‘గోంధాల్‌’.. మహారాష్ట్రకు గర్వకారణం: సీఎం ఫడ్నవీస్ | Indias Oscar Entry Gondhal Honoured by Maharashtra CM Devendra Fadnavis | Sakshi
Sakshi News home page

‘గోంధాల్‌’.. మహారాష్ట్రకు గర్వకారణం: సీఎం ఫడ్నవీస్

Oct 1 2026 9:50 AM | Updated on Oct 1 2026 10:11 AM

Indias Oscar Entry Gondhal Honoured by Maharashtra CM Devendra Fadnavis

ముంబై: 99వ అకాడమీ అవార్డులకు (ఆస్కార్‌ 2027) భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపికైన మరాఠీ చిత్రం ‘గోంధాల్’ బృందాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేకంగా కలిసి అభినందించి, సత్కరించారు. ఈ సినిమా మహారాష్ట్రకు గర్వకారణమన్నారు. ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (ఐఎఫ్‌టీడీఏ) అధ్యక్షుడు అశోక్ పండిత్ చొరవతో, బీజేపీ ముంబై అధ్యక్షుడు అమిత్ సతమ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర రచయిత-దర్శకుడు-నిర్మాత సంతోష్ దవాఖర్, నిర్మాత దీక్షా దవాఖర్, నటీనటులు కిశోర్ కదమ్, ఇషితా దేశ్‌ముఖ్, యోగేష్ సోహోనీలతో పాటు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) జనరల్ సెక్రటరీ అశోక్ దూబే తదితరులు పాల్గొన్నారు.

చిత్ర  కథాంశం
ఈ చిత్రం మహారాష్ట్రలో శతాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయ ఆచారమైన 'గోంధాల్' ఆధారంగా రూపొందించిన సైకలాజికల్ థ్రిల్లర్. ఈ ఆచారాన్ని కేవలం నేపథ్యంగా మాత్రమే కాకుండా, కథకు మూలస్తంభంగా నిలిపారు. ఒకే ఒక్క రాత్రిలో జరిగే సంఘటనల చుట్టూ తిరిగే ఈ కథ, మానవ సంబంధాలు, దాగి ఉన్న రహస్యాలు, విశ్వాసం, ద్రోహం, భావోద్వేగాల సంఘర్షణను  తెరపై చూపారు.

అవార్డులు.. థియేట్రికల్ విడుదల
ఈ చిత్రం ఇప్పటికే అంతర్జాతీయ చిత్రోత్సవాలలో గుర్తింపు పొందింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ)లో సంతోష్ దవాఖర్ ఉత్తమ దర్శకుడిగా 'సిల్వర్ పీకాక్' పురస్కారాన్ని దక్కించుకోగా, బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌లోనూ ఈ చిత్రానికి అవార్డు లభించింది. తమ సాంస్కృతిక మూలాల కథ ప్రపంచ వేదికపై నిలవడం గర్వకారణమని దర్శకుడు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని మరాఠీతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

ఇదీ చదవండి: క్రిస్టా కేసులో ఊహకందని మలుపులు.. ఆఖరికి ఉరిశిక్ష ఖరారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement