర్ణయించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి 8వ తేదీ వరకు జిల్లా స్థాయిలో ‘సేవ్ డెమోక్రసీ మార్చ్’ నిర్వహిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. అక్టోబర్ 6న విపక్ష ఎంపీలు ఎన్నికల సంఘం కార్యాలయం వరకు మార్చ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ రెండో వారంలో ఇండియా కూటమి నేతలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి తమ అభ్యంతరాలను వివరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఫామ్–6లో మార్పులపై రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రధాన ప్రశ్న మాత్రం ఇదే. ఈ మార్పు చేయాలని టీసీఎస్‌ను ఆదేశించింది ఈసీలో ఎవరు? ఆ నిర్ణయానికి ఎవరు ఆమోదం తెలిపారు?. ఈ ప్రశ్నలపై ఎన్నికల సంఘం, టీసీఎస్ నుంచి వచ్చే తదుపరి వివరణ కీలకంగా మారనుంది.
ఇదీ చదవండి: ఆఫ్రికా నుంచి సీబీఐ ఆఫీసర్లా?


