అమెరికాలో మధ్యంతర ఎన్నికలు.. ట్రంప్‌పై ఇరాన్‌‌ పిడుగు! | Iran IRGC Targets Trump Ahead Of US Midterm Elections, Open Letter To American Voters Sparks Political Debate | Sakshi
Sakshi News home page

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు.. ట్రంప్‌పై ఇరాన్‌‌ పిడుగు!

Sep 30 2026 2:54 PM | Updated on Sep 30 2026 3:23 PM

Iran Targets US Voters with Open Letter Ahead of Midterms, Challenging Trump

టెహ్రాన్: అంతర్జాతీయ రాజకీయాల్లో ఊహించని సరికొత్త డ్రామా తెరపైకి వచ్చింది. అమెరికాలో మధ్యంతర (మిడ్‌టర్మ్) ఎన్నికల వేళ అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇరాన్ గట్టిగానే షాకిచ్చింది.

ట్రంప్ పాలనా విధానాలను, ఆయన తీసుకుంటున్న అడ్డగోలు నిర్ణయాలను నేరుగా వ్యతిరేకించాలంటూ ఇరాన్‌కు చెందిన అత్యంత శక్తివంతమైన సైనిక దళం ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ (IRGC) అమెరికన్ ఓటర్లకు ఒక బహిరంగ లేఖను సంధించింది. సరిగ్గా ఎన్నికలకు ఐదు వారాల ముందు విడుదలైన ఈ 25 పేజీల సంచలన లేఖ ఇప్పుడు అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది! ట్రంప్ రాజకీయ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తూ ఇరాన్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ అగ్రరాజ్యంలో పెద్ద మంటలే రేపుతోంది.

అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దళాలు ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించి ఏడు నెలలు గడిచిన తరుణంలో ఈ లేఖ వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా పౌరులకు, అక్కడి స్వార్థపూరిత రాజకీయ నాయకత్వానికి మధ్య చాలా తేడా ఉందని ఐఆర్‌జీసీ ఈ లేఖలో ఎత్తిచూపింది. ఇరాన్ సామాన్య ప్రజలు, అమెరికన్ పౌరులు ఇద్దరూ కూడా ఖరీదైన యుద్ధాలను ప్రోత్సహించే లీడర్ల బాధితులేనని వాదించింది. ఇజ్రాయెల్‌కు ట్రంప్ ఇస్తున్న గుడ్డి మద్దతును నిలిపివేయాలని, విదేశీ సైనిక జోక్యాలను తక్షణమే వ్యతిరేకించాలని అమెరికన్లను ఈ లేఖ కోరింది.

వాషింగ్టన్ తన ఓటమిని అంగీకరించాలి
టెహ్రాన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి జనరల్ హోస్సేన్ మొహెబ్బీ ఈ లేఖపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత సంఘర్షణకు తెరపడాలంటే వాషింగ్టన్ తన ఓటమిని అంగీకరించి, సైనిక బలగాలను వెనక్కి తీసుకోవడమే ఏకైక మార్గమని తేల్చిచెప్పారు. అమెరికాలో ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉన్న తరుణాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ లేఖను విడుదల చేశామని ఆయన కుండ బద్దలు కొట్టారు. అణు ఆయుధాల ముసగులో ట్రంప్ చేస్తున్న డ్రామాలన్నీ ప్రపంచాన్ని మోసం చేయడానికేనని, తమ యురేనియం శుద్ధి కేవలం శాంతియుత ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు.

‘డెత్ టు అమెరికా’ అసలు అర్థం అదే!
ఇరాన్ రాజకీయ వ్యవస్థలో తరచూ వినిపించే వివాదాస్పద నినాదం ‘డెత్ టు అమెరికా’పై కూడా ఈ లేఖలో క్లారిటీ ఇచ్చారు. ఈ నినాదం అమెరికన్ ప్రజలను ఉద్దేశించి కాదని, వైట్‌హౌస్‌ను కేంద్రంగా చేసుకుని పాలిస్తున్న ‘దయ్యం లాంటి పాలక వర్గాన్ని’ అంతం చేయాలని కోరుతూ చేసే ప్రార్థన మాత్రమేనని వివరించారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ వేలాది వైమానిక దాడులు చేసినప్పటికీ, తమ మౌలిక సదుపాయాలను దెబ్బతీశారే తప్ప తాము నిర్దేశించుకున్న ఏ ఒక్క లక్ష్యాన్నీ సాధించలేకపోయాయని, చివరికి అమెరికా సైనిక ఆస్తులకే భారీ నష్టం వాటిల్లిందని ఐఆర్‌జీసీ ఘాటుగా హెచ్చరించింది.

ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకు ట్రంప్ తంటాలు..
ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న ఈ మధ్యంతర ఎన్నికలు కేవలం కాంగ్రెస్ స్థానాల కోసమే అయినప్పటికీ, ఇవి పూర్తిగా ట్రంప్ పాలనా తీరుపై ప్రజాభిప్రాయాన్ని తెలిపే రెఫరెండ్‌లా మారాయి. ద్రవ్యోల్బణం,పెరుగుతున్న జీవన వ్యయం వల్ల రిపబ్లికన్ పార్టీకి, ట్రంప్ విధానాలకు వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరుగుతోంది. ఈ ఎన్నికల ఉచ్చు నుంచి బయటపడేందుకు ట్రంప్ తంటాలు పడుతూ.. అమెరికన్ ఓటర్లకు ఏకంగా ఐదు వేల డాలర్లు ఇస్తానంటూ వరాల జల్లు కురిపిస్తున్నారు.

వియత్నాం యుద్ధ కాలంలో అమెరికన్ సైనికులను తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి ప్రసారాలను ఉపయోగించిన ‘హనోయ్ హన్నా’తరహా వ్యూహాన్నే ఇప్పుడు ఇరాన్ అచ్చం దింపిందని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. వాషింగ్టన్ పెద్దలను లైట్‌ తీసుకుని, నేరుగా అమెరికన్ ఓటర్లతోనే ఇరాన్ చక్రం తిప్పుతుండటంతో ట్రంప్‌నకు నిద్రపట్టడం లేదు.

మరోవైపు ఇరాన్ కరెన్సీ 'రియల్' విలువ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా పడిపోయి, ఒక అమెరికన్ డాలర్‌కు ఏకంగా 25 లక్షల రియల్స్‌కు చేరినప్పటికీ... ఇరాన్ మాత్రం తగ్గేదేలే అన్నట్టు ట్రంప్‌ను వేదికపైనే కార్నర్ చేస్తుండటం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement