ప్రపంచానికి షాక్‌.. 31 ఏళ్ల సన్యాసి కఠోర సాధన! | Japanese Monk Begins 12 Year Isolation Until 2038 for Rigorous Spiritual Training | Sakshi
Sakshi News home page

ప్రపంచానికి షాక్‌.. 31 ఏళ్ల సన్యాసి కఠోర సాధన!

Oct 1 2026 8:06 AM | Updated on Oct 1 2026 8:06 AM

Japanese Monk Begins 12 Year Isolation Until 2038 for Rigorous Spiritual Training

జపాన్‌కు చెందిన 31 ఏళ్ల బౌద్ధ సన్యాసి సోగాకు టగుచి కఠోర ఆధ్యాత్మిక సాధన కోసం 12 ఏళ్ల ఏకాంత జీవితంలోకి వెళ్లారు. సెప్టెంబర్‌ 11, 2026న ఈ సాధనను ప్రారంభించిన ఆయన.. సెప్టెంబర్‌ 11, 2038 వరకు ఆలయ ప్రాంగణాన్ని వీడకుండా, ఇతర వ్యక్తులను కలవకుండా ఉండనున్నారు. ఈ కఠిన సాధన గతంలో పలువురు సన్యాసులు అవలంబించి ప్రాణాలను దైవంలో విలీనం చేశారు.

ఒట్సులోని మౌంట్‌ హియేలో ఉన్న నంజాంబో ఆలయానికి టగుచి ప్రధాన సన్యాసిగా ఉన్నారు. ఈ ఆలయం ఎన్ర్యాకు‌జీ ఆలయ సముదాయంలో భాగం. టగుచి అక్కడి జోడో-ఇన్‌ హాల్‌లో ఉంటారు. బౌద్ధంలోని టెండై శాఖ వ్యవస్థాపకుడు సైచోకు స్థాపించిన ఈ ప్రదేశంలోనే ఆయన తన సాధన కొనసాగించనున్నారు. ఈ కాలంలో బయట ప్రపంచానికి సంబంధించిన విషయాలు తెలుసుకోకుండా, ఇతరులతో ఎలాంటి సంబంధం లేకుండా జీవించనున్నారు.

టగుచి సాధనలో కఠినమైన రోజువారీ నియమాలను పాటించనున్నారు. తీవ్రమైన చలికాలంలోనూ ఆధ్యాత్మిక సాధనలు కొనసాగించడంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేయడం, ఆహారం వండడం వంటి పనులు కూడా చేయాల్సి ఉంటుంది. వండిన ఆహారాన్ని సమాధి వద్ద సమర్పిస్తారు. ఈ విధమైన కఠోర శిక్షణను గతంలో అనుసరించిన కొందరు సన్యాసులు అనారోగ్యానికి గురై మరణించారని చెబుతారు.

ఎన్ర్యాకు‌జీ ఆలయ వివరాల ప్రకారం.. 1699 తర్వాత జిషిన్‌ అనే హోదాను పొందుతున్న 118వ వ్యక్తి టగుచి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఈ సాధనను చేపట్టిన ఎనిమిదో వ్యక్తి ఆయనే. జిషిన్‌గా మారే ప్రయాణంలో ‘కోసోగ్యో’ అనే కఠిన సాధన ఉంటుంది. ఇందులో రోజుకు 3,000 సార్లు ప్రతి బుద్ధుడికి ధూపం సమర్పించి, వారి పేర్లను జపిస్తూ పదేపదే సాష్టాంగ నమస్కారాలు చేయాలి.

కోసోగ్యో సాధనలో ఎదురయ్యే తీవ్ర అలసట కారణంగా సాధకుడికి బుద్ధుడి రూపం స్పష్టంగా కనిపించే అనుభూతి కలుగుతుందని చెబుతారు. టగుచి గత ఏడాది ఇదే సమయంలో కోసోగ్యో సాధనను ప్రారంభించారు. దాన్ని పూర్తి చేసిన అనంతరం కైడాన్-ఇన్‌ హాల్‌లో ‘జిసే జుకై’ అనే స్వయంగా స్వీకరించే దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏకాంత జీవితాన్ని ప్రారంభించే ముందు ఆయన తన సాధనపై ఆనందం వ్యక్తం చేశారు.

మౌంట్‌ హియేలో ‘కైహోగ్యో’ అనే అత్యంత కఠినమైన సాధన కూడా కొనసాగుతుంది. ఇందులో సన్యాసులు ఏడేళ్లలో 1,000 రోజుల పాటు పర్వతం చుట్టూ నడుస్తారు. మొదటి మూడు సంవత్సరాల్లో ఏడాదికి వరుసగా 100 రోజుల పాటు రోజూ 30 కిలోమీటర్లు నడవాలి. నాలుగు, ఐదో సంవత్సరాల్లో రోజుకు నడకను 200 రోజుల వరకు కొనసాగించాలి. అనంతరం తొమ్మిది రోజుల పాటు ఆహారం, నీరు తీసుకోకుండా, నిద్రపోకుండా, పడుకోకుండా మంత్రాలను జపించే దశ ఉంటుంది. చివరి దశల్లో రోజుకు 60 కిలోమీటర్లు, ఆ తర్వాత 84 కిలోమీటర్లు, చివరగా 30 కిలోమీటర్ల చొప్పున నడవాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: రోడ్డు దాటుతుంటే ప్రమాదం.. తప్పెవరిది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement