‘హ్యాట్సాఫ్‌ రియల్‌ హీరో..’ భారత పైలట్‌పై ట్రంప్‌, నెతన్యాహు ప్రశంసలు | Flydubai Incident: Trump Netanyahu Praise Indian Pilot Smit Machchhar | Sakshi
Sakshi News home page

హ్యాట్సాఫ్‌ హీరో.. భారత పైలట్‌పై ట్రంప్‌, నెతన్యాహు ప్రశంసలు

Oct 1 2026 6:50 AM | Updated on Oct 1 2026 6:50 AM

Flydubai Incident: Trump Netanyahu Praise Indian Pilot Smit Machchhar

విమానం గాల్లో ఉంది.. ఒక్కసారిగా కాక్‌పిట్‌లో కలకలం. కో-పైలట్‌ కత్తితో కెప్టెన్‌పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఆ భారత పైలట్‌ వెనక్కి తగ్గలేదు. కాక్‌పిట్‌ తలుపు తెరిచి బయటకు వచ్చి సంకేతం ఇచ్చాడు. ప్రయాణికులు, ఇతర సిబ్బంది వెంటనే స్పందించడంతో పెను విమాన ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రశంసలు కురిపించారు.

ఫ్లై దుబాయ్‌ విమానం FZ1073లో జరిగిన ఘటనపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్పందించారు. ‘‘భారత పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ అసాధారణ ధైర్యానికి నా సెల్యూట్‌’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడినప్పటికీ మచ్చర్‌ ప్రతిఘటించి కాక్‌పిట్‌ తలుపు తెరిచారని తెలిపారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోగలిగారని పేర్కొన్నారు. ఈ చర్య పెను విమాన ప్రమాదాన్ని నివారించిందని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా స్మిత్‌ మచ్చర్‌ను ‘హీరో’గా అభివర్ణించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తనకు చెప్పిన వివరాలను మీడియాతో పంచుకున్న ట్రంప్‌.. తీవ్రంగా గాయపడినప్పటికీ పైలట్‌ చేసిన చర్యను అద్భుతమైనదిగా పేర్కొన్నారు.

30 సెకన్లలో 14 వేల అడుగులు కిందకు!
భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం దుబాయ్‌-టెల్‌అవీవ్‌ మధ్య ప్రయాణిస్తున్న బోయింగ్‌ 737 MAX 8 విమానం పైలట్‌, కో-పైలట్‌ మధ్య కాక్‌పిట్‌లో ఘర్షణతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో కో-పైలట్‌ కెప్టెన్‌ మచ్చర్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. అనంతరం విమానం ఒక్కసారిగా ఎత్తు కోల్పోయింది. ఫ్లైట్‌ ట్రాకింగ్‌ డేటా ప్రకారం కేవలం 30 సెకన్లలో దాదాపు 14 వేల అడుగుల మేర కిందికి పడిపోయింది.

విమానంలోని ప్రయాణికులకు పరిస్థితి అర్థమయ్యేలోపే కాక్‌పిట్‌ నుంచి అరుపులు వినిపించాయి. ఇదే సమయంలో గాయపడిన కెప్టెన్‌ మచ్చర్‌ కాక్‌పిట్‌ తలుపు తెరిచారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లే అవకాశం ఏర్పడింది.

‘‘విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడు’’
ఈ దాడికి సంబంధించి సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. కో-పైలట్‌ విమానం వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రయాణికుడు యానివ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చర్‌ కాక్‌పిట్‌ తలుపు తెరిచి కుప్పకూలిన తర్వాత ప్రయాణికులు లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానంలో ఉన్న మరో సెట్‌ పైలట్లు కాక్‌పిట్‌లోకి చేరుకుని విమానాన్ని కంట్రోల్‌ చేయగలిగారు. అటు నుంచి సౌదీ అరేబియాలోని టబుక్‌కు మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయింది.

ఎవరీ స్మిత్‌ మచ్చర్‌?
స్మిత్‌ మచ్చర్‌ భారత పౌరుడు. బోయింగ్‌ 737 విమానాలపై ఆయనకు 13 ఏళ్లకు పైగా వాణిజ్య విమానయాన అనుభవం ఉంది. సుమారు 9,750 గంటల ఫ్లయింగ్‌ అనుభవం ఉన్నట్లు ఆయన లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌ ఆధారంగా వివరాలు వెల్లడయ్యాయి. 2011లో స్పైస్‌జెట్‌లో చేరిన మచ్చర్‌.. అక్కడ లైన్‌ ట్రైనింగ్‌ కెప్టెన్‌, సీనియర్‌ కమాండర్‌గా పనిచేశారు. 2022 జూన్‌లో స్పైస్‌జెట్‌ను వీడి ఫ్లై దుబాయ్‌లో డైరెక్ట్‌ ఎంట్రీ కెప్టెన్‌గా చేరారు. ఆయన సోదరుడు కూడా ఇటీవల ఫ్లై దుబాయ్‌లో చేరినట్లు సమాచారం.

ఆసుపత్రిలో చికిత్స.. పరిస్థితి నిలకడగా
కాక్‌పిట్‌ ఘటనలో తీవ్రంగా గాయపడిన మచ్చర్‌ను సౌదీ అరేబియాలోని టబుక్‌ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స కొనసాగుతోంది. భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్‌ ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులతోనూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.

‘‘180 మంది ప్రాణాలు కాపాడారు’’
ఇజ్రాయెల్‌ అంబాసిడర్‌ రూవెన్‌ అజార్‌ కూడా మచ్చర్‌ను ప్రశంసించారు. అనుభవజ్ఞుడైన, ప్రతిభావంతుడైన భారత పైలట్‌గా అభివర్ణించారు. మచ్చర్‌తో పాటు ప్రయాణికులు, సిబ్బంది చూపిన ధైర్యం 180 మంది ప్రాణాలను కాపాడిందని పేర్కొన్నారు.

విమానం టబుక్‌లో సురక్షితంగా దిగిన తర్వాత ప్రయాణికులు సుమారు ఎనిమిది గంటలు సౌదీ అరేబియాలో ఉన్నారు. అనంతరం ప్రత్యామ్నాయ ఫ్లై దుబాయ్‌ విమానంలో ఇజ్రాయెల్‌కు బయలుదేరారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడినా.. విమానాన్ని కాపాడేందుకు చివరి వరకు పోరాడిన భారత పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటున్నారు.

ఇదీ చదవండి: యూఏఈలో వాహనదారులకు షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement